అబలలకు ఆత్మీయ సమీరం!
close
Published : 16/04/2021 02:28 IST

అబలలకు ఆత్మీయ సమీరం!

నడిరోడ్డుపై ఓ వ్యక్తి తన భార్యను కొడుతున్నాడు. అసహ్యంగా తిడుతున్నాడు. ఆమె తప్పేమీలేదు పాపం. అయినా తనని మన్నించి అతడితో తీసుకెళ్లమంటూ బతిమిలాడుతోంది. అటుగా వెళుతోన్న ఓ అమ్మాయి ఈ సంఘటన చూసి చాలా బాధపడింది. ఆ మహిళ లాంటి వారికి ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకుంది... అందుకోసం ఓ స్టార్టప్‌నూ ప్రారంభించింది. ఇంతా చేస్తే తన వయసు పదహారేళ్లు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కి చెందిన సమీరా జలన్‌ గురించే ఇదంతా...

మీరా ‘కొడైకెనాల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో పదో తరగతి చదువుతోంది. కొవిడ్‌ కారణంగా ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. స్కూల్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా తన కమ్యూనిటీకి ఏదైనా మంచి చేసే ప్రాజెక్ట్‌ చేయాలనుకుందామె. పైగా తను చూసిన భార్యాభర్తల ఉదంతం మనసులో మెదులుతూనే ఉంది. ‘అప్పుడే బాగా ఆలోచించాను. మా గ్రామంలోని నిరక్ష్యరాస్య మహిళలకు ఆర్థిక చేయూత అందించాలనుకున్నా. వారు చదువుకోలేదు కానీ కుట్టుపని, చిత్రలేఖనం, టైలరింగ్‌ చక్కగా చేస్తారు. వారికి వచ్చిన నైపుణ్యాలకే మెరుగు పెట్టి వారిని ఆర్థికంగా బలంగా చేయాలనుకున్నా. నేను చూసిన మహిళతోపాటు, మరికొందరితోనూ మాట్లాడా. ఆ ఆడవాళ్లంతా దగ్గర్లోని అపార్ట్‌మెంట్‌లో పాచి పనులు చేసుకునేవారు. నిరక్షరాస్యులు. ఆర్థిక స్వాతంత్య్రం కూడా లేదు. వారికి చేయూతనివ్వాలనుకున్నా. అలా ‘పిన్‌థ్రెడ్‌’ను ప్రారంభించా. మన దేశంలో మహిళలందరికీ వంటపని, చిన్న చిన్న కుట్ల వంటివి వస్తాయి. వాటితోనే వారికి ఉపాధి కల్పించాలనుకున్నా. టైలరింగ్‌లో వారికి మరిన్ని మెలకువలు నేర్పేందుకు నిపుణులైన టైలర్స్‌తో తర్ఫీదు ఇప్పించా. ఇప్పుడు ఈ మహిళలు ల్యాప్‌టాప్‌ కవర్లు, పెన్సిల్‌ కేసులు, స్టడీ టేబుల్స్‌ కోసం ఆర్గనైజర్స్‌, టేబుల్‌ మ్యాట్స్‌, మనీ ఎన్‌వలప్స్‌, క్రిస్మస్‌ సాక్స్‌, పెంపుడు జంతువులకు దుస్తులు, కాస్మెటిక్‌ పౌచ్‌లు, మాస్కులు, పోత్లీలు... ఇలా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న పాత పత్రికలు రీసైకిల్‌ చేసి వాటిపై రకరకాల రంగుల్లో మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రస్పుటించేలా చిత్రాలూ గీస్తున్నారు’ అని సంబరంగా చెబుతోంది పదహారేళ్ల ధీర.

‘పిన్‌థ్రెడ్‌’ లక్ష్యం మహిళలకు ఆర్థిక స్వావలంబనతోపాటు పర్యావరణాన్ని కాపాడటం కూడా. వృథా నుంచి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయడం. ‘ఈ అంకురం పనులన్నీ నేనే చూసుకున్నా. మొదట్లో అమ్మా నాన్నల నుంచి అయిదు వేలు తీసుకున్నా. కానీ ఆ డబ్బు సరిపోలేదు. నేనిప్పుడు పిన్‌థ్రెడ్‌ను మూసేస్తే మహిళలకు ఉపాధి ఎలా? ముడిసరకును వారు కొనుగోలు చేయలేరు. మరెలా? అప్పుడే... వృథాగా పారేసే బట్ట ముక్కల్ని వాడుకుంటే అన్న ఆలోచన వచ్చింది. గోరఖ్‌పుర్‌ పరిసర ప్రాంతాల్లోని టైలరింగ్‌ షాపులు, బొటిక్‌ల నుంచి బట్ట ముక్కలను సేకరించడం మొదలుపెట్టా. వాటిని శుభ్రంగా ఉతికి తిరిగి వాడుతున్నాం’ అని వివరించింది సమీరా. ‘ప్రస్తుతం వారానికి ఒక మహిళకు తొమ్మిది వందల రూపాయలను ఇస్తున్నాం. ఇంట్లో పనులన్నీ చూసుకుని వచ్చి రోజులో రెండు గంటలపాటు పనిచేస్తారు వాళ్లు. ఆ సమయంలో వారి పిల్లలనూ చూసుకునే దాన్ని’ అని చెబుతోందీ అమ్మాయి.

పిన్‌థ్రెడ్‌ పనులన్నీ సమీరా ఉంటున్న రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయి. ‘నలుగురు మహిళలతో మొదలుపెట్టా. ఇప్పుడు ఎనిమిది మంది పని చేస్తున్నారు. కొవిడ్‌ వల్ల ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోతున్నా. ‘పిన్‌థ్రెడ్‌’ ఉత్పాదనలను ‘ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో చూసి కొనుగోలు చేయొచ్చు. ఈ అంకురాన్ని విస్తరించి వీలైనంత ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నా. దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. కావాల్సినవారు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుని వెళ్లేలా కూడా ఏర్పాట్లు చేస్తా. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అవసరమైన, పేద మహిళలకు అందిస్తా’ అంటోందీ సమీరా.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి