మన శక్తిని మనం గుర్తించాలి...
close
Updated : 20/04/2021 02:08 IST

మన శక్తిని మనం గుర్తించాలి...

ఉన్నత విద్యార్హత సరైన ఉద్యోగాన్ని ఇవ్వలేదు. వైకల్యం ఆటంకంగా నిలిచినా వెరవలేదు అంకితా షా. ఆమె చూపిన చొరవ ఉపాధి కల్పించడమే కాదు... నలుగురిలో గుర్తింపునూ తెచ్చిపెట్టింది. తన కుటుంబానికి ఆలంబనగా నిలిచి మరెందరికో ప్రేరణ కలిగిస్తోన్న ఆ ధీరవనిత కథ ఇదీ...

అంకితా షాది గుజరాత్‌. ఆమెకి ఏడాది వయసులోనే పోలియో వల్ల కుడికాలు తీసేశారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఆ అర్హత సరిపోలేదు. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ సొంతూరు పాలిటానా వదిలి అహ్మదాబాద్‌ వెళ్లింది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా తిరస్కారమే. అందుక్కారణం చిన్న పట్టణం నుంచి వెళ్లడమో, ఇంగ్లిష్‌ సరిగా మాట్లాడలేక పోవడమో కాదు. ఆమె కృత్రిమ కాలు. కొందరయితే కంపెనీలో దివ్యాంగులు పనిచేస్తున్నట్లు తెలిస్తే తమ కీర్తికి కళంకం వస్తుందని బాహాటంగానే చెప్పారు. ఏడుగురు సభ్యులున్న ఇంట్లో పెద్దది కావడంతో కుటుంబ పోషణ బాధ్యత ఆమె మీదుంది. అందువల్ల చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని నిరాశ చెందలేదు. కాల్‌సెంటర్‌, రియల్‌ ఎస్టేట్‌ ఎక్కడ దొరికితే అక్కడ ఉద్యోగం చేసింది. ఆఖరికి హోటల్లో హౌస్‌కీపర్‌గా కూడా. ఇవేవీ ఆమె విద్యార్హతకి గానీ సామర్థ్యానికి గానీ సరిపోయేవి కాదు. బతుకుతెరువు కోసం ఇష్టం లేకపోయినా పదేళ్లు రకరకాల కొలువులూ చేసింది. తన జీవితం తన చేతుల్లో లేదనే బాధ మాత్రం తొలుస్తుండేది.

2019లో అంకిత తండ్రికి పేగు కాన్సర్‌ వచ్చింది. ఇక ఆమె తన జీవితాన్నీ, కెరీర్‌నీ కూడా పునరాలోచించాల్సిన అవసరం వచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని బలంగా అనిపించింది. పైగా తండ్రి చికిత్స కోసం తిరగాలంటే ఫుల్‌టైం డెస్క్‌ జాబ్‌లో ఉంటే కుదరదు. సొంతంగా ఏదైనా చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా, తనలాగే దివ్యాంగుడైన లాల్‌జీ బారట్‌ దగ్గర డ్రైవింగ్‌ నేర్చుకుంది. కాలితో సాధ్యం కాదు గనుక చేతితో బ్రేకులు వేసే సదుపాయమున్న ఆటో నడపటం మొదలుపెట్టింది. తన ఆలోచనలకే కాదు రెక్కలకూ పటుత్వం ఉందని నిరూపించుకుంది.

ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకూ చాంద్‌ఖేడా నుంచి కాలుపూర్‌ రైల్వేస్టేషన్ల నడుమ ఆటో తిప్పుతుంది. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన వేళలను బట్టి సమయాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. ఆటో సొంతం కనుక ఇష్టానుసారం నడుపుకోవచ్చు. పాత ఉద్యోగాల్లో కన్నా రెట్టింపు సంపాదిస్తోంది. క్యాబ్‌ అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫాంలోనూ చేరింది. ఇప్పుడు తండ్రి ఆరోగ్యం మెరుగైంది. ఆయన ప్రోత్సాహంతో మునుపటి కంటే బలాన్ని పుంజుకుని ఉత్తేజాన్ని పొందుతున్నానని ఉత్సాహంగా చెబుతోంది. ‘మన శక్తిని మనం తెలుసుకుంటే ఏమైనా సాధించగలుగుతాం. అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాల్ని గుర్తిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేయొచ్చు’ అనే అంకిత మాటలు సామర్థ్యం ఉండీ చొరవ చూపలేని వారికి స్ఫూర్తి కలిగిస్తాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి