చిన్ననాటి ఆలోచనే ఉపాధిగా...
close
Published : 29/04/2021 00:24 IST

చిన్ననాటి ఆలోచనే ఉపాధిగా...

మినియేచర్‌ వస్తువులు ముద్దు ముద్దుగా ఉండి చూడగానే ఆకట్టుకుంటాయి. వీటిని షెల్ఫుల్లో ఉంచితే గదికే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. సాధారణంగా కాగితం, స్పాంజి, మట్టి, ప్లాస్టిక్‌ వంటి వాటితో చేసిన మినియేచర్‌లనే చూస్తూ ఉంటాం. కానీ బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల కేవీ లక్ష్మి వీటిని సెరామిక్‌తో రూపొందించి తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలే నాకు స్ఫూర్తి అంటుంది లక్ష్మి. అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో పట్టా తీసుకుందీమె. అంత వయసొచ్చినా చిన్నప్పటి బొమ్మలే ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండేవి. చదువు పూర్తి అయ్యాక ఆ ఆలోచనకు రూపాన్నివ్వాలనుకుంది. సృజనాత్మకతకు పదును పెట్టింది. అతిచిన్న పరిమాణంలో పాత్రలు చేయడానికి పింగాణీని ఎంచుకుని 2017లో ‘మినియేచర్‌ పోటరీ’ అంటూ సొంతంగా తయారీని మొదలుపెట్టింది. తొలి ప్రయోగంగా సెంటీమీటరున్నర పరిమాణం, అయిదు గ్రాముల బరువున్న అందమైన వాటర్‌జగ్‌ను తయారు చేసింది. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి ప్రశంసలతో ముంచెత్తేవారు. అది తన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ‘అలా మొదలైంది నా ప్రయాణం. మొక్కల తొట్టెలు, కప్పులు, ప్లేట్లు, జాడీలు వంటివన్నీ చేయడం మొదలుపెట్టా. ‘పాకెట్‌ సైజ్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో వీటి ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశా. చూసిన వారంతా మెచ్చుకునేవారు.

మినియేచర్‌ ఆర్ట్‌ అభిమానులు వీటిని కొంటామని అడుగుతుండే వారు!’’ అని గుర్తుచేసుకుంది తను. ఇంకేముంది... దీన్నే ఉపాధి మార్గంగా మలచుకుంది లక్ష్మి. ‘‘నా చిన్నప్పటి ఆలోచనే కెరీర్‌గా మారిందిప్పుడు. చూడటానికి చిన్నగానే ఉంటాయి. కానీ ఒక్కో వస్తువు తయారీకీ దాదాపు వారం పడుతుంది. మట్టిని కావాల్సిన ఆకారంలో మౌల్డ్‌ చేసి ఎండబెడతా లేదా కాలుస్తా. ఆ తర్వాతే దీన్ని గాజుతో కలిపి సెరామిక్‌ పాత్రగా మలచడం... ఈ దశలో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇలా చేస్తే మెరవడమే కాదు, వాటర్‌ప్రూఫ్‌గా కూడా ఉంటాయి. మధ్యాహ్నం రెండు గంటలకు పని మొదలుపెడితే అర్థరాత్రి వరకు చేస్తూనే ఉంటా. నా మినియేచర్‌ వర్క్‌లో కెటిల్‌, చక్కెరపాత్ర సహా కప్పులతో కలిసి ఉన్న టీ సెట్‌కు చాలా ప్రశంసలు అందాయి. దానికి చాలా డిమాండ్‌ కూడా ఉంది. ఇప్పటివరకు 150 రకాలకు పైగా చేశా. అన్నీ ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయి. ఈ కళపై ఆసక్తి ఉన్నవారికి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా’ అని చెబుతున్న లక్ష్మి. వాళ్లకు నేర్పడమే కాదు... తనూ ఎప్పటికప్పుడు మరిన్ని మెలకువలనూ నేర్చుకుంటూనే ఉంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి