మనసున్న నర్సమ్మలు!
close
Published : 12/05/2021 00:27 IST

మనసున్న నర్సమ్మలు!

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

చేసే పనిని ప్రేమించే మనసుండాలే కానీ... ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఇట్టే జయించొచ్చు!  దీన్ని నిజమని నిరూపించారు ఇద్దరు మనసున్న నర్సమ్మలు. ఇరవై ఏళ్లుగా సేవామార్గంలో సాగుతూ..  ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జాతీయ అవార్డుని అందుకుంటున్న మహమ్మద్‌ సుక్రా, అరుణకుమారిలు వారి అనుభవాలను వసుంధరతో పంచుకున్నారు...

ఆ చిన్నారులని కాపాడాను..

నన్‌గా మారి సేవచేయాలనుకుంది. అది వీలుపడక... నర్స్‌గా మారి తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. ఎన్నో సవాళ్ల మధ్య 22 ఏళ్లుగా పేదసాదలకు వైద్యసేవలు అందిస్తున్న అనపర్తి అరుణకుమారి హైదరాబాద్‌లోని విజయనగర్‌ కాలనీలో అఫ్జల్‌సాగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(ఎఫ్‌)...
మాది హైదరాబాద్‌లోని మెహిదీపట్నం. నాన్న జాన్‌, అమ్మ శోభారాణి. మా ఇంట్లో అమ్మమ్మ, ఇద్దరు పిన్నమ్మలు, ముగ్గురు అత్తయ్యలు అందరూ  ఏఎన్‌ఎంలుగా చేశారు. వాళ్ల ప్రభావంతో నాకూ సేవ చేయాలని ఉండేది. ‘నన్‌’గా మారతానంటే ఇంట్లో ఒప్పుకోలేదు.. బదులుగా నర్సువికమ్మని సలహా ఇచ్చారు. పదో తరగతి అయ్యాక నర్సింగ్‌ కోర్సులో చేరాను. కానీ మధ్యలోనే చదువాపి పెళ్లిచేశారు. ఇద్దరాడపిల్లలు పుట్టారు. నాన్న ప్రోత్సాహంతో మూడేళ్ల తర్వాత నాకిష్టమైన నర్సింగ్‌ కోర్సును పూర్తి చేశాను. 2006లో మావారు అనారోగ్యంతో చనిపోయారు. అప్పటికి పిల్లలకి చిన్నవయసు. ఒకవైపు వాళ్లని చదివిస్తూ, మరోవైపు ఉద్యోగానికి వెళ్లేదాన్ని. కెరీర్‌ తొలినాళ్లలో నా ముందున్న సవాల్‌ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. అప్పట్లో ఆ ఆపరేషన్ల విషయంలో అపోహల కారణంగా ప్రజలు ముందుకు వచ్చేవారు కాదు. దాంతో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించేదాన్ని. అప్పటికి మీజిల్స్‌ టీకాలు కొత్త. కొంతమంది పిల్లలకు అవి పడలేదు. దాంతో పరిస్థితి విషమించింది. ఇప్పట్లా ఫోన్లు అవీ లేకపోయినా సమాచారం అందుకుని... పరుగున వెళ్లి వాళ్లని నిలోఫర్‌లో చేర్పించాను. దాంతో ఆ చిన్నారుల ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటన ఎప్పటికీ మరిచిపోలేను. అయితే ఇప్పుడున్న కొవిడ్‌పై పోరాటంతో పోలిస్తే అవన్నీ చిన్నవే అనిపిస్తాయి. కొవిడ్‌ ప్రబలిన తర్వాత ఇంటింటికీ తిరిగి అవసరమైన వైద్య సేవలు అందించా. ఆ సమయంలో నేనూ ఆ మహమ్మారి బారిన పడ్డాను. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా కరోనాని జయించి తిరిగి విధుల్లో చేరాను. ప్రస్తుతం రెండో దశలోనూ ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించి మందుల కిట్లు అందిస్తున్నా. కరోనా నుంచి కోలుకునేందుకు మనోధైర్యం ఎంతో అవసరం. అది కోల్పోకుండా బాధితులకు ధైర్యం చెబుతున్నాను. వ్యాక్సినేషన్‌లోనూ పాల్గొంటున్నాను. ఉత్తమ ఏఎన్‌ఎం అవార్డు మొదలుకుని ఎన్నో అవార్డులని అందుకున్నాను.

యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌

వాళ్లలో ఒకరిగా  మారాను...

చిన్నప్పట్నుంచీ ఆమెకో కల. పేదరికంతో సతమతమవుతూ... ఆరోగ్య సమస్యలొస్తే ఆకుపసర్లతో సరిపెట్టుకొనే గిరిజనులకు సేవచేయాలని. అందుకే టీచర్‌ ఉద్యోగాన్ని కాదనుకుని తండాల బాట పట్టింది. వాళ్ల భాష నేర్చుకుని... వాళ్లలో ఒకరిగా మారి 16 ఏళ్లుగా వైద్య సేవలందిస్తోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సుక్రా ప్రస్తుతం ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌ గ్రామ ఏఎన్‌ఎంగా సేవలందిస్తోంది...
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని జనగామ మా సొంతూరు. నాన్న మహమ్మద్‌ లాల్‌, అమ్మ కైరున్నీసా. మా అమ్మమ్మ స్వగ్రామమైన రామవరంలో పెరిగాను. ఆ గ్రామానికి చుట్టూ గిరిజన తండాలుండేవి. చాలామంది గిరిజనులు ఏవేవో పనులమీద అమ్మమ్మని కలిసేవారు. వాళ్లలో చాలామంది ఆకుపసర్లు, నాటు వైద్యాన్నే నమ్ముకొనేవారు. బాగా చదువుకొని అలాంటి వాళ్లకి మంచి వైద్యం అందించాలని నా కోరిక. నా శ్రద్ధ గమనించిన నాన్న జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించి చదివించారు. పదో తరగతిలో మంచి మార్కులొచ్చాయి. ఆపైన చదివించలేక పెళ్లిచేశారు. కొన్ని రోజులు వ్యవసాయ కూలీగా పనిచేశాను. అప్పుడే అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.175 జీతం. రోజులు హాయిగా గడిచినా మనసులో వెలితిగా ఉండేది. ఇక ఆగలేక నర్సింగ్‌ కోర్సులో చేరాను. హుస్నాబాద్‌ మండలం రామవరం సబ్‌సెంటర్‌లో ఏఎన్‌ఎంగా ఉద్యోగంలో చేరాను. మొదట్లో గిరిజనులు సహకరించేవారు కాదు. మందులంటే వద్దనేవారు. ఇలా కాదని.. వాళ్ల భాష నేర్చుకున్నా. వాళ్ల వేషధారణలోనే ఇంటింటికీ వెళ్లి పాటలు పాడుతూ వాళ్లలో ఒకరిగా కలిసిపోయేదాన్ని. కుటుంబ నియంత్రణ, టీకాలు, అంటువ్యాధుల గురించి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. నా పద్ధతి విజయవంతం అయ్యింది. అలా జిల్లాలో అత్యధిక కు.ని ఆపరేషన్లు చేయించినందుకు ఉత్తమ ఏఎన్‌ఎంగా అవార్డులు అందుకున్నా. అవన్నీ ఒకెత్తు. కరోనాపై పోరాటం మరొకెత్తు. ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో నాకూ కరోనా వచ్చింది. అలాగని వెనక్కి తగ్గలేను కదా.. నయం కాగానే మళ్లీ గ్రామాల్లో తిరిగి వైద్య సేవలు అందిస్తున్నా. నేనే కాదు చాలామంది నర్సులు సమయానికి కొవిడ్‌ కిట్లు అందించడం, అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలని కాపాడుతున్నారు. ఇదంతా మా అదృష్టం.

బుర్ర స్వామిగౌడ్‌, భీమదేవరపల్లి

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి