అడవిని పెంచిన అమ్మ!
close
Published : 03/05/2021 00:46 IST

అడవిని పెంచిన అమ్మ!

నిరుపేద కుటుంబంలో పుట్టిందామె. చిన్నప్పటి నుంచి సామాజిక వివక్ష... ఊరు దాటే అవకాశం లేక ఆగిపోయిన చదువు... ఇవన్నీ చిన్న వయసులోనే ఆమెను సేవ వైపు మళ్లించాయి. అదే తనని సర్పంచ్‌గా గెలిపించింది. అది మొదలు గ్రామాభివృద్ధి, మహిళా సాధికారత, బాలికా విద్య, పర్యావరణ పరిరక్షణ వరకూ ఆవిడ కృషి చేయని రంగం లేదు. ఆమె చేసిన అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఆ ఊరికి బారులు తీరుతున్నారు! ఇదంతా కంకూబెన్‌ అమృత్‌లాల్‌ స్ఫూర్తి కథ...

కంకూబెన్‌ది గుజరాత్‌లోని జూత్‌ పంచాయతీ పరిధిలోని కుక్మా గ్రామం. కుల వృత్తి చిత్రకళ. ఆ ఊరి బడిలో ఏడో తరగతి వరకే చెబుతారు. అందువల్ల తన చదువు అక్కడితోనే ఆగిపోయింది. యుక్తవయసు నుంచే గ్రామ వాలంటీర్‌గా సేవలందించేది. 2017లో సర్పంచ్‌ ఎన్నికలు వచ్చాయి. కంకూబెన్‌ కన్నా మంచి అభ్యర్థి ఊరి వాళ్లకు దొరకలేదు. దాంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌ అయ్యింది. జూత్‌ పంచాయతీ పరిధిలోని కుక్మాతోపాటు మరో మూడు గ్రామాల బాధ్యతలనూ భుజాన వేసుకుంది. డ్రాప్‌అవుట్లను బడి బాట పట్టించింది. పాఠశాలలో మంచి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థిని పేరును ఆమె నివసించే వీధికి పెట్టడం మొదలు పెట్టింది. స్త్రీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా మహిళా సభను నిర్వహిస్తుంది. మహిళలు చేతివృత్తులు, చిత్రకళ వంటి వాటి ఆధారంగా స్వావలంబన సాధించేలా చేయూతనిస్తోంది. 

పార్కుగా డంపింగ్‌ యార్డు! .. స్థానికులు పంచాయతీ స్థలంలో చెత్త వేసే వారు. దాని వల్ల ఆ చుట్టు పక్కలంతా అపరిశుభ్రత, దుర్గంధం. అది చూసి ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించాలనుకుంది. చెత్త వేసే ప్రాంతంలో అందమైన పార్కు నిర్మించి, ‘సావిత్రీ బాయి ఫూలె’ పేరును పెట్టింది. నిర్దేశిత ప్రాంతాల్లోనే చెత్తను వేయాలంటూ నిబంధన విధించి, కట్టుదిట్టంగా అమలు చేసింది. ఇప్పుడు ఊరి వారంతా శుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు.
లక్ష మొక్కల లక్ష్యం... సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు కంకూబెన్‌ ప్రధాన లక్ష్యం పర్యావరణ పరిరక్షణ. ఇందుకోసం పెద్ద ఎత్తున మొక్కలను పెంచాలనుకుంది. నీటి సౌకర్యం కావాలి కదా! అందుకోసం ఓ సృజనాత్మక ఆలోచన చేసింది. ‘ఈ ప్రాంతంలో భూగర్భ జలాల శాతం చాలా తక్కువ. 600 అడుగులు తవ్వినా నీరు రాదు. అందుకే ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురికినీటిని రీసైకిల్‌ చేసి, వాటిని మొక్కల పెంపకానికి వాడాలనుకున్నా. అనుకున్నంత సులువుగా కాలేదీపని. దీన్ని సవాలుగా తీసుకున్నా. దీనిపై చాలా అధ్యయనం చేశాం.  కాలుష్య జలాల రీసైక్లింగ్‌ కోసం రూ.7.50 లక్షలతో 2017లో ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. ఈ వ్యయమంతా వివేకానంద రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భరించింది. మురికి నీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వాడటం మొదలుపెట్టాం. ఇందులో ప్రతి మొక్క నాటడం, వాటిని పరిరక్షించడంలో గ్రామస్థులంతా వాలంటీర్లుగా సేవలందించారు. ఈ నాలుగేళ్లలో ఇక్కడ 7,500 చెట్లను పెంచాం. వీటిలో ఆయుర్వేద వృక్షాలతోపాటు పండ్లు, పూల మొక్కలూ ఉన్నాయి. ఈ తరహా పరిశోధనకు సృష్టికర్త అయిన జపాన్‌ శాస్త్రవేత్త ‘మియావాకి’ పేరే మేం పెంచిన అటవీ ప్రాంతానికి పెట్టాం. ఈ అడవికి రోజూ 10 వేల లీటర్ల వృథా నీటిని మంచి నీరుగా మార్చి అందిస్తున్నాం. అడవికి వెళ్లే మార్గంలో మరో 50వేల మొక్కలనూ నాటి, పెంచుతున్నాం. మొత్తం లక్ష మొక్కలను నాటాలన్నది మా లక్ష్యం. ఇప్పుడు భూగర్భజలాల శాతం పెరగడంతో చిన్న చిన్న పంటలూ పండుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఇప్పుడెందరికో పాఠంగా మారింది. చాలా మంది వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారు’ అని కంకూబెన్‌ సంతోషంగా చెబుతుంది. ఇవన్నీ చేస్తూనే తను చిత్రకళలో ప్రత్యేక స్థానాన్నీ సంపాదించుకుంది. ఏడాదిపాటు కష్టపడి ‘టోరన్‌’ పేరుతో వేసిన ఓ కళారూపం ప్రెసిడెంట్‌ అవార్డునూ సాధించి పెట్టింది. కూరగాయలు, నూనెలతో తయారు చేసిన 22 రకాల సహజసిద్ధ వర్ణాలను మేళవించి వేసిన ఈ పెయింటింగ్‌ ఆ అమ్మ మనసులానే అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి