అయితే ఏంటి?
close
Updated : 22/04/2021 00:34 IST

అయితే ఏంటి?

ఏదైనా అరుదైన వ్యాధి రాగానే చాలామంది కుంగుబాటుకు గురవుతారు. కొందరు మాత్రం ప్రతికూల ఆలోచనల నుంచి స్వయంకృషితో బయటపడుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని నచ్చిన రంగాల్లో అడుగుపెడుతున్నారు. ఛాలెంజ్‌లను ఎదుర్కొంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. ‘అవును. మాకీ సమస్య ఉంది! అయితే ఏంటి’ అంటూ ధైర్యంగా నిలబడుతున్నారు. అలాంటి ముగ్గురు ధీరల స్ఫూర్తి కథనం ఇది.

గుండెధైర్యమే బలం

గుజరాత్‌కు చెందిన కెటాకీ జానీ ఒత్తైన జుట్టు అంటే ఆమె భర్తకు ఎంతో ఇష్టం. జానీ 40వ పుట్టిన రోజు తర్వాతే ఆమె జీవితంలో అనుకోని మార్పు. జుట్టు రాలి, తలపై చిన్నచిన్న ప్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. విటమిన్ల లోపం అనుకున్నారంతా. ఆరు నెలల్లోపే గుండులా మారడంతో వైద్యులను సంప్రదించారు. అది ‘అలోపేషియా’ అనీ అరుదైన ఈ వ్యాధికి చికిత్స లేదనీ చెప్పారు.

గుండుపై టాటూలు!

మొదట షాక్‌కి గురయింది జానీ. క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ మామూలు మనిషి కావడానికి రెండేళ్లు పట్టింది. మొదట్లో స్కార్ఫ్‌, టోపీ లేనిదే బయటకెళ్లేది కాదు. అలాంటిది, అందరిలోకీ ధైర్యంగా గుండుతోనే వెళ్లడం ప్రారంభించింది. దీంతోనే అద్భుతాలు చేద్దామనుకుంది. ‘చాలామంది క్యాన్సర్‌ వచ్చిందా అని అడిగేవారు. వారందరికీ ఈ వ్యాధి గురించి చెప్పాలనిపించేది కాదు. ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. 2017లో మిసెస్‌ ఇండియా ఆఫ్‌ ద వరల్డ్‌ అందాల పోటీ గురించి ఫేస్‌బుక్‌లో చూశా. దరఖాస్తు పంపేటప్పుడు అందులో జుట్టు రంగు అనే చోట ‘నో హెయిర్‌’ అని రాశా. గంటలోపే ఓకే అని సమాధానం వచ్చింది. ఆ పోటీల్లో టాప్‌టెన్‌లో నిలిచా. అలాగే మిసెస్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డును ఆ వేదికపై అందుకున్నప్పుడు ప్రపంచానికే ఓ సందేశం ఇచ్చినట్లు అనిపించింది. అందవిహీనమంటూ ఏదీ లేదు. మనకొచ్చిన వ్యాధిని లోపంగా భావించకుండా, దాన్ని అంగీకరించగలిగితే చాలు. పెరిగిన నా ఆత్మవిశ్వాసాన్ని అలా వేదికపై  ప్రదర్శించేదాన్ని. నా గుండు మీద అందమైన టాటూలు వేయించుకుని, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో ఉంచుతున్నా. ప్రస్తుతం పుణెలో మహారాష్ట్ర స్టేట్‌ బ్యూరో ఆఫ్‌ టెక్స్ట్‌బుక్‌ ప్రొడక్షన్‌లో స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నా. మిసెస్‌ పుణె, మిస్‌ అండ్‌ మిసెస్‌ పుణె ఇంటర్నేషనల్‌ పోటీల్లోనూ పాల్గొని విజేతగా నిలిచా. మిసెస్‌ పాపులర్‌ టైటిల్‌నూ గెలుచుకున్నా. న్యూనతాభావాన్ని వదిలేస్తే ఏదైనా సాధించగలం అనడానికి నేనే ఉదాహరణ. నా నుంచి కొందరైనా స్ఫూర్తి పొందితే చాలు’ అని చెబుతోంది జానీ.

బొల్లి ఉన్నా టాప్‌ మోడల్‌

బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల ప్రార్థనాజగన్‌ ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలో ఓ ప్రభంజనం. ఈ స్థాయికి రావడానికి తనెంతో సంఘర్షణను ఎదుర్కొంది. 11 ఏళ్ల వయసులో ముఖంపై బొల్లి మచ్చలు ప్రారంభమైతే, అదేదో మామూలు చర్మ సమస్య అనుకుంది. అదేంటో తెలిసేలోపే కనుబొమలు, ముక్కు, పెదాలపైకి వ్యాపించాయి. స్కూల్‌కెళ్లనని మారాం చేసేది. తోటి విద్యార్థుల అవహేళనలను తట్టుకోలేక కుమిలిపోయేది. మచ్చలు కనబడకుండా క్రీం, పౌడర్‌లను అద్దుకునేది. మేకప్‌ లేకుండా బయటికి వెü్లేది కాదు.
18 ఏళ్ల వయసులో... తనకున్న ఈ వ్యాధిని లోపంగా కాకుండా సహజంగా తీసుకోవడానికి తనకు చాలా కాలమే పట్టింది. ఆరేడేళ్ల పాటు చాలా మానసిక సంఘర్షణను అనుభవించింది. 18 ఏళ్లు వచ్చే సరికి తను మారింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పైగా అందరిలో అవగాహన కలిగించాలనుకున్నా అంటుందీమె. ‘బొల్లి మిగతా అనారోగ్యాల్లో ఒకటి. ఇది బయటకు కనిపిస్తుందంతే. మన శరీరాన్ని ప్రేమించడం మొదలుపెడితే, అద్దంలో మనకు మనమే అందంగా కనిపిస్తాం. ఆ దిశగా అవగాహనా కార్యక్రమాలు ప్రారంభించా. దేశంలో ఈ వ్యాధి గురించి వేదికపై మాట్లాడే అతికొద్దిమందిలో నేనూ ఒకరిగా నిలవడం సంతోషంగా ఉంటుంది. ఎల్లె ఇండియా వంటి ప్రముఖ మ్యాగ్‌జీన్‌ 25వ వార్షికోత్సవం సంచికకు ముఖచిత్రమయ్యా. సోషల్‌మీడియా ద్వారా బొల్లి వ్యాధిపై నా ప్రచారం లక్షలాదిమందిలో చైతన్యాన్ని పెంచుతోంది. మోడలింగ్‌ ప్రపంచంలో ఓ స్థాయిని అందుకోగలిగాను. నా విజయం నాలాంటి మరెందరిలోనో స్ఫూర్తిని నింపుతోంది. అదే నాకు చాలా సంతోషం’ అని చెబుతున్న ప్రార్థన, ప్రముఖ ఇండియన్‌ బ్లాగర్‌ కూడా. మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ డిగ్రీ పూర్తి చేసిందీమె.

వ్యాధే జీవితం కాదు

హాయిగా స్నేహితులతో కలసి ఆడిపాడుతున్న అల్కా ధూప్కర్‌కు 13 ఏళ్ల వయసులో ఈ సమస్య వచ్చింది. చర్మం మీద చిన్నచిన్న దద్దుర్లు వచ్చి దురదగా అనిపించేది. ఆ తర్వాత అక్కడ మచ్చలయ్యేవి. అలర్జీ అనుకున్నారు ఇంట్లోవాళ్లు. అది క్రమేపీ ఒళ్లంతా వ్యాపించింది. అది సొరియాసిస్‌ అని, జీవితాంతం ఉంటుందని చెప్పేసరికి ఆ చిన్నారికి ఏం చేయాలో పాలుపోలేదు. వాటివల్ల కలిగే చికాకు, దురద భరించలేకపోయేది. చర్మం పొరల్లా ఊడిపోవడం, అక్కడ కందిపోయి వాయడంతో అల్కా నీరసపడిపోయేది. బయటికి వెళ్లడానికి ఇబ్బంది పడేది. అలా ఆమెకు 20 ఏళ్లు నిండే సరికి తెలిసిన వైద్యనిపుణులందరికీ చూపించారామె తల్లిదండ్రులు. ఫలితం లేక అల్కా తీవ్ర కుంగుబాటుకు గురైంది.
ఓ భాగంగా... తర్వాత అల్కా తనలాంటివాళ్లకీ ఓ గ్రూపు ఉందని తెలుసుకుంది. సొరియాసిస్‌ కమ్యూనిటీలో సభ్యురాలైంది. తన అనారోగ్యాన్ని ముందుగా తానే అంగీకరించాలనే ఆలోచన మొదలైంది అంటుంది అల్కా. ‘ఓవైపు పోషక విలువలుండే ఆహారం, వ్యాయామం, యోగాతోపాటు వేడినీటిని తాగడం, ఆహారంలో తాజా పండ్లు ఉండేలా చూసుకోవడం మొదలుపెట్టా. శారీరకంగా , మానసికంగా నన్ను నేను దృఢపరుచుకోవడానికి ప్రయత్నించి, సక్సెస్‌ అయ్యా. నా చర్మవ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోయినా, కనీసం ఉపశమనం పొందేలా చూసుకున్నా. ఈ వ్యాధే నా జీవితం కాదు, ఇది ఓ భాగం మాత్రమే. దాన్ని గురించి ఎక్కువ బాధపడకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాకు చాలా ఇష్టమైన మీడియా రంగాన్ని ఎంచుకున్నా. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో న్యూస్‌ యాంకర్‌గా పని చేస్తున్నా. స్టూడియోలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టే నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కెరీర్‌లో మంచిపేరు తెచ్చుకోగలిగా. నాలాంటి వారికి సోషల్‌మీడియా ద్వారా అవగాహన కలిగిస్తున్నా. ఇప్పుడెవరైనా నా చర్మం చూసి ఏంటిది అని అడిగితే నవ్వుతూ నాకు సొరియాసిస్‌ అని ధైర్యంగా చెప్పే స్థాయికెదిగా’ అని అంటోంది అల్కా.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి