‘రేఖాబాండ్‌ 1000’ అంటే...
close
Published : 10/04/2021 01:55 IST

‘రేఖాబాండ్‌ 1000’ అంటే...

చదువంటే ఇష్టం ఆమెకు... దాన్ని తనకి అందివ్వడానికి.... మ్మానాన్నలు ఎంత కష్టపడ్డారో కళ్లారా చూసింది. అందుకే అలాంటి పరిస్థితి మరే చిన్నారికీ రాకూడదనుకుంది. అందుకోసం తన బడిలో ఒకటో తరగతిలో చేరిన ప్రతి విద్యార్థి పేరునా కొంత నగదు డిపాజిట్‌ చేస్తోంది. ఆ డబ్బే తర్వాత వారి పైచదువులకు  సాయం చేస్తుందనేది ఆవిడ ఆశ. ఆ వెలుగు ‘రేఖ’ ప్రస్థానాన్ని చదివేద్దాం రండి.

నా పేరు రేఖా కులాల్‌. అందరూ నన్ను రేఖా బాండ్‌గా పిలుస్తుంటారు. ఆ పేరు నాకెలా వచ్చిందో చెప్పడానికి ముందు నా గురించి చెబుతాను. మాది కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా శంకరనారాయణ గ్రామం. నిరుపేద కుటుంబం. అమ్మా నాన్నలు వ్యవసాయ కూలీలుగా...అతి కష్టం మీద నన్ను ఇంటర్‌(పీయూసీ) దాకా చదివించారు. నా చదువుకి ఎవరైనా(స్కాలర్‌షిప్‌) సాయం చేస్తారేమోనని పేపర్లు తిరగేసేదాన్ని. వాటికి దరఖాస్తు చేసేదాన్ని. అలా 7వ తరగతి నుంచి డీఈడీ దాకా నా చదువంతా ఉపకారవేతనం, దాచుకున్న సొమ్ముతోనే కొనసాగింది నా ప్రతిభను గుర్తించి దాతలు ఇచ్చే ప్రతి మొత్తం నాన్న బ్యాంకులో డిపాజిట్‌ చేసేవారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పైసా కూడా అందులో నుంచి తీసేవారు కాదు. ఇంటర్‌కి వచ్చేసరికి అమ్మానాన్నలకు కుటుంబ పోషణ భారంగా మారింది. నాన్న, గురువు సలహాతో బోధనా వృత్తిని ఎంచుకోవాలనుకున్నా. డీఈడీ(టీటీసీ) పరీక్ష రాశా. అప్పటికి దాతలు ఇచ్చిన మొత్తం డిపాజిట్‌లు ఐదువేల రూపాయలయ్యాయి. ఎయిడెడ్‌ కళాశాలలో సీటు రావటంతో ఆ సొమ్ము అప్పుడు అక్కరకు వచ్చింది.
నాలా ఇబ్బంది పడకూడదనే...
డీఈడీ పూర్తయ్యాక... టీచర్‌ పోస్టుల నియామక(సీఈటీ) పరీక్ష అర్హత సాధించడంతో హొసనగర తాలూకాలోని నుల్లిగెరె ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగం వచ్చింది. నేను చేరిన తొలి రోజుల్లో ఏటా ఒకరిద్దరు చిన్నారులే ఒకటో తరగతిలో చేరేవారు. ప్రభుత్వ బడుల్లో ఎన్ని సదుపాయాలున్నా... ప్రైవేటు పాఠశాలలకే తమ పిల్లల్ని పంపించడానికి అమ్మానాన్నలు ఇష్టపడటం గమనించా. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. పిల్లల పేరిట ఓ వెయ్యి రూపాయలు డిపాజిట్‌ చేస్తే ఎలాగుంటుంది అని అనుకున్నా. వెంటనే దగ్గర్లోని కెనరా బ్యాంకుకు వెళ్లి ఆరా తీశా.  తోటి ఉపాధ్యాయులు నీకేమైనా పిచ్చా అన్నారు. కానీ నేను చదివిందే ఆర్థిక సమస్యల మధ్య అని వారికి తెలియదు కదా అనుకుని మిన్నకుండి పోయా. ఒకటో తరగతిలో మా బళ్లో చేరిన పిల్లల పేరున వెయ్యి రూపాయలు డిపాజిట్‌ చేస్తా అని ఆ గ్రామంలో ప్రచారం చేశా. అలా 2014లో ముగ్గురు విద్యార్థులు చేరారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. 2015లో ఆరుగురు వచ్చారు. అలా ఏటేటా పెరుగుతూ వచ్చారు. 2020 నాటికి 63మందికి వెయ్యిరూపాయల చొప్పున డిపాజిట్‌ చేశా.

దిల్లీ నుంచి కూడా ఫోన్లొస్తున్నాయి
నేను ప్రారంభించిన ఈ బాండ్‌ పథకంతో నా పేరే రేఖా బాండ్‌గా మారిపోయింది. ఈ విషయం తెలిసి మా విద్యాశాఖ మంత్రి నుంచి దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దాకా ఎందరి నుంచో అభినందనలు వచ్చాయి. దిల్లీ మోడల్‌ స్కూల్‌లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుందని నన్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేను చేసే డిపాజిట్‌ సొమ్ము ఏమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఇది పిల్లల్లో పొదుపునకు ఉన్న విలువ ఏమిటో తెలియజేస్తుందని నా విశ్వాసం. ఫారెస్ట్‌ రేంజర్‌గా పనిచేస్తోన్న నా భర్త ప్రభాకర్‌ కూడా నాలా ఆర్థిక సమస్యల మధ్యే చదువుకుని వచ్చినవారు. ఆయనా నా ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ఏ స్కూల్‌కు వెళ్లినా ఈ బాండ్‌ పథకాన్ని కొనసాగిస్తా. పిల్లల సంఖ్య
పెరిగి... డిపాజిట్‌ సొమ్ము వేయలేని స్థితి ఎదురైతేనే... దాతల కోసం ఎదురుచూస్తా తప్ప ఈ సేవను మాత్రం ఆపను.

- కె.ముకుంద, బెంగళూరు

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి