‘శెబాశ్‌’ అన్న పార్లమెంటరీ కమిటీ!
close
Updated : 15/04/2021 01:35 IST

‘శెబాశ్‌’ అన్న పార్లమెంటరీ కమిటీ!

పదో తరగతిలోనే పెళ్లి, పద్దెనిమిదేళ్లకు ఇద్దరు పిల్లలు. తాగుడుకు బానిసై ఎటో వెళ్లిపోయిన భర్త. కాలే కడుపులు. ఆ పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం కూలీగా మారిన రెడ్డెమ్మ స్వయం ప్రతిభతో డ్వాక్రాలో వేలమందిని నడిపించే స్థాయికి  ఎదిగారు. మారుమూల పల్లెటూళ్లో పుట్టి హిందీలో మంచి పట్టు సాధించి ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేసిన రెడ్డెమ్మ తన ప్రస్థానాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారు.

చిన్నప్పటి నుంచి నేను చాలా తెలివైన విద్యార్థిని. క్లాసులో ఫస్ట్‌ వచ్చేదాన్ని. బాగా చదువుకుని మంచి స్థాయికి వెళ్లాలని కలలు కంటూండేదాన్ని. కానీ, విధి నా జీవితంతో ఆడుకుంది. అయినా సమస్యలకు ఎదురీది ధైర్యంగా ముందుకు సాగాను. మా స్వస్థలం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లె. సాధారణ వ్యవసాయ కుటుంబం. ఆర్థిక ఇబ్బందులతో అమ్మానాన్నలు పదో తరగతిలోనే నాకు పెళ్లి చేశారు. జీవితం అంటే ఏంటో తెలియని వయసు. పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలకు తల్లిని కూడా అయ్యాను. తాగొచ్చిన భర్త చేతిలో రోజూ దెబ్బలు. కనీసం పిల్లలకు పాలు కొనడానికి కూడా రూపాయి చేతిలో ఉండేది కాదు. ఓ రోజు నన్ను, పిల్లల్ని మా పుట్టింట్లో వదిలేసి నా భర్త ఎటో వెళ్లిపోయాడు. తిరిగొస్తాడని చాలాకాలం ఎదురు చూశా. ఫలితం లేదు. పుట్టింట్లో ఆర్థికంగా తీవ్ర కటకట. ఇక బిడ్డల పోషణ కోసం కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టా. 2007లో రాఘవేంద్రస్వామి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరా. సభ్యుల బ్యాంకు రుణాలు, చెల్లింపు వివరాలకు సంబంధించిన పుస్తక నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నా. అదంతా గమనించిన అప్పటి డీఆర్‌డీఏ  (జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ) ఏరియా కోఆర్డినేటర్‌ ప్రభావతి నాకు పుస్తక నిర్వహణ, మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌, సంఘాల నిర్వహణ మీద శిక్షణ ఇప్పించారు. తర్వాత 2013 వరకు బుక్‌కీపర్‌గా జిల్లాలోని 66 మండలాల్లో పర్యటించి డ్వాక్రా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాను. అదే ఏడాది అనంతపురం డీపీఎం బుక్‌ కీపర్స్‌ కోసం నిర్వహించిన ముఖాముఖిలో నా పనితీరు చూసి సీఆర్‌పీ (కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌), బుక్‌ కీపర్‌గా మరోసారి   ఎంపిక చేశారు. తర్వాత సీనియర్‌  సీఆర్‌పీ కూడా అయ్యా.

ఎక్కడికెళ్లినా మంచి పేరు
సీఆర్‌పీ, ఎస్‌ఆర్‌పీ, బుక్‌కీపర్‌లకు అనంతపురంలోని అనంత మహా సమైక్య కార్యాలయంలో 90 రోజుల పాటు హిందీ భాషలో శిక్షణ ఇచ్చారు. జీవితంలో ఎదగాలంటే అందులో విజయం సాధించాలని గట్టిగా నిర్ణయించుకుని చాలా కష్టపడి హిందీ నేర్చుకున్నా. మొదట పరీక్ష నిర్వహించి మమ్మల్ని శిక్షణకు ఎంపిక చేశారు. రోజు వారీ పాఠాల మీద పెట్టే ప్రతి పరీక్షలో కూడా నాకు మంచి మార్కులు వచ్చేవి. హిందీ రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చాక మొదట ఝార్ఖండ్‌ రాష్ట్రానికి బుక్‌ కీపర్‌గా పంపించారు. 2014 నుంచి ఆరేళ్లపాటు ఝార్ఖండ్‌తోపాటు రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొత్త డ్వాక్రా సంఘాలు, గ్రామ, మండల సమైక్య సంఘాలు ఏర్పాటు చేశారు. వాటిలో బుక్‌ కీపర్‌, సీఆర్పీ, ఎస్‌ఆర్పీగా పనిచేశా. ఇలా ప్రతిసారీ 45 రోజుల చొప్పున 30 సార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లొచ్చా. ఎక్కడికి వెళ్లినా బాగా పనిచేస్తుందనే మంచి పేరు తెచ్చుకున్నా. బాగా చదువుకుని నలుగురికీ మంచి చేయాలనుకున్న నాకు దేవుడు ఈ రకంగా మార్గం  చూపించాడేమో అని ఎప్పుడూ అనుకుంటుంటాను. మొదట్లో స్థానికులతో హిందీలో మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా అనిపించేది. తోటి సభ్యులతో కలిసి హిందీ వ్యాకరణం చదువుకుని పూర్తి పట్టు సాధించా. ఈ జనవరిలో కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పులిచెర్ల మండలం పర్యటనకు వచ్చినప్పుడు.. కల్లూరు హైస్కూల్లో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశంలో హిందీలో తడుముకోకుండా మాట్లాడా. డ్వాక్రా సంఘంలో చేరక ముందు గ్రామీణ మహిళలు పడ్డ కష్టాలు, అనంతరం ఆర్థికంగా ఎదిగిన తీరు గురించి వివరించా. నా ప్రసంగం విని స్టాండింగ్‌ కమిటీ చాలా మెచ్చుకుంది. కూలి పనులు చేసుకునే నేను పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను. ఈ క్రమంలో ఎన్నో బాధలు, అవమానాలు పడ్డాను. మా పాప ఇంటర్‌, బాబు బీటెక్‌ చదువుతున్నారు. కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌గా జిల్లాలో అయితే రోజుకి రూ.250, ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు రూ.1,750 గౌరవ వేతనం ఇచ్చేవారు. కరోనా వల్ల క్షేత్ర స్థాయిలో పర్యటించే అవకాశం లేకపోవడంతో ఆదాయం ఆగిపోయింది. తిరుపతిలో ఓ చేపల మార్కెట్లో పనిచేస్తున్నా. ఏ పనైనా నిబద్ధతతో చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని గట్టిగా నమ్ముతాను.

- కృష్ణకుమారి గుడికోన, తిరుపతి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి