అమ్మాయిలైతే.. అర్హులు కారా?
close
Published : 28/04/2021 01:20 IST

అమ్మాయిలైతే.. అర్హులు కారా?

ఎదురు చూస్తున్న ఉద్యోగం... ప్రకటన వెలువడింది. అబ్బాయిలు మాత్రమే దరఖాస్తు చేయాలనేది నిబంధన. ఎవరైనా ఏం చేస్తారు? నిరాశ పడతారు, అక్కడితో వదిలేస్తారు. కానీ ఆ అమ్మాయి అలా చేయలేదు. అర్హతలున్నా మాకెందుకు అవకాశం లేదంటూ నిలదీసింది. న్యాయస్థానం తలుపుతట్టింది. అనుకున్నది సాధించింది. తనే ట్రెసా జోసెఫిన్‌. తన విజయగాథేంటో తెలుసుకుందామా?

ట్రెసా జోసెఫిన్‌ది కేరళలోని కొల్లాం జిల్లాలోని శక్తికుళంగర. సేఫ్టీ అండ్‌ ఫైర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ప్రభుత్వ రంగ అధీనంలో పనిచేసే సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. శాశ్వత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే గత ఏడాది శాశ్వత ఉద్యోగాల ప్రకటన వచ్చింది. కానీ దానిలో పురుషులు మాత్రమే అర్హులనే నిబంధన ఉంది. తనకు అన్ని అర్హతలూ ఉన్నా అవకాశం లేకపోవడం అన్యాయంగా భావించింది. ఉన్నతాధికారులను సంప్రదించింది. వాళ్లేమో మేనేజ్‌మెంట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేమన్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంది.

ఒకే ఒక్క కారణం...
ఇలా జరగడం ట్రెసాకు మొదటిసారేం కాదు. గతంలోనూ ఈ తరహా వివక్షను ఎదుర్కొంది. 2019లో ఇస్రోలో సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. పరీక్షలో అర్హత సాధించిన 70 మందిలో తనొక్కతే అమ్మాయి. అమ్మాయి అయిన కారణంగానే తనను పక్కన పెట్టేశారు. కానీ ప్రకటనలో అమ్మాయిలు అనర్హులని పేర్కొనలేదు. రెండో సారీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవడంతో ఈ విషయాన్ని వదలకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు తన కుటుంబం, అడ్వకేట్‌ మామయ్య పీఆర్‌ మిల్టన్‌ తోడుగా నిలిచారు. ఆయన సాయంతో కేరళ హైకోర్టులో కేసు వేసింది.

ట్రెసా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అను శివరామన్‌.. ‘సమాన అర్హత ఉన్నా మహిళ అన్న కారణంగా ఎవరూ వివక్షకు గురవ్వకూడదు. సంస్థ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో పురుషులు మాత్రమే అర్హులని పేర్కొనడం రాజ్యాంగంలోని 14, 15, 16 ఆర్టికల్స్‌ను అతిక్రమించడమేనని’ స్పష్టం చేశారు. అలాగే భద్రతా చర్యలు వారి ఉద్యోగావకాశాలకు అడ్డు కాకూడదనీ, వారు తమ బాధ్యతలను భద్రంగా, సజావుగా నిర్వహించేలానూ ప్రభుత్వం చూడాలనీ ఈ ఏకసభ్య బెంచ్‌ తాజాగా తీర్పునిచ్చింది.

‘సేఫ్టీ ఇంజినీరింగ్‌ పురుషాధిక్య రంగం. వీటిలోకి ప్రవేశించే అమ్మాయిలే తక్కువ. ఆసక్తి కొద్దీ చేరినవారే వీరంతా. విద్య, నైపుణ్యాల పరంగా అన్ని అర్హతలూ ఉన్నా అమ్మాయిలన్న ఒకే ఒక్క కారణంతో పక్కన పెట్టేవారు. ఒకటికి రెండుసార్లు ఈ పరిస్థితి ఎదురయ్యే సరికి సహించలేకపోయాను. వ్యవస్థ మీద పోరాటం, కష్టం అని తెలిసినా... మన న్యాయస్థానాల మీద నమ్మకంతో ధైర్యం చేశా. నా నమ్మకమే నిజమైంది. మొదట కొంత షాక్‌కు గురైనా.. తీర్పు చాలా సంతోషాన్నిచ్చింది. ఇకపై సరైన అర్హతలున్న ఏ మహిళా లింగ వివక్ష కారణంగా తిరస్కరణకు గురవ్వదు’ అని ఆనందంగా చెబుతోంది ట్రెసా.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి