అరబ్‌ అమ్మాయి ఆస్ట్రోనాట్‌ అయింది!
close
Updated : 05/05/2021 00:45 IST

అరబ్‌ అమ్మాయి ఆస్ట్రోనాట్‌ అయింది!

అరబ్‌ దేశాలు అనగానే చమురు బావులు, అంతులేని సంపద గుర్తొస్తాయి. అదే సమయంలో మహిళలపై ఆంక్షలు కూడా! అలాంటి చోటి నుంచి ఆస్ట్రోనాట్‌గా ఎదిగిందో యువతి. దాని కోసం చిన్నప్పటి నుంచే కృషి చేసింది. ఎట్టకేలకు సాధించి, ఆ స్థాయిని అందుకున్న తొలి అరబ్‌ యువతిగానూ నిలిచింది. ఎన్నో అంచెల పరీక్షలు దాటి నాసాలో శిక్షణకు సిద్ధమైంది. ఆమే నోరా అల్‌ మత్రూషి. తన ప్రయాణాన్ని తెలుసుకుందామా!
నోరా అల్‌ మత్రూషిది షార్జా. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ఫిన్‌లాండ్‌లోని వాసా యూనివర్సిటీ ఆఫ్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌ నుంచి శిక్షణను పొందింది. ప్రస్తుతం అబుదాబీలోని నేషనల్‌ పెట్రోలియం కన్‌స్ట్రక్షన్‌ సంస్థలో పనిచేస్తోంది. యూఏఈ పూర్తిగా చమురుపైనే ఆధారపడకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో 2017లో స్పేస్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. స్థానిక యువతను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా అభ్యర్థులను ఎంపికచేసి, శిక్షణనిస్తున్నారు. ఈ ఏడాదికిగానూ మహమ్మద్‌ బిన్‌ రాషీద్‌ స్పేస్‌ సెంటర్‌ (ఎంబీఆర్‌ఎస్‌సీ) నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు మొత్తం 4305 దరఖాస్తులు వచ్చాయి. ఏడంచెల కఠిన వడపోత తర్వాత ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు. వారిలో ఒకరు మత్రూషి. పరిశోధన అనుభవం, ఐక్యూ, వ్యక్తిత్వం, సాంకేతిక నైపుణ్యం వంటి వివిధ అంశాల్లో పరీక్షించారు. ఆపై ఇంటర్వ్యూతోపాటు వైద్యపరీక్షలూ నిర్వహించి తుది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారి వివరాలను ఆ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రాషీద్‌ అల్‌ ముక్తమ్‌ స్వయంగా తెలియజేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 65 మహిళా వ్యోమగాముల జాబితాలో చేరింది. టెక్సాస్‌లోని నాసా జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో 30 నెలల శిక్షణ అనంతరం ‘నాసా-2021 ఆస్ట్రోనాట్‌ కాండిడేట్‌ క్లాస్‌’ లో చేరుతుంది. ఆపై భవిష్యత్‌ అంతరిక్ష మిషన్లలో పాల్గొంటుంది.
27 ఏళ్ల మత్రూషికి చిన్నప్పటి నుంచే అంతరిక్ష సంబంధిత అంశాల్లో ఆసక్తి ఉండేది. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించినా పాల్గొనేది. అందులో భాగంగా మేథమేటిక్స్‌, ఇంజినీరింగ్‌ అంశాల్లో పట్టు పెంచుకుంది. ఈమె అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌లో సభ్యురాలు. 2011 ఇంటర్నేషనల్‌ మేథమెటికల్‌ ఒలింపియాడ్‌లో మొదటి స్థానం సంపాదించింది. 2013లో దక్షిణ కొరియాలో యూఏఈ యూత్‌ అంబాసిడర్స్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. యూఎన్‌ ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌కు 2018, 2019ల్లో యూఏఈ తరఫున ప్రాతినిధ్యం వహించింది. అంతరిక్షంలో పనిచేయాలనే తన కలను ఇలా నెరవేర్చుకుంది. ‘మీకు ఏది ఆనందాన్నిస్తుందో దాన్నే ఎంచుకోవాలనే సూత్రాన్ని నమ్ముతాను’ అనే మత్రూషి.. నచ్చిన రంగంలో సాగాలనుకునే అరబ్‌ అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మహిళల పట్ల అరబ్‌ దేశాల్లో మారుతున్న ధోరణికి ప్రతీకగానూ ఈమెని అభివర్ణిస్తున్నారు.

 

నేను మంచి నేతగా ఉండాలనుకుంటున్నాను. మంచి మహిళానేతగా కాదు. పిల్లలకు జన్మనిచ్చే మహిళ అనే సాధారణ గుర్తింపును నేను కోరుకోవట్లేదు.

- జెసిండా ఆర్డెర్న్‌, న్యూజిలాండ్‌ ప్రధాని

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి