పల్లె రుచులు... విదేశాలకు
close
Published : 28/04/2021 01:42 IST

పల్లె రుచులు... విదేశాలకు

ట్రైనీలకు ఆరు నెలల శిక్షణ... ప్రతి ఏడాదీ బోనస్‌... ఉచితంగా యూనిఫాం... ఎక్కువ పనికి అదనపు జీతం.. ప్రతి నెలా ఆహార భత్యం...

ఏ కార్పొరేట్‌ సంస్థ విషయమో కాదిది!

రోజువారీ పక్కా లెక్కలు..  ఉద్యోగులకు నెలవారీ జీతాలు. కరోనా సమయంలోనూ ఉపాధి. ఆసక్తి ఉన్న వారికి స్వయంఉపాధికి తోడ్పాటు!

ఏ పెద్ద పరిశ్రమ సంగతో కాదు ఇది!

చిన్న పల్లెలో వ్యాపారం చేస్తూ అంతర్జాతీయ స్థాయిని అందుకున్న మహిళా బృందాల విజయగాథలివీ! రెండు దశాబ్దాలుగా ఒకేమాట... ఒకే బాటగా సాగుతున్న మధురం, ప్రశాంతి డ్వాక్రా సంఘాల ప్రగతి ప్రస్థానమిదీ...


అనుకోకుండా మొదలుపెట్టి..
- తుమ్మల విజయలక్ష్మి

మాది కృష్ణా జిల్లా కొడాలి. నేను, తుమ్మల మంజుల, వేజెళ్ల అరుణ కుమారి, డొక్కు వాణి, టి.సావిత్రి కలిసి కృష్ణసాయి హోం ఫుడ్స్‌ స్థాపించాం. మేం ప్రశాంతి సమైక్య సంఘం సభ్యులం. నిజానికి మా తమ్ముడి ప్రోద్బలంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం. ఖాళీగా, దైవ చింతనలో గడిపేస్తున్నామని తన భావన. ‘వక్కలగడ్డలో ‘మధురం’ పేరిట ఇలా చేస్తున్నారు. మీరూ ప్రయత్నించండ’ని తన ఖాళీ స్థలాన్నే సొంత ఖర్చుతో బాగు చేసిచ్చాడు. అలా వీధి గుమ్మం దాటి ఎరుగని వాళ్లం వ్యాపారంలోకి అడుగుపెట్టాం. పెద్ద పెట్టుబడులేమీ పెట్టలేదు. ఎవరి ఇంట్లో సామాను వారు తెచ్చారు. సరకులకు మాత్రం తలా రూ.5వేలు వేసుకున్నాం. ఆదాయం మొదలయ్యాక అవసరమైనవి చిన్నగా కొన్నాం.

ప్రారంభించామిలా...
మా కంటే ముందే మధురం వాళ్లు పెట్టడంతో మాకు మార్గం కొంత సులభమైంది. చుట్టుపక్కల నాలుగూళ్లకీ మా ఊరే సెంటర్‌. పైగా మా దాని గురించి నలుగురికీ తెలియజేయడానికి ప్రారంభం రోజున ఊళ్లో వాళ్లతోపాటు, పక్క గ్రామాల వాళ్లనీ పిలిచాం. పలురకాల వంటకాలను అమ్మకానికి ఉంచాం. నచ్చిన వారు మళ్లీ రావడం మొదలుపెట్టారు. అలా పేరొచ్చింది. అందుకే నాణ్యత విషయంలో రాజీపడే వాళ్లం కాదు. ఆర్డర్లు పెరగడంతోపాటు స్థానికంగా తీసుకునే వాళ్లున్నారు. విజయవాడ, వైజాగ్‌ వంటి పట్టణాల మొదలు విదేశాలకూ పార్శిళ్లు పంపడం మొదలైంది. రోజువారీ విషయాలు, ఆర్డర్లు మొదలైన విషయాల్లో గుమస్తా సాయం తీసుకుంటున్నాం. మొదటి సారి పెట్టుబడి తర్వాత అదనంగా మళ్లీ పెట్టాల్సిన అవసరం రాలేదు. వచ్చిన ఆదాయంలోనే ఏం అవసరమైనా సమకూర్చుకునేవాళ్లం. దీంతో ఆర్థిక ఇబ్బందులేమీ ఎదురవలేదు.

మా బృందంలో నాలాంటి పెద్దవాళ్లతోపాటు యువత, చదువుకున్న వాళ్లూ ఉన్నారు. 10మంది కలిసి ప్రారంభించాం. ఇప్పటికీ మేమే కొనసాగుతున్నాం. మా దగ్గర చేసేవాళ్లు అంతకుముందు కూలికి బయటికి వెళ్లే వాళ్లే. నెలజీతం సక్రమంగా ఇస్తుండటం, మిగిలిన సౌకర్యాలూ నచ్చి ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. రూ.1500కు మొదలైన వాళ్లు ఇప్పుడు రూ. 8000 వరకూ అందుకుంటున్నారు. మాతోపాటు ఇంకా ఎందరో ప్రారంభించినా వాళ్లూ మమ్మల్ని వదిలి వెళ్లలేదు. అందుకే.. కరోనా సమయంలో ఆదాయం లేకపోయినా వాళ్లకి జీతాలు క్రమం తప్పకుండా ఇచ్చాం. ఇన్నాళ్లూ ఒకే బృందంగా కొనసాగాం. ఇప్పుడు పెద్దవాళ్లం అయిపోయాం. నాకు 70 ఏళ్లు. మిగిలిన అందరివీ 50కిపైనే. మా ఆరోగ్యాలు బాగున్నంత వరకూ ఇలాగే కొనసాగుతాం.


మహిళా మండలి కోసమనీ..
- మల్లుపెద్ది రత్నకుమారి

మాది కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం, వక్కలగడ్డ. నేను, తాతినేని ఝాన్సీ లక్ష్మీబాయి, మాకినేని వెంకటరమణ, తాతినేని లక్ష్మి, దాసరి పద్మజ కలిసి దీన్ని మొదలుపెట్టాం. అందరివీ రైతు కుటుంబాలే. ఊళ్లో శ్రీ కమలా- నెహ్రూ మహిళా మండలి ఉండేది. మేమంతా దానిలో సభ్యులం. దాని ద్వారా చుట్టుపక్కల మహిళలకు ప్రభుత్వ సాయంతో వివిధ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇప్పించే వాళ్లం. మహిళా మండళ్లకి ప్రభుత్వ నిధులంటూ ఏమీ రావు. ఎంపీ నిధుల నుంచి భవనం మాత్రం ఏర్పాటు చేసుకోగలిగాం. కరెంటు, ఇతరత్రా బిల్లులకు డబ్బులు కావాల్సి వచ్చేది. శిక్షణ కార్యక్రమాలకూ కొంత అవసరమయ్యేది. వీటన్నింటికీ ఆర్థికంగా చేయూతగా ఉంటుందన్న ఉద్దేశంతో 2002లో మహిళా మండలి భవనంలోనే మధురం హోంఫుడ్స్‌ ప్రారంభించాం. అద్దె చెల్లించేవాళ్లం.  మధురం సెల్ఫ్‌ హెల్ప్‌ డ్వాక్రా గ్రూపు మాది. అయిదుగురం రూ.500 చొప్పున పెట్టుబడి పెట్టాం. ఇంట్లో పాత్రలతోనే మొదలుపెట్టాం. అది సంక్రాంతి సమయం కావడంతో ఆ నెలలోనే పెట్టిన మొత్తం వచ్చింది. వ్యాపారానికి ఢోకా లేదనే నమ్మకం వచ్చింది. లాభాలు చూసుకోకుండా మొదటి రెండేళ్లు వచ్చిన మొత్తాన్ని సామగ్రి అమర్చుకోడానికి ఉపయోగించాం. అన్ని సీజన్లలోనూ పిండి వంటలే ఉండవు. అప్పడాలు, పచ్చళ్లు... ఇలా కాలానుగుణంగా చేసుకుంటూ వెళ్లాం. డబ్బులు పెద్దగా పెట్టలేదు. మా కష్టమే. కాబట్టి, ఏమవుతుందోనన్న కంగారులేదు. వ్యాపారం బాగా సాగుతుండటంతో  2008లో పీఎం రోజ్‌గార్‌ యోజన ద్వారా రూ.17లక్షలు వచ్చాయి. దాంతో సొంత భవనం ఏర్పాటు చేసుకున్నాం.

పనితీరు ఇలా!
మాదో పరిశ్రమలా ఉంటుంది. పనిలో చేరే వాళ్లకి ఆరు నెలలు శిక్షణ ఉంటుంది. మొత్తం 20 మంది పని వారున్నారు. రోజుకు 8గం. ముప్పావు గంట మధ్యాహ్న భోజన సమయం. ప్రతి ఒక్కరికీ మాస్క్‌, గ్లౌజ్‌లు, తలకు టోపీ తప్పనిసరి. ఏడాదికి 3 జతల యూనిఫాం ఇస్తాం. ఏటా వార్షికోత్సవం చేసుకుంటాం. ఆ రోజు భోజనాలతోపాటు నెల జీతాన్ని బోనస్‌గా ఇస్తాం. ఎక్కువ గంటలు చేస్తే అదనంగా చెల్లిస్తాం. నెలనెలా రూ.200 ఆహారభత్యం. మేమెవరమూ పెద్దగా చదువుకున్నది లేదు. ఇవన్నీ ఎలా అంటే.. మేం ఒక్కసారిగా ఎదగాలన్న తపనతో దీన్ని ప్రారంభించలేదు. ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాం. ఆ క్రమంలో వచ్చిన ఆలోచనలను చర్చించుకుని అందరికీ నచ్చినవి అమలు చేస్తుంటాం. పనులన్నీ అందరం సమంగా పంచుకుంటాం. పనివాళ్లు.. యజమానులు అనే భేదం లేదు, ఒక కుటుంబంగా ఉంటాం. అందుకే అభిప్రాయ భేదాల్లేకుండా ఇన్నేళ్లూ కొనసాగగలిగాం. లాక్‌డౌన్‌లో ఆదాయం లేకపోయినా పనివారికి జీతాలిచ్చాం. ఆ సమయంలో మాకోసం తెచ్చుకున్న సరకులు డబ్బులిచ్చి కొందరు తీసుకెళ్లేవారు. వాటిని ఉంచినా వృథానే కాబట్టి, అలా చేశాం.

అదే పబ్లిసిటీ!
ప్రత్యేకంగా మార్కెటింగ్‌ అవసరం రాలేదు. తీసుకెళ్లిన వాళ్లు బాగున్నాయని మళ్లీ రావడం, వాళ్ల బంధువులకు పంపించుకోవడమో, ఫలానా చోట బాగున్నాయని చెబితే విని ఇంకొకరు రావడమో జరిగేది. ఒకమ్మాయి విదేశాలకు వెళుతూ మా స్వీట్లు, హాట్లూ, పచ్చళ్లూ తీసుకెళ్లింది. అవి నచ్చి వాటి వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి విదేశాల వరకూ మా వ్యాపార ప్రయాణం ఇలాగే సాగుతోంది. మా దగ్గర చేసిన వాళ్లు బయటికెళ్లి సొంతంగా చేసుకుంటామంటే ప్రోత్సహించాం. నేర్పమని అడిగే వాళ్లకి సాయం చేశాం. 40 ఏళ్ల వయసులో మొదలుపెట్టాం. మా కాళ్లమీద మేము నిలబడటమే కాకుండా ఇంకొందరికి ఉపాధి కల్పించడం సంతృప్తినిస్తోంది.

- ముత్తా నారాయణరావు, కృష్ణాజిల్లా

మహిళలకు తమ మీద తమకు నమ్మకం ఉంటే వారు కన్న కలలన్నీ సాకారం చేసుకోవచ్చు.
- జీనత్‌ అమన్‌, బాలీవుడ్‌ నటి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి