సో‘దరి’కే గ్రంథాలయం
close
Published : 17/04/2021 01:22 IST

సో‘దరి’కే గ్రంథాలయం

‘ఇప్పటికీ చాలామంది మహిళల అస్తిత్వం ఒకరి చెల్లి, కూతురు, అమ్మ, భార్య.. ఇలాగే ఉంటోంది. అదే వారి గుర్తింపుగానూ మారింది. ఇది నాలో భయాన్ని కలిగిస్తుంటుంది’ తన చుట్టూ ఆడవాళ్లు మహిళల ఎదుర్కొనే హింస, ఆధిపత్య ధోరణులను చూసి అక్వి థామీ అన్న మాటలివి. ఈ ధోరణిలో మార్పు తేవాలన్న ఉద్దేశంతో ‘సిస్టర్‌ లైబ్రరీ’ని ప్రారంభించింది. దీనిలో కేవలం ఆడవాళ్ల రచనలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
డార్జిలింగ్‌కి చెందిన 31 ఏళ్ల అక్వి థామీ చిత్రకారిణి. ముంబయిలో స్థిరపడింది. తల్లిదండ్రులు డార్జిలింగ్‌లోని తేయాకు తోటల్లో పని చేస్తుంటారు. ముంబయికి వచ్చిన కొత్తలో తరగతి, వీధి, నివాస ప్రాంతంలో వ్యతిరేకత, జాత్యహంకారాల్ని ఎదుర్కొంది. దీనిలో మార్పు తేవడానికి కళ ఒక్కటే మార్గమని నమ్మింది. ఈ క్రమంలో ‘ధారావి ఆర్ట్‌ రూమ్‌’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మురికివాడల పిల్లలు ఉచితంగా చదువుకోడంతోపాటు నచ్చిన ఆర్ట్‌ను నేర్చుకునే వీలు కల్పించింది.

ఆలోచన ఎలా?
ఒకరోజు థామీ తను సేకరించిన పుస్తకాల్లో మహిళా రచనలు 20 శాతమే ఉండటం గమనించింది. మగవారి రచనలకు ఉన్న ప్రాధాన్యం మహిళా రచయితలకు ఇవ్వడం లేదనిపించింది. తను ఇకపై కేవలం వారి పుస్తకాలనే చదవాలని నిర్ణయించుకుంది. దాన్ని అనుసరించే క్రమంలో ఎన్ని అద్భుతమైన రచనలు ఉన్నాయో తెలిసొచ్చింది. తన బుక్‌షెల్ఫ్‌కు మించి పుస్తకాలను సేకరించాలనిపించడంతోపాటు వాటిని ఇతరులతో పంచుకోవాలనిపించేదట. ఈ ఆలోచనే ‘సిస్టర్‌ లైబ్రరీ’ రూపకల్పనకు దారి తీసినట్లు థామీ చెబుతోంది. ఇందుకుగానూ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలను సందర్శించి పుస్తకాలు సేకరించింది. వాటి క్యూరేటింగ్‌ పనులూ తనే స్వయంగా చూసుకుంటుంది. మొదట వాకింగ్‌ లైబ్రరీగా స్థాపించి తరువాత తన గ్యారేజీలో చివరకు ధారావిలో లైబ్రరీని 2019 మేలో 1000 పుస్తకాలతో ఏర్పాటు చేసింది.
ఇక్కడ స్థాయి, కులం, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. ధారావి చుట్టుపక్కల ఉన్నత స్థాయి కుటుంబ మహిళలు, తమ ఇంట్లో పనిచేసేవారు ఒకేచోట కూర్చుని చదువుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా తను చిన్నతనంలో కోరుకున్న వాతావరణం, సౌకర్యాలు, మద్దతు దీని ద్వారా ఇతరులకు అందిస్తోంది. అవసరమైన నిధులను స్వయంగా సేకరిస్తుంది. తన సంపాదనతోపాటు అవార్డుల రూపంలో వచ్చిన మొత్తాన్నీ దీనికే కేటాయించింది. గత ఏడాది ‘సిస్టర్‌ రేడియో’ పేరిట పోడ్‌కాస్ట్‌ను స్థాపించింది. దీనిలో దేశీయ, దళిత, బహుజన మహిళల గళాన్ని వినిపించనున్నారు. నెలలో రెండుసార్లు వారి సంస్కృతులు, పని వాతావరణం, ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవాటి గురించి చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ‘సిస్టర్‌ ప్రెస్‌’ను ప్రారంభించింది. ఇందులో వివిధ వస్తువులపై ప్రింటింగ్‌  నేర్పిస్తారు. వాటిని వారు ఇంటికీ తీసుకెళ్లొచ్చు. ఇందుకు కెమికల్స్‌ బదులుగా సోయాను ఉపయోగిస్తున్నారు.

మీరు పుస్తకం చదివి ఎన్నాళ్లైంది? అని ఎవరినైనా అడిగితే సమాధానం చెప్పడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. దీన్నే ఇంకోలా ఒక మహిళా రచయిత పుస్తకాన్ని చదివి ఎన్నాళ్లైంది? అని అడిగితే..! కాస్త తటపటాయించడం ఖాయం. అదే అక్వి థామీని అడిగి చూడండి. ఠక్కున సమాధానం వచ్చేస్తుంది. చదవడమే కాదు.. మహిళా రచయితల పుస్తకాలతో ఏకంగా లైబ్రరీనే ప్రారంభించిందామె. మన దేశంలోనే కాదు.. దక్షిణ ఆసియాలోనే ఈ తరహా గ్రంథాలయం మొదటిది. దీని వెనక పెద్ద లక్ష్యమూ ఉంది!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని