నవ్వుల రారాణులు!
close
Updated : 02/05/2021 09:41 IST

నవ్వుల రారాణులు!

నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం అన్నారు ప్రముఖ సినీ రచయిత జంధ్యాల. అలా నవ్వించే స్టాండప్‌ కామెడీ రంగంలో ఇన్నాళ్లూ మగవాళ్లదే ఆధిపత్యం. ఇప్పుడు అందులోనూ కాలూని జేజేలు కొట్టించుకుంటున్నారు కొందరమ్మాయిలు. వీరిలో చాలా మంది ఉన్నత విద్యావంతులు కూడా... నవ్వుల దినోత్సవం సందర్భంగా వారి గురించి చదవండి...
స్టాండప్‌ కామెడీ అంటే... ఓపెన్‌ మైకు ముందు మాటలతో మాయ చేయాలి. వాక్చాతుర్యంతో ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపించాలి. కొన్నేళ్ల క్రితం వరకూ దిల్లీ, ముంబయి వంటి నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతి... పట్టణాలకూ పాకేసింది. కాఫీషాపులూ, కోవర్కింగ్‌ స్పేసులు... వంటివీ అడ్డాగా మారుతున్నాయి. ఆ నవ్వించడమే కదా! ఏముంటుంది అనుకోవద్దు. వేదిక మీద ఏకపాత్రాభినయం చేయాలి. తడబాట్లు ఉండకూడదు. తూచ్‌ అనడానికి అవకాశం అసలే ఉండదు. హావభావాలు, స్పష్టమైన భాష, శరీర కదలికలే కీలకం. దిల్లీ నుంచి గల్లీ వరకూ... ప్రతి అంశమూ వీరికి హాస్య వస్తువులే అవుతాయి మరి.

పేదరికం నుంచి అగ్రస్థానానికి: భారతీ సింగ్‌

భారతీ సింగ్‌ పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ... కామెడీ క్వీన్‌ భారతిగా పిలిస్తే మాత్రం ఆమె రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆమె స్వస్థలం పంజాబ్‌. రెండేళ్ల వయసులో ఆమె తండ్రి మరణించారు. అప్పుడు భారతి వాళ్ల అమ్మకు 22 ఏళ్లు. కుటుంబాన్ని పోషించడానికి ఆమె ఎంతగానో కష్టపడ్డారు. బాల్యం కటిక పేదరికంలో గడిచినా... తన లక్ష్యాన్ని మాత్రం పట్టుదలతో సాధించారు. ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ షోతో కెరీర్‌ ప్రారంభించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నలభైలక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

మహిళా సమస్యలపై చైతన్యం: అదితీ మిట్టల్‌

మన దేశంలో తొలి మహిళా స్టాండప్‌ కమెడియన్‌. పితృస్వామ్య వ్యవస్థపై చతుర్లు వేయడంలో బాగా ప్రసిద్ధి. పుణెలో పుట్టి పెరిగిన అదితి యూకేలోని రాక్స్‌టన్‌ కాలేజ్‌ డ్రమెటిక్‌ లిటరేచర్‌ చదివారు. అక్కడే కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగి వచ్చేసింది. 2009లో ఆల్‌ ఇండియన్‌ స్టాండప్‌ షోలో పాల్గొని తనదైన ముద్ర వేసింది. ‘థింగ్స్‌ దే వుడ్‌నాట్‌ లెట్‌మీ సే’ ఆమెను మనదేశపు తొలితరం స్టాండప్‌ కమెడియన్లలో ఒకరిగా నిలిపింది. నెలసరి విషయాల నుంచి స్త్రీ సమస్యల వరకూ తనదైన హాస్యంతో చైతన్యాన్ని తీసుకువస్తోంది. మనుషుల మధ్య దూరాలను చెరిపేయడమే హాస్యం ఉద్దేశం అంటుంది అదితీ మిట్టల్‌. ఆమెకు యూట్యూబ్‌లో రెండు లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల దాకా అభిమానులు ఉన్నారు.

కోపం నిరాశల నుంచే హాస్యం!... నీతీ పల్తా

నీతి ప్రముఖ ప్రకటనల సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉండేవారు. అందులో కొత్తదనం లేదనిపిచి ‘గల్లీ గల్లీ సిమ్‌సిమ్‌’ అనే షోకు స్క్రిప్ట్‌ రాయడం ప్రారంభించారు. ‘సెస్మే స్ట్రీట్‌’ సిరీస్‌ మన దేశంలో ప్రసారం ప్రారంభమైనప్పటి నుంచి నాలుగేళ్లపాటు నీతి ఆ షోలో పనిచేశారు. ‘‘కమెడియన్‌గా ఉండటం చాలా కష్టం. మహిళననే కారణంగా చాలా అవకాశాలు చేతికి వచ్చేవి కావు. ఆ కోపం, నిరాశల నుంచే హాస్యానికి అనేకాంశాలు పుట్టుకొచ్చాయి’’ అంటారు నీతి పట్లా. చెప్పిందే చెప్పకూడదు... పంచ్‌లైన్‌ పవర్‌ఫుల్‌గా ఉండాలి అప్పుడే నవ్వించగలం అని చెబుతారు. అర్ధరాత్రి వరకూ షోలకోసం తిరగడం వల్ల తన భద్రత విషయంలో అమ్మ ఆందోళన చెందేదని ఆమె అంటారు. క్రమంగా అర్థం చేసుకున్నారని చెబుతారు. నీతి దేశవ్యాప్తంగా ఉన్న కమెడియన్లందరినీ ఒకచోటకి చేర్చి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఆల్‌మోస్ట్‌ సంస్కారీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తనని యూట్యూబ్‌లో రెండు లక్షలు, ఇన్‌స్టాలో ఎనిమిది లక్షల మంది అనుసరిస్తున్నారు.

కుంగుబాటు నుంచి బయటపడి... కనీజ్‌ సుర్కా

స్టేజిపై హాస్యాన్ని పండించే ప్రక్రియను ఇంప్రొవైజేషన్‌ అంటారు. ఇందులో అందెవేసిన చేయి కనీజ్‌ సుర్కాది. సమకాలీన రాజకీయాల మీద వ్యంగ్య షోలతో ప్రాచుర్యం పొందింది. పాఠశాల రోజుల్లోనే డ్రామా కోర్సు పూర్తి చేసింది. చదువయ్యాక దివ్య పలాట్‌ ట్రూప్‌ ‘ఇంప్స్‌’లో చేరారు. కొన్నాళ్లు పనిచేశాక ఇంప్రొవైజేషన్‌ కళలో పట్టు సాధించడం కోసం న్యూయార్క్‌కి వెళ్లారు. అక్కడే కోర్సు పూర్తి చేసుకుని ముంబయి తిరిగి వచ్చారు. అప్పుడు దీన్నే కెరీర్‌గా తీసుకోవాలనే ఆలోచన ఆమెకు లేదు. 2009లో పెళ్లి, తర్వాత కొన్నాళ్లకే భర్తతో విడిపోయారు కనీస్‌. ఆ బాధతో డిప్రెషన్‌కు గురయ్యారు. దాన్నుంచి స్టాండప్‌ కామెడీతోనే బయటపడి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించా అంటారామె. కనీజ్‌ సుర్కాకి య్యూటూబ్‌లో లక్షా ఎనభైవేలకుపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల అరవై వేలమంది అభిమానులున్నారు.

నాటకాలే ఇటు నడిపించాయి: శ్యామా హరిణి

కాలేజీ రోజుల్లోనే ఎన్నో నాటకాలు వేసింది హరిణి. చెన్నైలోని స్టెల్లా మారిస్‌ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేశాక యాక్టింగ్‌ కోర్సులో చేరింది. ‘‘అక్కడ హాస్య పాత్రల్నే ఎంచుకున్నాను. నిజానికి నాకు స్టాండప్‌ కామెడీ గురించి పెద్దగా తెలియదు. ఓసారి స్టాండప్‌ కామిక్‌ రబీందర్‌తో మాట్లాడినప్పుడు సొంతంగా హాస్యాన్ని సృష్టించుకోమని, ఓపెన్‌ మైక్‌ కార్యక్రమాలకు హాజరవ్వమని సలహా ఇచ్చారు. ఎవామ్‌తో కలిసి తమాషా, టాంగ్లిష్‌ కామెడీ వంటివి చేశా. ఈ రంగంలో పోటీ కూడా ఎక్కువే అని అప్పుడే అర్థమయ్యింది. నాకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా’’ అంటారామె. ‘‘అన్నిసార్లూ మన చతుర్లకు స్పందించకపోవచ్చు. దాన్ని కూడా సమయస్ఫూర్తిగా గుర్తించి నవ్వు తెప్పించగలగాలి’’ అని చెబుతారు హరిణి. ఆమె తెలుగు, తమిళ భాషల్లో హాస్యపు జల్లులు కురిపిస్తున్నారు.

ఆసక్తితోనే...: ప్రణవి పుల్లగుమ్మి

ఎదుటి వాళ్లని ఏడిపించడం కన్నా నవ్వించడమే కష్టం అంటారు హైదరాబాద్‌కి చెందిన ‘ఇంప్రూవ్‌ కామెడీ హైదరాబాద్‌’ (ఐసీహెచ్‌) మిత్ర బృందం. ఇందులో ప్రణవి పాలగుమ్మి, అథిర, జైసోలంకి... ఉన్నారు. ఒకసారి హాస్యాన్ని పంచితే జీవితాంతం గుర్తింపు ఉంటుందంటారు వీళ్లు. ‘చిన్నప్పటి నుంచీ నవ్వించడమంటే ఇష్టం. యూట్యూబ్‌లో ఓ షో చూసి నేనీ రంగంలోకి రావాలనుకున్నా. అమ్మానాన్నలకు మొదట నచ్చేది కాదు. కానీ నా పట్టుదల చూసి కాదనలేకపోయారు. హైదరాబాద్‌ కామెడీ క్లబ్‌, హాట్‌కప్‌ కాఫీ షాప్స్‌ వంటి చోట్ల తెలుగులో చాలా కార్యక్రమాలు చేశాం. అలాగని ఉద్యోగాన్ని పక్కన పెట్టేయలేదు. ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో టెక్నికల్‌ లీడ్‌గా పనిచేస్తున్నా’ అంటారామె.

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ‘మసాబా, మసాబా’గా తన హాస్యంతో సందడిచేస్తున్న పుణ్యఅరోరా సర్దార్జీల హాస్యాన్ని పుణికిపుచ్చుకొన్న పంజాబీ అమ్మాయి. ఎంబీఏ చదివి ఫొటోగ్రఫీలో పీజీ డిప్లొమా చేసిన ఈ అమ్మాయికి ఇన్‌స్టాలో లక్షమందికి పైగా అభిమానులున్నారు.

దిల్లీలో పుట్టి పెరిగిన మల్లిక... ఆమె అభిమానులకు ‘మేకప్‌ దీదీ’గానే పరిచయం. పెన్సిల్వేనియాలో చదువుకొని ప్రకటనల రంగంలో అడుగుపెట్టిన ఈ అమ్మాయి డబ్‌స్మాషెస్‌, స్నాప్‌చాట్స్‌తో నవ్వించడం మొదలుపెట్టి... ప్రస్తుతం స్టాండప్‌ కమెడియన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతోంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి