హక్కుల చైతన్యమిస్తూ..
close
Published : 16/04/2021 02:29 IST

హక్కుల చైతన్యమిస్తూ..

కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండిపోతామా..? బాధ్యత ఉండాలిగా..
న్యాయంగా దక్కాల్సింది చేజారిపోతుంటే ఊరుకుంటామా..? హక్కులున్నాయిగా!
కానీ అవందరికీ తెలియవుగా అంటోంది. అందుకే వాటిని పరిచయం చేస్తోందా యువతి. తను చదివే విద్యను ఊరకే పోనీయకుండా ఊరూరా తిరిగి పాఠాలు చెబుతోంది. బతుకంటే ఏంటో బడి స్థాయిలోనే నేర్పిస్తోంది హైదరాబాద్‌కు చెందిన న్యాయ విద్యార్థిని, సామాజిక కార్యకర్త చాడ శ్రీహర్షిత. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ, సింబయాసిస్‌ లాస్కూల్‌ సంయుక్తంగా చేపట్టిన అతిపెద్ద ఆన్‌లైన్‌ అవగాహన కార్యక్రమం ‘సైబ్‌హర్‌’లోనూ ఆమెది కీలక భూమిక. ఆమె స్ఫూర్తి కథ తెలుసుకుందామా!

గరంలోని సింబయాసిస్‌ లా స్కూల్లో న్యాయ విద్య చదువుతోంది శ్రీహర్షిత. ఆ కాలేజీలో ఉన్న ‘లీగల్‌ ఎయిడ్‌ సెంటర్‌’ ద్వారా తన బృందంతో కలిసి హైదరాబాద్‌ చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ విభాగానికి మూడేళ్లపాటు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిందామె. అప్పుడే చట్టాల గురించి సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. ఇందుకోసమే మామిడిపల్లి, మొదళ్లగూడ, వీర్లపల్లి, కుందేలుకుంట వంటి పలు గ్రామాల్ని ఎంచుకుంది. మొదట స్థానిక సమస్యల్ని అర్థం చేసుకుని వాటికి పరిష్కారాల్ని వెతుకుతుంది హర్షిత బృందం. పారా లీగల్‌ వాలంటీర్‌గానూ గుర్తింపు ఉన్న హర్షిత...ఆయా ఊళ్లలో తిష్టవేసుకుని కూర్చున్న సమస్యల గురించి డిస్ట్రిక్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ దృష్టికి తీసుకెళ్లింది. కుందేలుకుంట గ్రామంలోని బడిలో ఒకే టీచర్‌ పనిచేస్తున్న విషయంతో పాటు...స్థానిక ఆసుపత్రిలో సౌకర్యాల లేమి, ప్రజా ఆరోగ్యంపై చూపిస్తోన్న నిర్లక్ష్యం గురించి రంగారెడ్డి జిల్లా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. న్యాయస్థానం...ఆ విషయంపై సంబంధిత అధికారులకు నేరుగా నోటీసులిచ్చి సమస్య పరిష్కారమయ్యేలా చూసింది. సర్కారు బడుల్లోని పిల్లలకు ప్రాథమిక హక్కులు, విధులు... స్థానికులకు పరిశుభ్రత- పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తోంది.  సేంద్రియ వ్యవసాయంపై పాఠాలు చెబుతోంది. మహిళలకు గృహహింస, వ్యర్థాల నిర్వహణ, నెలసరి పరిశుభ్రత, పోషకాహారం, వారి హక్కుల గురించి అర్థమయ్యేలా వివరిస్తోంది. ప్రస్తుతం నాలుగో ఏడాది చదువుతోన్న హర్షిత.
బ్లడ్‌ గ్రూప్‌ని చేర్చమని...
ఇటు న్యాయ విద్యార్థినిగా సేవలందిస్తూనే.. సామాజిక కార్యకర్తగా కీలక భూమిక పోషిస్తోంది. అంతకుముందు తాను పనిచేసిన సీటీఐ (కౌన్సిల్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సుల్లో బ్లడ్‌ గ్రూప్‌ను చేర్చేందుకు ఉద్యమించారు. ఆ బృందంతో కలిసి గతంలో ఇదే విషయమై అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కలిసి ఈ ఆలోచనను పంచుకున్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల్ని కాపాడేందుకు ఇది ఉపకరిస్తుందని చెబుతున్నారామె.

‘ఆమె’ భద్రతకు ఆన్‌లైన్‌లో..!
కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో జీవన విధానమంతా ఆన్‌లైన్‌కి మారింది. నిత్యావసరాలు, అత్యవసరాలు, విద్య, వైద్యం ఇలా అన్నింటికీ ఇదే వేదికైంది. నేరాలకూ ప్రధాన హేతువైంది. ఆ సైబర్‌ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతోంది మహిళలు, పిల్లలు. వీరి రక్షణ కోసం సింబయాసిస్‌ లీగల్‌ ఎయిడ్‌ సెంటర్‌, రాష్ట్ర మహిళా భద్రతా విభాగంతో కలిసి చేపట్టిన ‘సైబ్‌హర్‌’ ఉద్యమానికి హర్షిత నేతృత్వం వహించింది. దీని ద్వారా పోలీసులు విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన లీగల్‌ లిటరసీ క్లబ్స్‌ ద్వారా విద్యార్థులకు సైబర్‌ నేరాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. దేశంలోనే ఆన్‌లైన్‌లో జరిగిన ఈ అతిపెద్ద ఉద్యమానికి సారథ్యం వహించింది శ్రీహర్షిత. పోలీసులతో కలిసి మహిళలకు సైబర్‌ భద్రత, న్యాయ సేవలపై అవగాహన కల్పించింది.. నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లాయర్లు, సైబర్‌ నిపుణులు, సైకాలజిస్టులు, కౌన్సిలర్లు....ఇలా అందరినీ ఒకతాటి మీదకు తెచ్చింది. ఇందుకోసం క్విజ్‌లు, కాంపిటేషన్‌లు నిర్వహించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో లైవ్‌ కార్యక్రమాలూ చేసింది. మొత్తంగా పదిలక్షల మందికిపైగా ఈ కార్యక్రమాన్ని చేరువ చేయడంలో ప్రధానపాత్ర పోషించింది హర్షిత.
మానవ హక్కుల కోసం: శ్రీహర్షిత నాన్న రాజిరెడ్డి సీసీఎంబీలో, అమ్మ స్మితగౌని జీవీకేలో శాస్త్రవేత్తలు. వారి నుంచే తనకు ఇవన్నీ అలవాటయ్యాయని చెబుతుంది. ‘పేదలకు ఉచితంగా న్యాయం, సాయం అందించాలనే ఇటు వచ్చానని.. చదువు అయిపోగానే లిటిగేషన్‌ లా చేసి మానవహక్కుల కోసం పోరాడతానని అంటోంది’ శ్రీహర్షిత.

- అభిసాయి ఇట్ట, హైదరాబాద్‌

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి