దూసుకుపోతున్న బుల్లెట్లు!
close
Published : 24/04/2021 00:54 IST

దూసుకుపోతున్న బుల్లెట్లు!

అతి ఎత్తైన ఘాట్‌ రోడ్లు... అటూ ఇటూ వేల అడుగుల లోయలు... అత్యంత ప్రమాదకరమైన మలుపులు... అలాంటి చోట్ల బైక్‌ ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ ఇద్దరమ్మాయిలు... ఒంటరిగానే ఈ యాత్రలు చేస్తున్నారు. అంతేనా! ఆ ప్రయాణాల్ని, అక్కడి వింతలు, విశేషాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వారి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలకు లక్షల మంది ఫాలోవర్లు! అభిరుచిని ఆదాయంగా మార్చుకుని... అభిమానుల్నీ సంపాదించుకున్నారు 23 ఏళ్ల చమేలీ నాదెళ్ల, 27 ఏళ్ల విశాఖ. ఒళ్లు గగుర్పొడిచే... వారి సాహసానుభవాలను ‘వసుంధర’తో పంచుకున్నారిలా...!


అమ్మ తన నగలు అమ్మేసింది : విశాఖ

ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో బైక్‌ రైడింగ్‌ చేయడం విశాఖకు అత్యంత ఇష్టం. అందుకే ఈ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంది. నాలుగేళ్లుగా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలతో, రికార్డులు సృష్టించింది. ఆమె యూట్యూబ్‌ ఛానెల్‌కు ఎనిమిది లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు!!
తొలి భారతీయ మోటోవ్లాగర్‌...
చిన్నప్పుడు నాన్న బుల్లెట్‌పై ముందు కూర్చుని తానే నడుపుతున్నట్లుగా ఫీల్‌ అయ్యేదట. అప్పటి నుంచే బైక్‌ల పట్ల ఆసక్తి అని చెబుతుంది విశాఖ. ఇంటర్‌లో అడుగుపెట్టగానే బైక్‌ కొనిమ్మని మారాం చేసింది. తర్వాత ఏడాదిలోపే స్నేహితుల బైక్‌పై స్టంట్స్‌ చేసి అందరినీ విస్మయపరచింది. ‘డాక్టర్‌ లేదా పైలట్‌ అవ్వాలనుకున్నా. ఆర్థికస్థితి సహకరించక బీబీఏలో చేరా. బైక్‌తో కలిసి ఉండే ఉద్యోగాలేమైనా చేయాలని నెట్‌లో వెతికేదాన్ని. అలా అంతర్జాతీయ మోటోవ్లాగర్‌ల గురించి చదివా. అనుకున్నంత తేలిక కాదిది. మంచి బైకు, కెమెరా, హెల్మెట్‌, జాకెట్‌ వంటివన్నీ కావాలి. వాటికీ రూ.3 లక్షలు అవసరమయ్యాయి. బ్యాంకు రుణం తీసుకున్నా. ముందు కొంత నగదు కట్టాల్సి వచ్చింది. దానికోసం అమ్మ తన నగలను అమ్మేసింది. కాలేజీలో ఈవెంట్స్‌ చేస్తూ, ఆ సొమ్ముతో అప్పు తీర్చేశా. చదువునేమీ నిర్లక్ష్యం చేయలేదు. ఎంబీఏ పూర్తి చేశా. ‘రైడర్‌గర్ల్‌ విశాఖ’గా దేశంలోనే తొలి మహిళా మోటోవ్లాగర్‌గా నిలిచా. పురుషాధిక్య రంగమిది. నేనీ స్థానాన్ని దక్కించుకోవడానికి చాలా పోరాడాల్సి వచ్చింది. నీకెందుకివన్నీ అని చాలామంది విమర్శించే వారు. ఏటా ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ మహిళా మోటోవ్ల్లాగర్స్‌ సమావేశం జరుగుతుంది. దాంట్లో మన దేశం తరఫున పాల్గొన్న తొలి మహిళనైనందుకు గర్వంగా అనిపించింది. ఉత్తరాఖండ్‌, లద్దాక్‌ వంటి ఎత్తైన పర్వత ప్రాంతాలకు సోలో రైడర్‌గా ప్రయాణించా. హెల్మెట్‌ తీశాక అరె అమ్మాయా అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. బే ఆఫ్‌ బెంగాల్‌ మీదుగా రైడ్‌ చేసినందుకు, అండమాన్‌ దీవులను దాటినందుకు రికార్డ్సులో స్థానం దక్కింది’ అని సంతోషంగా చెబుతుంది విశాఖ. తనకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. నర్మదా నది పరిశుభ్రతపై అందరిలో అవగాహన తేవడానికి ‘సేవ్‌ రివర్‌... సేవ్‌ నేషన్‌’ పేరుతో ముంబయి నుంచి బయలుదేరి నర్మదా తీరప్రాంతాన్నంతా అంటే... దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరం ఎనిమిది రోజుల్లో సోలో రైడ్‌ చేసిందీమె. మనాలి నుంచి 13వేల అడుగులకు పైగా  ఎత్తైన రౌటంగ్‌పాస్‌కు సాహసోపేతమైన రైడింగ్‌ చేసి చూపించింది. ఇందులో ఆసక్తి ఉన్న యువతులకు శిక్షణనూ ఇస్తోంది. తన వీడియోలను కోటిన్నరమందికి పైగా వీక్షించడం విశేషం.


సైలెన్సర్‌ను పట్టుకున్నా... స్పర్శ తెలియలేదు : చమేలీ నాదెళ్ల

టల్‌ టన్నెల్‌ను దాటిన తొలి మహిళా రైడర్‌ చమేలీకి చిన్నప్పటి నుంచి బైక్‌లు నడపడం అంటే పిచ్చి. తను పుట్టింది బళ్లారిలో, పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న నాదెళ్ల మల్లేశ్వరావు ప్రైవేటు ఉద్యోగి. చిన్నప్పటి నుంచీ చమేలీకి ప్రయాణాలన్నా ఆసక్తి. అమ్మమ్మ వాళ్ల ఊరెళ్తే తాతయ్య స్కూటీ మీద రౌండ్లు వేసేది. ఫ్రెండ్‌ బైక్‌ తీసుకుని సొంతంగా వారంలో నేర్చుకుంది.  
నాన్ననూ రైడ్‌కి తీసుకెళ్లాలి!
‘అమ్మానాన్న మొదట బైక్‌ కొనివ్వడానికి ఒప్పుకోలేదు. నా పట్టుదల చూసి అక్క కొనిచ్చింది. ఇంట్లో షరతుల ప్రకారం హైదరాబాద్‌ దాటి వెళ్లేదాన్ని కాదు. తర్వాత ఒప్పించి వీకెండ్‌ రైడ్స్‌ మొదలుపెట్టా. బృందంతో కొడైకెనాల్‌, బెంగళూరు లాంటి చోట్లకు వెళ్లేదాన్ని. 2020, సెప్టెంబరులో కన్యాకుమారికి ఒక్కదాన్నే ప్రయాణించా. ఇది చాలా జ్ఞాపకాలను మిగిల్చింది. ఆరు రోజుల ఆ యాత్రలో 2,700 కి.మీ ప్రయాణించా. తిరుగు ప్రయాణంలో మరో వంద కి.మీ. వస్తే  హైదరాబాదు శివార్లకు చేరుకుంటాం. ఇంతలో చీకటి, అకస్మాత్తుగా భారీ వర్షం. అలానే వచ్చేద్దామని ప్రయత్నించా. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. ప్రయాణ అనుభవాలన్నింటినీ ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో పోస్ట్‌ చేస్తా. ఈ రంగంలో ఆసక్తి ఉన్న వారి కోసమే మోటో వ్లాగర్‌నయ్యా. ఇలా చేసే మహిళలు మన దేశంలో చాలా తక్కువ. యూట్యూబ్‌లో నాకు లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
మైనస్‌ డిగ్రీల చలిలో...
గత అక్టోబరులో లద్దాక్‌కు బయలుదేరా. 21 రోజులు పట్టింది. అక్కడి ఉష్ణోగ్రత అప్పటికే మైనస్‌ 20 డిగ్రీలకు చేరింది. ఆ చలిలో 18 వేల అడుగుల ఎత్తులో ఘాట్‌రోడ్ల మీద నడపడం పెద్ద సవాల్‌. ఆ రైడ్‌లో ప్రత్యేకమైంది అటల్‌ టన్నెల్‌. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో, తొమ్మిది కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఈ టన్నెల్‌ ప్రపంచంలోనే మొదటిది. దేశంలో దీన్ని దాటిన తొలి మహిళా రైడర్‌ను నేనే. లేహ్‌కు 150 కి.మీ దూరంలో, డ్రై ఐస్‌ ఎక్కువై, బండి జారిపోయింది. బైకు ఆయిల్‌ లీకేజీ మొదలైంది. ఏమీ తోచలేదు. చీకటి పడుతోన్న ఆ సమయంలో అక్కడ ఉంటే చలికి గడ్డ కట్టుకుపోతాం. తర్వాత అదృష్టం కొద్దీ కోరైడర్‌ వచ్చారు. లేహ్‌కు చేరుకునే టప్పటికి మంచు వాన. విపరీతమైన చలి. ఒకచోట చలికి తట్టుకోలేక, బండి ఆపేసి, సైలెన్సర్‌ను పట్టుకుని కూర్చున్నా. అయినా చేతులకు స్పర్శ తెలియలేదు. ఇలాంటి అనుభవాలన్నీ నన్ను మరింత దృఢంగా మారుస్తుంటాయి. ఈ రంగంలోకి వెళ్తా అన్నప్పుడు అమ్మానాన్న భయపడ్డారు. ఇప్పుడు మారారులెండి. నాన్నను ఒక రైడ్‌కు తీసుకెళ్లాలి. ల్యాండ్‌ స్కేప్స్‌ ఎక్కువగా ఉన్న ఐస్‌ల్యాండ్‌లో సోలో రైడ్‌ చేయాలి... ఇవీ నాకలలు. ఈమధ్యే ఎంబీఏ పూర్తిచేశా. సొంతంగా చిన్న వ్యాపారం ప్రారంభించా. బైక్‌ రైడింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్నా. ‘బైక్‌రైడింగ్‌ కూడా ఒక కెరీర్‌. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదీ కష్టం కాదు’ అంటాను నేను.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి