ఆర్థిక లావాదేవీల రారాణి
close
Updated : 30/04/2021 02:04 IST

ఆర్థిక లావాదేవీల రారాణి

రెండొందల సం।।ల ఘనచరిత్ర. లక్షలకోట్ల రూపాయల ఆస్తులతో ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు నిర్వహిస్తోంది జెపి మోర్గాన్‌ గ్లోబల్‌ బ్యాంక్‌. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో రారాజు. అంతటి ప్రతిష్ఠాత్మక బ్యాంక్‌లో కీలక బాధ్యతలను సమర్థంగా నెరవేస్తున్నారు అనూ అయ్యంగార్‌. ఆమె ఆ స్థాయికి చేరేందుకు ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని అవరోధాలను దాటుకుంటూ వెళ్లారో చూద్దాం...

కేరళలో పుట్టిన అను అయ్యంగార్‌ చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. ‘మధ్యతరగతి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఇతరులతో ఎలా మెలగాలి, నన్ను నేను ఎలా వ్యక్తపరచుకోవాలి?- లాంటి కనీస విషయాలు కూడా తెలిసేవి కావు’ అంటూ భేషజాల్లేకుండా చెప్తారామె. బ్యాంకింగ్‌ రంగంలో నిలదొక్కుకునే క్రమంలో పెను సమస్యలొచ్చినా భీతిల్లలేదు. వాటి గురించి ఆలోచిస్తూ, చర్చిస్తూ పరిష్కరించుకుంటూ వచ్చారు. ‘ఇదంతా జీవితంలో భాగమే. ఎప్పుడైనా, ఎవరికైనా సర్దుబాట్లు తప్పవు’ అని నవ్వేస్తారామె.
1999లో ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరి ‘వాల్‌ స్ట్రీట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో మీరుండటం రంగు, జాతి, లింగం, దేశం ఏ పరంగా చూసినా సరికాదు’ అనేశాడు. కానీ ఇలాంటివేవీ ఆమెని అడ్డుకోలేదు, న్యూనతలో పడేయలేదు. సదా పని మీదే ధ్యాస పెట్టారు.

పెద్ద పెద్ద పదవుల్లో...
అను జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అండ్‌ కంపెనీలో ఉత్తర అమెరికా మెర్జర్స్‌ అండ్‌ అక్విజిషన్స్‌కు హెడ్‌గా ఉండటమే గాక మార్కెటింగ్‌ అండ్‌ ఎగ్జిక్యూషన్‌ అసైన్‌మెంట్స్‌కు సలహాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ మహిళా నెట్‌వర్క్‌ సహ ఛైర్‌పర్సన్‌ కూడా. ఇక నియామకాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో అంశాల్లో అను సలహా సహకారం తీసుకుంటుంది సంస్థ. ప్రతి దాంట్లో తనదైన ముద్ర వేస్తారామె.
ఎన్నెన్నో ప్రశంసలు
అమెరికా వెళ్లిన కొత్తలో చలికి తాళలేక 5 డాలర్లతో కోట్‌ కొనుక్కున్న జ్ఞాపకం ఇప్పటికీ ఆమెలో తాజాగా ఉంది. వాండర్‌బిల్ట్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ డిగ్రీ చేశాక అమెరికన్‌ మల్టీ నేషనల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీలో గ్లోబల్‌ కో-హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె నేతృత్వంలో ఆ సంస్థ 575 బిలియన్ల లావాదేవీలు జరిపింది.
‘వాల్‌ స్ట్రీట్‌లో అత్యున్నత స్థాయికి చేరిన ఒకే ఒక్క మహిళ ఆమె. ఇప్పటిదాకా ఒక చేతిలో సిగరెట్లు ఇంకోచేతిలో సస్పెండర్లతో తిరిగే పురుషులే ఉన్నతస్థానాల్లో ఉండేవారు. తొలిసారి ఇంత విశిష్ట స్థానం దక్కించుకున్నారామె. ఆమె పనితనమే ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇతరులు ఎప్పుడో కొన్ని సందర్భాల్లో కష్టపడితే ఆమె నిరంతరం బిజినెస్‌ పెంచారు’ అంటూ ఆమె పై అధికారి జామీ డైమన్‌ ప్రశంసలు కురిపించారు. దానికి అను ‘ఇదేమీ గొప్ప సంగతి కాదు. నైపుణ్యాలు అందరిలోనూ ఉంటాయి. కొత్త ఆలోచనతో మరింత మెరుగుదలకు మనం కనుక కృషి చేయకపోతే ఆ పని ఇంకెవరో చేస్తారు. అదే ఉన్నతి, అదే గమ్మత్తు’ అని నిగర్వంగా బదులిస్తారు.

ఈ స్థాయికి ఎలా వచ్చారు?
మొదట్లో నా భారతీయ యాసను మార్చేసుకుని అచ్చం అమెరికన్లలా ఉండాలని గట్టిగానే ప్రయత్నించేదాన్ని. అప్పట్లో నాకు అంతగా ఆత్మవిశ్వాసం లేదు. పైగా జుట్టు, మేనిరంగు పట్టిస్తాయనే జ్ఞానం కూడా లేదంటూ గుర్తుచేసుకుంటారు.
ఒక సందర్భంలో దుస్తులెక్కడ కొనుక్కోవాలో సలహా ఇచ్చారో సహోద్యోగి. అక్కడి రేట్లు చూసి ఆశ్చర్యంతో కళ్లు తేలేశారామె. ఇక ఆమె దృష్టి వస్త్ర ప్రపంచం మీదికి మళ్లింది. మహిళలకు వృత్తిపరమైన దుస్తులు (యూనిఫాం) అందించాలని భావించారు. అంతర్జాతీయ దాతృత్వ సంస్థతో కలిసి చేసిన కృషికి గాను గత ఏడాది అవార్డు అందుకున్నారు. ఆమె విశ్లేషకురాలు, వక్త కూడా. డైరెక్టర్ల మీటింగులు, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌, షికాగో బూత్‌ లాంటి కీలక సమావేశాల్లో ఇచ్చిన ఉపన్యాసాలు స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహం నింపేలా ఉన్నాయని కితాబులందుకున్నారు.
‘వాల్‌ స్ట్రీట్‌లో అత్యున్నత స్థాయికి చేరిన ఒకే ఒక్క మహిళ ఆమె. ఇప్పటిదాకా ఒక చేతిలో సిగరెట్లు ఇంకో చేతిలో సస్పెండర్లతో తిరిగే పురుషులే ఉన్నతస్థానాల్లో ఉండేవారు.
తొలిసారి ఇంత విశిష్ట స్థానం దక్కించుకున్నారామె. ఆమె పనితనమే ఈ స్థాయిలో నిలబెట్టింది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి