అను.. సాధికారతకు దన్ను
close
Published : 15/04/2021 01:15 IST

అను.. సాధికారతకు దన్ను

మహిళలు కూడా కంపెనీలు స్థాపించి సమర్థంగా నడపగలరు. వాళ్లని ప్రోత్సహించడమే నా లక్ష్యం అంటారు అను దుగ్గల్‌. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా కెరియర్‌ మొదలుపెట్టిన ఆమె తర్వాత వెంచర్‌ క్యాపిటలిస్టుగా మారారు. మహిళా  పారిశ్రామికవేత్తలకు ఆర్థిక బలం అందించడానికి కృషి చేస్తున్నారు. 

‘మహిళా వ్యాపారవేత్తలకు సమాజంలో అవకాశాలు ఎన్ని ఉన్నాయో, సవాళ్లూ అన్నే ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది మహిళలు సొంతగా కంపెనీలు పెడుతున్నారు. అయితే నిధుల సమస్య వారికి ప్రధాన ఆటంకంగా ఉంటోంది. వారికి  ఆర్థిక ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ఉద్భవించిందే ఫిమేల్‌ ఫౌండర్స్‌ ఫండ్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)’ అంటారు అను దుగ్గల్‌. నిజానికి ఫైనాన్సింగ్‌ తన రక్తంలోనే ఉందన్నది అను మాట. ఆమె తండ్రి ఫైనాన్స్‌ సంస్థల్లో పని చేసేవారు. దాంతో ఆమె బాల్యం భారత్‌తోపాటు టోక్యో, హాంకాంగ్‌, అమెరికాల్లో గడిచింది. పాతికేళ్ల వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారామె. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని 2005లో ముంబయిలో తొలిసారి ఏర్పాటు చేసిన ‘లగ్జరీ వైన్‌ బార్‌’ సహ వ్యవస్థాపకుల్లో ఈమె కూడా ఒకరు. దక్షిణాసియా ఫ్యాషన్‌, ఆభరణాలు, గృహాలంకరణ సామగ్రిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2010లో ఏర్పాటైన ఎక్స్‌క్లూజివ్‌లీ.ఇన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌కి కూడా సహ వ్యవస్థాపకురాలు. దీన్ని తర్వాత ఈ కామర్స్‌ సంస్థ మింత్రా కొనుగోలు చేసింది. 2012లో న్యూయార్క్‌లో టాప్‌ 100 పెట్టుబడిదారుల్లో ఒకరిగా నిలిచారు అను. బాలీవుడ్‌ డ్యాన్స్‌ ఆధారిత ఫిట్‌నెస్‌ కంపెనీ ‘దూనియా’కు కూడా కొన్నాళ్లు సీఈవోగా ఉన్నారు.

40 కంపెనీల్లో...
పనే నా ప్రపంచం, అందులోనే ఆనందం వెతుక్కుంటాను అంటారు లండన్‌ బిజినెస్‌ స్కూల్లో ఎంబీఏ చేసిన అను. ఆమె సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ 2014లో ప్రారంభమై తొలి దశలోనే ఐదు మిలియన్‌ డాలర్ల నిధులు సాధించింది. 2018 మే నాటికి మళ్లీ 27 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. తన కృషికి గుర్తింపుగా 2018లో ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ ‘40 అండర్‌ 40’ జాబితాలో చోటు దక్కించుకున్నారు అను. థ్రైవ్‌ గ్లోబల్‌, ఎలోక్వీ, జోలా, మావెన్‌, కోస్టార్‌ లాంటి సంస్థలకు ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ నిధులు అందించింది. మొత్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న, మహిళల సారథ్యంలో ఉన్న దాదాపు 40 టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌. ‘‘వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) రంగం మీద కూడా కొవిడ్‌-19 చాలా ప్రతికూల ప్రభావం చూపింది. కొవిడ్‌ వల్ల మహిళా సారథ్యంలోని కంపెనీలకు వీసీ ఫండ్లు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. అయితే, వీరికి ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ ఎప్పటికీ దన్నుగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో విద్య, ఆరోగ్య  సంరక్షణ, వర్క్‌ ఫ్రం హోమ్‌ లాంటి వాటిలో సాంకేతిక పరంగా వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నట్లు మా సర్వేలో తేలింది. నిజానికి మహిళా పారిశ్రామికవేత్తలు పురుషుల కంటే ఎక్కువ విజయాలు సాధిస్తారు. కానీ దాన్నెవరూ పెద్దగా బయటికి చూపించరు. ఒక మహిళ సంస్థను స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే అసలైన సాధికారత సాధ్యమవుతుంది’’ అంటారు అను.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి