Mother's Day: నడిపించారు... గెలిపించారు!
close
Updated : 09/05/2021 06:56 IST

Mother's Day: నడిపించారు... గెలిపించారు!

ఆడపిల్లవు... నీకెందుకు చదువు అనలేదు సమాజాన్ని చదివే సహనాన్ని అందించారు!అమ్మాయివి.. నీ సరిహద్దులు ఇంతే అని గిరిగీయలేదు ఆకాశమంత ఎత్తు ఎగిరే స్వేచ్ఛనిచ్చారు!  స్త్రీలను బంధించే సంప్రదాయ సంకెళ్లను ఛేదించి... ఎంచుకున్న రంగంలో బిడ్డలను ‘శక్తు’లుగా తీర్చిదిద్దారు. మాతృదినోత్సవం సందర్భంగా... ఆ అమ్మల గురించి పిల్లలు ఏం చెబుతున్నారో చదవండి...


ఇప్పటికీ చిన్న పిల్లలాగే చూస్తుంది
జస్టిస్‌ కె.లలిత, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

‘జీవితంలో వెనుదిరిగి చూసుకుంటే అమ్మే కనిపిస్తుంది. సహజంగా అమ్మానాన్నలు పిల్లల్ని 20 ఏళ్లు లేదా పెళ్లయ్యేంత వరకు పెంచుతుంటారు. మా అమ్మ అమరేశ్వరి నన్ను ఇప్పటికీ పెంచుతోంది. పెళ్లయినా తర్వాత కూడా పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ కాచుకుని ఉంటున్నారు. న్యాయవాదిగా, ప్రస్తుతం న్యాయమూర్తిగా నేను విజయపథంలో పయనించడానికి అమ్మే కారణం. కోర్టులో అడుగుపెట్టాక ఏ ఇతర విషయాలూ పట్టించుకోవాల్సిన అవసరంలేదు. అమ్మ ఉందన్న ధైర్యం. పిల్లలు... బంధువుల వ్యవహారం... ఇతర విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది. నేను వంట చేసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రతి విషయమూ అమ్మ చూసుకుంటుంది. నా ఆరోగ్య విషయంలో ఎక్కువ దృష్టిపెడుతుంది. స్వల్ప తేడా కనిపించినా జాగ్రత్తలు తీసుకునేంత వరకు వదిలిపెట్టదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా మా అమ్మే నాకు రక్షణ కవచం. మా పిల్లల్ని కూడా తనే పెంచి పెద్దచేసినా ఏదైనా విషయం వస్తే.. మా అమ్మాయి తర్వాతే ఎవరైనా, మా అమ్మాయే అన్నింటికన్నా ముఖ్యం అని తెగేసి చెబుతుంది. నేనంటే అంత ప్రేమ. ఇప్పటికీ నన్ను చిన్నపిల్లలాగే చూస్తుంది. నాకు చాలా సానుకూల దృక్పథం అంటుంటారు. అది మా అమ్మవల్ల వచ్చిందే. మా పిల్లలు ప్రేమగా ఉంటారని బంధువులంతా అంటుంటారు. అది మా అమ్మ నుంచి నాకు అబ్బిన స్వభావం. దాన్నే మా పిల్లలకు పంచాను. దీంతో ఇప్పటి జనరేషన్‌ పిల్లల్లా కాకుండా.. వారూ భిన్నంగా పెరిగారు. ఆ గొప్పతన కూడా అమ్మకే చెందుతుంది. మాపైనే కాదు బంధువులు, వారి పిల్లలనూ ప్రేమతో చూస్తారు.


క్రమశిక్షణ... నిజాయితీ... నిరాడంబరత...
- జి.వైజయంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌, తెలంగాణ

మా అమ్మ పవనకుమారి నేర్పిన ఈ మూడే నా జీవితానికి మార్గదర్శకాలు. మా తాత తహసిల్దార్‌. మా నాన్న డిప్యూటి కలెక్టర్‌. అయినా అమ్మ మమ్మల్ని నిరాడంబరంగానే పెంచింది.  ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివిన అమ్మ ఉదయం నాలుగింటికే నిద్ర లేచేది. అదే మాకూ అలవాటు చేసింది. తను నేర్పిన పద్ధతి ప్రకారమే సర్వేజనా సుఖినోభవంతు ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తాం. స్నేహితులతో విభేదాలొద్దనేది. అలాగైతే ఆ స్నేహానికి అర్థం లేదనేది. ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాలని చెప్పేది. ఇతరుల వస్తువులు ఎప్పుడూ తీసుకోవద్దనేది. ఉన్నంతలోనే సర్దుకోవాలి  అప్పు చేయడానికి తను వ్యతిరేకి. మన ప్రవర్తన పక్కవాళ్లను ఇబ్బందిపెట్టేలా ఉండకూడదు అని చెబుతూండేది. మన ప్రవర్తనతోనే మన అభివృద్ధి అన్నది గుర్తుంచుకోమనేది. ఇవన్నీ నాకు నిత్యస్మరణీయాలు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషపై పట్టుపెంచుకోవాలని, అందుకోసం మాతో పద్యాలు, పాటలు, శ్లోకాలు చదివించేది. మన కళలు, సంస్కృతిపైనా అవగాహన కోసం సంగీతం, నృత్యంలో కూడా శిక్షణ ఇప్పించింది. ఇవన్నీ మనిషిలో సున్నితత్వాన్ని కలిగిస్తాయని ఆవిడ నమ్మకం. అమ్మ నేర్పిన నిజాయితీ... క్రమశిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నా.


ఆమె వల్లే నేనిలా
- డాక్టర్‌ హేమలత, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌

‘నువ్వు పెద్దయ్యాక డాక్టర్‌ అవ్వాలి’.... నాకు ఊహ తెలిసినప్పట్నుంచి ఈ మాటని పదేపదే అమ్మ నవనీత నాతో అనేది. ఆ మాటలు నాలో ఎంతెలా ముద్రించుకుపోయాయంటే... ‘నేను డాక్టరే అవుతా’ అని బలంగా నమ్మాను. ఈ క్రమంలో నాకెదురయిన ఎన్నో అవరోధాలని దాటేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అమ్మే నాకు అందించింది. చిన్నప్పుడు రామకృష్ణపరమహంస పుస్తకాలని మాకు చదివి వినిపిస్తూ ఉండేది. ఇవన్నీ నాకో బలమైన వ్యక్తిత్వాన్ని అందించాయి. తర్వాత రోజుల్లో ఆమె నాతో ఒక స్నేహితురాల్లా ఉండేది. మేమిద్దరం చన్నపిల్లల్లా ఆడుకునేవాళ్లం. నేనీ రోజు ప్రతిష్ఠాత్మక సంస్థకు సేవలందించగలుగుతున్నా అంటే కారణం... అమ్మే. 


ఆత్మవిశ్వాసాన్ని నేర్పింది
- అపూర్వ రావ్‌, వనపర్తి ఎస్పీ

మా అమ్మ అరుణ. గృహిణి. విద్యావంతురాలు. నాన్న నాగేశ్వరరావు. వ్యాపారం చేస్తారు. సోదరి శీతల్‌. అమ్మ ఎప్పుడూ స్వతంత్రంగా ఆలోచించాలని కోరుకునేది. ఆర్థికంగా కూడా స్వతంత్రంగా ఉండాలని చెబుతుండేది. అమ్మాయిలు ఎవరికీ తక్కువ కాదు అన్నదే మాకు నేర్పింది. మాలో ఆత్మవిశ్వాసం కలిగేలా చేసేది. చిన్నప్పుడు తనే దగ్గరుండి హోంవర్క్‌ చేయించేది. అర్థం కాని విషయాలు చెప్పేది. రోజూ దినపత్రికలను చదివించేది. ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఏనాడూ నిబంధనలు పెట్టలేదు. సమాజంలో ఏం జరుగుతోంది, మంచేంటి, చెడేంటి వివరించేది. వాటిపై మేం స్వేచ్ఛగా ఆలోచించి స్వతంత్రంగా, నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దింది. ఈ రోజు ఈ స్థాయికి ఎదిగామంటే దానికి అమ్మ నేర్పిన ఆలోచనా విధానమే కారణం. ప్రధానంగా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వారి మీద తల్లులకు నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకం మాపై మా అమ్మకు ఉంది. ఇంజినీరింగ్‌ అవ్వగానే నాకు మంచి ఉద్యోగం వచ్చింది. దాంట్లో నాలుగేళ్లు చేశాక, మానేసి సివిల్స్‌కు సిద్ధమవుతానని చెప్పాను. ఆ తర్వాత సివిల్స్‌లో ఎంపికై ఐపీఎస్‌ తీసుకుంటానన్నాను. ఈ రెండు సందర్భాల్లోనూ అమ్మ నా నిర్ణయాన్ని సమర్థించింది. ప్రధానంగా ఆడపిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్ది ఇలా చేస్తే బాగుంటుంది... ఇలా ఉండాలి అనే ఆలోచనలో ఎప్పుడూ వారిపై రద్దుకూడదు. వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలి. వాటికి తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలి. అమ్మాయిల విషయంలో తల్లి ప్రాత కీలకం. వారికి చదువు చెప్పించడంతో పాటు ఇతరులతో సమానంగా ఎదిగేలా చేయడంలో అమ్మదే ప్రధాన పాత్ర. ఇలా చేస్తే వారు పెళ్లి అయిన తర్వాత కూడా స్వతంత్రంగా ఉంటారు. ఆర్థికంగా నిలబడతారు. బయట ఏమైనా జరిగినా ఇంటికి వచ్చి అమ్మకు చెప్పేలా స్వేచ్ఛను ఇవ్వాలి. అలా జరిగిన రోజు ఆ అమ్మాయి జీవితానికి పూర్తి భరోసా ఉంటుంది. మా అమ్మ ఇచ్చిన స్వేచ్ఛ, కలిగించిన ఆత్మవిశ్వాసమే ఇప్పటి నేను.


అమ్మే నాధైర్యం
- జస్టిస్‌ శ్రీదేవి, తెలంగాణ హైకోర్ట్‌

శాంతం, ఓర్పు, సహనం అనే పదాలను కలిపితే వచ్చే అర్థం అమ్మ. నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం మా అమ్మ ప్రోద్బలం. మాది విజయనగరం. అక్కడే డిగ్రీ పాసయ్యాను. మా నాన్న అప్పట్లో ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. నేను అక్కడికి వెళ్లి ఎమ్మెస్సీకి దరఖాస్తు చేశాను. సీటైతే వచ్చింది కానీ చివరి నిమిషంలో ఓ నాయకుడి సిఫారసుతో దాన్ని మరొకరికి ఇచ్చారు. ఈ అన్యాయానికి నేను చాలా బాధపడ్డాను. అప్పుడు మా అమ్మే ఓదార్చింది. ధైర్యం చెప్పింది. లా చదవమని ప్రోత్సహించింది. అందుకు ఇంట్లో అందరినీ ఒప్పించింది. దాని కోసం రూర్కెలాలో ఉన్న నైట్‌ కాలేజీలో సీటు దొరికితే అక్కడికి పంపింది. మన భాష కాదు, మన ఊరు కాదు... ఆడపిల్లను, ఎవరూ లేని చోట... ఒక్కదాన్నే అనుకోవద్దని ధైర్యాన్ని నూరిపోసింది. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పుడూ, ఇప్పుడూ అమ్మే నా ధైర్యం.


ఎక్కడైనా నా వెం అమ్మ
- దివ్యదేవరాజన్‌,తెలంగాణ స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి

మా అమ్మ నందిని దేవరాజన్‌ నాకు మార్గదర్శి. ప్రేమకు ప్రతిరూపం. నాకు ఆమె కొండంత బలం. నా పురోగతికి మూలస్తంభం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆమె ప్రభావంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. చెన్నైలో ఆమె ప్రముఖ దంతవైద్యురాలు. ఆసుపత్రిలో అంకితభావంతో పని చేస్తూనే కుటుంబంపైనా పూర్తి శ్రద్ధ చూపుతుంది. వృత్తికి, కుటుంబానికి సమన్యాయం చేయడం ఆమెను చూసి నేర్చుకున్నాను. అమ్మలాగే నేనూ డాక్టర్ని కావాలనుకున్నాను. అయితే వైద్యురాలిగా తాను నిరంతరం అత్యవసర సేవల్లో ఉన్నానని... మరో రంగంలో మరింతగా సేవ చేసే వృత్తిని ఎంచుకోవాలని సూచించింది. మా నాన్న ఇంజినీర్‌. నేనూ ఇంజినీరింగ్‌ చేశాను. తర్వాత అమ్మ మాటల్ని ఆచరణలో పెట్టేందుకు సివిల్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకోగా తను నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. సివిల్స్‌ శిక్షణ కోసం దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. మా నాన్న నాతో పాటు వస్తున్నారు. ప్రయాణానికి ముందు రోజు ఆయన కాలు విరిగింది. ఆ పరిస్థితుల్లో మా అమ్మ నాకు ధైర్యం చెప్పి నాతో పాటు దిల్లీకి వచ్చింది. నన్ను హాస్టల్లో చేర్పించి, కొన్ని రోజులు ఉండి అంతా కుదురుకుంది అనుకున్నాక వెళ్లింది. రోజూ తను ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేది. ఐఏఎస్‌ అయ్యాక నేను తెలంగాణలో విధుల్లో చేరేందుకు బయల్దేరాను. అప్పుడూ తన పనులన్నీ పక్కనపెట్టి నాతో వచ్చింది. నేను విధుల్లో చేరాక కొన్ని రోజులు నాతోనే ఉండి వెళ్లింది. నా ఉద్యోగంలో భాగంగా క్షేత్ర పర్యటనలకు వెళ్తూంటాను. అలాంటప్పుడు తనూ నాతో వస్తుంది. అక్కడి ప్రజలను గమనిస్తుంది. తన అనుభవం, పరిశీలనలతో ఎన్నో విషయాల్లో సలహాలను ఇవ్వడంతో పాటు నాకు సంపూర్ణ మద్దతునిచ్చి నడిపిస్తూంటుంది. కరోనా వచ్చాక ఆమె చెన్నైలో ప్రాక్టీసు మానేసి ఇప్పుడు నా దగ్గరే ఉంటోంది. అదో సంతోషం.


ప్రతీ మహిళ మా అమ్మలా ఉండాలనుకుంటాను
- టీకే శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి

మా అమ్మ ఇందిర. తనంటే ఎంతో ఇష్టం. నన్ను ప్రభావితం చేసిన దేవతగా భావిస్తాను. ప్రతీ మహిళా మా అమ్మలా ఉండాలనుకుంటాను. సంప్రదాయక ఉత్తర భారత కుటుంబానికి చెందిన ఆమె చదువు మధ్యలో మానేసినా... విప్లవాత్మక భావాలతో ఉండేది. అందరినీ ఎదిరించి  మా కుటుంబంలోని అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివించింది. ఆమె వల్లనే మేమంతా మంచి స్థాయిలో ఉన్నాం. చదువులో, సంస్కారంలో, సేవల్లో, వృత్తిలో రాణిస్తున్నాం. నేను ఐఏఎస్‌ కావడానికి అమ్మ ప్రోత్సాహమే ముఖ్యకారణం. వృత్తిపరంగానే గాక విధి నిర్వహణలో... నాకు జాగ్రత్తలు చెబుతూ ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తుంటుంది. ఐఏఎస్‌ అయ్యాక విధుల్లో తీరికలేకుండా ఉన్నప్పుడు... నా దగ్గరకు వచ్చి మా అబ్బాయిని తనే చూసుకుంది. ఆమె ద్వారా బాబుకు ధైర్యం, ఓపిక, దయాగుణం అలవడ్డాయి. అమ్మాయిలను తీర్చిదిద్దేది, కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మలే. ఆమెను చూసి ఎన్నో నేర్చుకుని, వాటినే ఆచరిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నాను.


రెండు సార్లు పెళ్లి తప్పించుకున్నా!
- డాక్టర్‌ నీరజప్రభాకర్‌, ఉపకులపతి, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం

‘మా అమ్మ మద్దతే లేకుంటే నా చదువు పదిలోనే ఆగిపోయేది. మా అమ్మ భద్రజకు చదువంటే చాలా ఇష్టం. పదో ఏటనే మా తాత ఆమెకు పెళ్లి చేశారు. దాంతో 5తోనే తన చదువు ఆగిపోయింది. అత్తవారి ఉమ్మడి కుటుంబం బాధ్యతలు అమ్మపై పడ్డాయి. తన 18 ఏట నేను పుట్టాను. నాన్న వీరాస్వామికి బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలిఫోన్‌ ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం వచ్చాక మా మకాం ఖమ్మం మారింది. తన కష్టాలు మేం పడకూడదనేది మా అమ్మ ఆలోచన. చిన్నప్పుడే పెళ్లయితే ఎన్ని ఇబ్బందులో నాకు, చెల్లికీ ఎప్పుడూ చెబుతుండేది. ఇలాంటి వాటిని చదువు ద్వారానే నిలవరించవచ్చనేది తన ఆలోచన. బాగా చదువుకోవాలని ప్రోత్సహించేది. ధైర్యం, విలువలతో ఎలా బతకాలో నేర్పించేది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీలు అయ్యేవి. ఎక్కడికి వెళ్లినా మా చదువులకు ఆటంకం రాకుండా చూసుకొనేది. పదో తరగతిలో నాకు పెళ్లి చేయాలని మా తాత (అమ్మ వాళ్ల నాన్న) పట్టుబట్టాడు. అమ్మ ససేమిరా అంది. బాగా చదువుకుని, ఒక వయసొచ్చాకే పెళ్లి ప్రస్తావన అని అందరికీ గట్టిగా చెప్పేసింది. నాన్న కూడా అమ్మకు మద్దతు ఇచ్చాడు. అప్పటి మా అమ్మ నిర్ణయమే నా జీవితానికి మలుపు. ఇంటర్‌ తరువాత రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ దరఖాస్తు చేసుకోవడానికి నా స్నేహితురాలు, వాళ్ల నాన్న వెళ్తుంటే వారితో నన్ను పంపించింది. బంధువులు వారించినా అమ్మ మాత్రం నా కూతురు ఉన్నత చదువులు చదవాలని గట్టిగా నిలబడింది. బీఎసీˆ్స అగ్రికల్చర్‌ పూర్తిచేసిన వెంటనే బంధువులు మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అదే సమయంలో నాకు ఎమ్మెస్సీలో సీటు వచ్చింది. అమ్మానాన్నా మళ్లీ నాకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెస్సీ తరువాత సింగరేణిలో ప్లాంటేషన్‌ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉద్యోగం సాధించా. అక్కడే ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్‌తో నా పెళ్లి చేశారు. తరువాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశా. అక్కడే ఉద్యోగం సాధించాను. నా జీవితంలో కీలక సమయాల్లో అమ్మ అండగా నిలబడటం వల్లే ఈ రోజు ఇలా ఉన్నా.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి