కూతురి ఆస్తిలో తండ్రికి హక్కుంటుందా?
close
Updated : 28/04/2021 02:10 IST

కూతురి ఆస్తిలో తండ్రికి హక్కుంటుందా?

నా స్నేహితురాలి కూతురికి పదిహేను సంవత్సరాలు. తనకు మూడేళ్లున్నప్పుడు ఆమె చనిపోయింది. భర్త రెండో పెళ్లి చేసుకుని పిల్లని వదిలేశాడు. అమ్మమ్మ తాతయ్యలే తనని పెంచారు. దురదృష్టవశాత్తూ ఏడాది తేడాతో వారిద్దరూ మరణించారు. వారి తదనంతరం మనవరాలికి ఆస్తి చెందేట్లు విల్లు రాశారు. ఇంతవరకూ బాగానే ఉంది  కానీ... పాప మైనర్‌ కావడంతో కూతురి బాధ్యత నాదే అంటూ తండ్రి తిరిగి వచ్చాడు. అది మాకెవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. పాప ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ విషయంలో చట్టం ఏమైనా సాయం చేస్తుందా?

- ఓ సోదరి, మిర్యాలగూడ

బిడ్డలకు తల్లిదండ్రుల్ని సహజ సంరక్షకులుగా గుర్తిస్తుంది చట్టం. అమ్మమ్మ తాతయ్యలే ఆ పాప ఆలనా పాలనా చూస్తూ, వారి ఆస్తిని అప్పజెప్పి ఆమె భవిష్యత్తుకి భరోసా కల్పించడం సంతోషకరమే. ఇప్పుడు తండ్రి వచ్చి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నా... ఆ అమ్మాయి ఆస్తిమీద అతనికి ఏ హక్కూ ఉండదు. మైనర్‌ పిల్లల ఆస్తిని అమ్ముకోవడానికీ, అనుభవించడానికీ ఆ తండ్రికి హక్కు ఉండదు. ఆ పాప ఎవరి దగ్గర ఉండాలనుకుంటుందో తెలుసుకోండి. ఐదేళ్లు దాటిన పిల్లలందరికీ దీన్ని నిర్ణయించుకునే హక్కు ఉంది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టులు గార్డియన్ల విషయంలో నిర్ణయం తీసుకుంటాయి. తన బిడ్డ ఇన్నాళ్లూ అమ్మమ్మ ఇంట్లో భద్రంగా ఉందనే భరోసాతో ఆ తండ్రి పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చదువు, పెళ్లి వంటి అంశాల్లో అతని ప్రమేయం ఉండాలనే ఆలోచనతో ఆమె ఆలనా పాలనా చూడటానికి ముందుకు వచ్చి ఉండొచ్చు. అలాకాకుండా ఆ అమ్మాయికీ, ఆమె ఆస్తికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే... ఆ విషయాన్ని కోర్టులో నిరూపిస్తే తప్ప గార్డియన్స్‌ అండ్‌ వార్డర్స్‌ యాక్ట్‌ ప్రకారం మరొకరికి సంరక్షణ బాధ్యతలు ఇవ్వమని అడిగే హక్కు ఉండదు. కోర్టులో పిటిషన్‌ వేసి తేలేటప్పటికి పాప మేజర్‌ అయిపోతుంది. ప్రస్తుతానికి తండ్రి సంరక్షణలో ఉండి ఒక వేళ పాప క్షేమానికి భంగం వాటిల్లుతుందని అనుకుంటే కోర్టుని గార్డియన్‌ని ఏర్పాటు చేయమని ఆమె తరఫున ఎవరైనా సెక్షన్‌ 8 ప్రకారం కోర్టులో పిటిషన్‌ వేయవచ్చు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి