ఆ ప్రశ్నకు సమాధానం... ఇరవయ్యేళ్ల సేవ!
close
Published : 05/05/2021 00:35 IST

ఆ ప్రశ్నకు సమాధానం... ఇరవయ్యేళ్ల సేవ!

ఒక చేత్తో చక్రాలకుర్చీని తోసుకొంటూ... మరో చేత్తో గుక్క పెడుతున్న పిల్లని ఓదారుస్తోందామె. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర ఎర్రలైటు పడినప్పుడల్లా... ఏ మనసున్న మారాజయినా సాయం చేయకపోతాడా అని ఆశగా చూస్తోంది. ఆ దృశ్యాన్ని మనసులో నింపుకొన్న అడుసుమిల్లి నిర్మల అభాగ్యులకు అండగా ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. ఆమెని కదిలించిన ఆ దృశ్యమే 20 ఏళ్లుగా వేల మందికి సేవ చేయిస్తోంది...
‘నేను ఏలూరు జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఓ సారి రోడ్డు పక్కన ఓ దివ్యాంగురాలు బిడ్డ ఆకలి తీర్చలేక పడిన వేదన చూడగానే హృదయం ద్రవించింది. ఇలాంటి పేదలకు నేనేం చేయగలను అనే ప్రశ్న వేసుకున్నాను, అప్పట్నుంచి తోచిన సాయం చేస్తూ వచ్చా’నని, గుర్తు చేసుకున్నారు నిర్మల. అలా సమస్య ఉన్న ప్రతి చోటా చేయూత అందించే చేతులు ఉండాలన్నదే ఆశయంగా పెట్టుకున్నారు.
అలా మొదలైంది...
ఏలూరు జిల్లా పరిషత్తు కార్యాలయంలో 1975 నుంచి 2014 వరకూ నిర్మల పర్యవేక్షణాధికారిగా చేశారు. 2000 సంవత్సరం నుంచి సేవలో పాల్గొనేవారు. జీతంలో చాలాభాగం పేదల సాయానికి ఉపయోగించేవారు. స్నేహితురాళ్లతో కలిసి ‘సాయి నిర్మల కిట్టీ పార్టీ’ ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2008లో 500 మంది నేత్రదానానికి ప్రోత్సహించి, అంగీకార పత్రాలను కలెక్టర్‌కు అందించారు. అదే ఏడాది ఇంటింటికి తిరిగి, లారీడు దుస్తులు సేకరించి కృష్ణా జిల్లా వరద బాధితులకు అందించారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి వచ్చిన రూ.50 వేల నగదుని బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల వైద్యానికి అందించారు. ఏటా మహిళా దినోత్సవం నాడు అన్నదానాలు, వైద్య శిబిరాలు, ఎయిడ్స్‌ బాధిత చిన్నారులు, పేదలకు ఆర్థిక సాయం వంటివీ చేస్తున్నారు.

చదువులకూ తోడు...
ఆర్థిక ఇబ్బందులతో పదోతరగతితో చదువు ఆపేసిన పదిమంది అమ్మాయిలకు చేయూతనిచ్చారు. ఇప్పుడు వారిలో ఇద్దరు ప్రైవేట్‌ ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. మిగిలిన వారు గ్రూప్స్‌కు సన్నద్ధం అవుతున్నారు.
మరిన్ని విధాల...
హుద్‌హుద్‌ ధాటికి కకావికలమైన విశాఖపట్నం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1.50 లక్షలు ఇచ్చారు. సొంత నిధులకు, దాతల సహాయాన్ని జతచేసి ఏలూరు బస్టాండులో శౌచాలయాలు నిర్మించారు. పది శ్మశానాల్లో సౌకర్యాలు కల్పించారు. మిత్రులు, సన్నిహితుల సాయంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏటా సదస్సులు నిర్వహిస్తారు. వాటిలో పాల్గొన్న వారికి ప్రేరణ కలిగించి... దుస్తులు, క్రీడాపరికరాలు, ఇతర వస్తువులు సేకరిస్తున్నారు. వీటిని పేదలు, అనాథలకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకూ 25 వేల మందికి ఇలా సాయం చేశారు. ఏలూరు ఆసుపత్రికి వచ్చే రోగుల ఆకలి తీర్చేందుకు సమీపంలో అల్పాహారాన్ని అందించే వారు. దీన్ని కరోనా ముందు వరకూ కొనసాగించారు. రోజూ 40, 50 మంది రోగులు ఇక్కడ ఆకలి తీర్చుకునేవారు. 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సుమారు వెయ్యి మంది పదో తరగతి విద్యార్థులకు రోజూ సాయంత్రం అదనపు తరగతుల సమయంలో అల్పాహారాన్ని అందించే వారు. కరోనా కాలంలో 50 మంది మహిళలకు కుట్టుపనిలో శిక్షణ ఇప్పించారు.  వారిప్పుడు బ్యాగులు, మాస్క్‌లు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. కొంతమంది పేద విద్యార్థులకి బడికి వెళ్లేందుకు సైకిళ్లు అందించారు.
సేవే లక్ష్యం..  
ఉద్యోగ విరమణ అనంతరం తన సేవల్ని విస్తృతం చేయాలని భావించారు. అందుకే 2017లో మానవతా స్వచ్ఛంద సంస్థలో చేరి ఏలూరు యూనిట్‌కు కార్యదర్శి, అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలందించారు. ప్రస్తుతం సొంతంగా సేవ చేస్తూనే ‘మానవత’ ద్వారా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ ద్వారా మృతదేహాల ఫ్రీజర్‌ బాక్స్‌లు, సేవారథాలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం దాదాపు 5 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వైద్యశిబిరాల ఏర్పాటు, ఉచితంగా మందుల పంపిణీ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు వంటివన్నీ నిర్మల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వయో భారాన్ని లెక్కచేయకుండా బతికి ఉన్నంత వరకూ సేవతోనే మమేకం అవుతానంటున్న నిర్మల కృషి స్ఫూర్తిదాయకం.

కుటుంబమే దన్ను

నిర్మల స్వస్థలం ఏలూరే. చిన్నప్పట్నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువ. అమ్మ సీతా మహాలక్ష్మి గృహిణి. నాన్న సత్యనారాయణ చిరుద్యోగి. అన్నయ్య గుప్త, తమ్ముడు వెంకట సుబ్రమణ్యం నిర్మల సేవా కార్యక్రమాల్లోనూ చేయూత నిస్తున్నారు. మానవతా సంస్థ  కోసం రూ. 8 లక్షల విలువైన వ్యానుని సమకూర్చారు గుప్త. కొన్నేళ్లుగా సుబ్రమణ్యం ప్రతి నెలా దాదాపు రూ.70 వేల వరకు పంపిస్తున్నారు. ఇక భర్త కృష్ణమోహన్‌ వ్యాపారి. హేతువాది. ధార్మికశీలి. వీరి తోడ్పాటే మరింత ప్రోత్సాహమిస్తోందంటున్నారు నిర్మల.

ఉప్పాల రాజాపృథ్వీ, ఏలూరు

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి