సేవకు సై అంటుందీ నారీసేన!
close
Published : 13/05/2021 00:11 IST

సేవకు సై అంటుందీ నారీసేన!

ఇంటివంట నుంచి... మిద్దెతోటపంట వరకూ ప్రతిదీ చర్చించుకుంటారు. ఒకరేదయినా సాధిస్తే మరొకరు...మనస్ఫూర్తిగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. తోటివారు కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ముందుకొస్తారు. వాళ్ల సైన్యం చిన్నదేం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేలమంది సభ్యులున్న ఈ ‘నారీసేన’ని ముందుండి నడిపిస్తున్న సైన్యాధ్యక్షురాలు లతాచౌదరి బొట్ల...
మాది హైదరాబాద్‌. అమ్మ రాధాకుమారి, నాన్న భాస్కర్‌రావు. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. అంతా సజావుగా సాగుతోంది అనుకున్న సమయంలో నాన్న వ్యాపారంలో నష్టాలు రావడంతో జీవితం తలకిందులైంది. ఇంటర్‌ తర్వాత... ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించాను. రూ.600 జీతం. మరికొన్ని రోజులకే నాకు పెళ్లయ్యింది. ఓరోజు మా ఫ్రెండ్‌ వాళ్ల నాన్నగారి సలహాతో ఈటీవీలో వ్యాఖ్యాతల కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయంటే వెళ్లి.. సెలెక్ట్‌ అయ్యాను. అప్పుడు నాకు 18 ఏళ్లు. అలా ఈటీవీలో ఫ్రీలాన్సర్‌గా నా కెరీర్‌ ప్రారంభమయ్యింది. మనోరంజని అనే కార్యక్రమానికి కొన్నాళ్లు వ్యాఖ్యాతగా పనిచేశాను. తర్వాత సీరియల్స్‌, సినిమాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఈటీవీలో చేసిన ‘నామొగుడు నాకే సొంతం’ ధారావాహిక నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
పేదపిల్లల కోసం...
నటనా రంగంలో కొంతకాలం ఉన్న తర్వాత వ్యాపారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. వైజాగ్‌ వెళ్లి... ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఆదాయం బాగానే ఉండేది. దాంతో సేవారంగంలో అడుగుపెట్టాలనుకున్నా. ఆ సమయంలోనే స్వచ్ఛంద సేవకురాలు రమాదేవి పరిచయం అయ్యారు. ఆమె స్ఫూర్తితో 2004లో 100 మందితో ఉమెన్‌వెల్ఫేర్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి... మహిళలకు, పిల్లలకు అండగా ఉండటం, అనాథశవాల దహనసంస్కారాలు, పేదవారికి భోజనం సమకూర్చడం వంటి కార్యక్రమాలు చేసేదాన్ని. ఊహించని విధంగా నా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. హైదరాబాద్‌కు తిరిగొచ్చి బొటిక్‌ ప్రారంభించాను. అప్పుడే అమెరికాలో జరుగుతున్న తానా ఈవెంట్‌లో స్టాల్‌ పెట్టుకునే అవకాశం వచ్చింది. మొదటిసారి అమ్మతోపాటు అమెరికా వెళ్లినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అమెరికా వెళ్లిన ఐదు నెలల్లోనే మరొక సంస్థతో కలిసి లాస్‌ఏంజిల్స్‌, డల్లాస్‌, అట్లాంటా, చికాగో, నార్త్‌ కెరొలినాలో వంటి చోట్ల ఈవెంట్లు నిర్వహించగలిగాను. కానీ మావారు మధుసూదనరావుకి అనారోగ్య కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేశాను.

వాట్సాప్‌లో... అభివృద్ధి పాఠాలు
ఇక్కడికి వచ్చాక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా 40 మంది సభ్యులతో హైదరాబాద్‌ కేంద్రంగా ‘నారీసేన’ సంస్థను 2018 మార్చిలో ప్రారంభించాను. ప్రస్తుతం ఇందులో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఏపీ, తెలంగాణ, అమెరికా, దుబాయ్‌ వంటి ప్రాంతాలకు చెందిన ఎనిమిది వేలమంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీళ్లలో సామాన్య గృహిణులతో పాటు డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లూ ఉన్నారు. 62 వాట్సాప్‌ గ్రూపులతో వీరందరినీ సమన్వయం చేసుకుంటున్నాం. పద్మకాంతి, రాధ, ఉమ, మల్లికాగోపాల్‌, చైతన్య, హారికలు ముందు నుంచీ ఈ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ గ్రూపుని ముందుకు నడిపిస్తున్నారు. మేమంతా కలిసి మహిళలకు చక్కని ఉపాధి మార్గాలని చూపేందుకు వారంలో ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. వీటిని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వేదికగా నిర్వహిస్తున్నాం. ఎవరైనా మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఆర్థికసాయం అందిస్తున్నాం. వారంలో ఒకరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తే మరొకరోజు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తాం. క్రీడలు, ఫ్యాషన్‌తోపాటు సామాజిక సమస్యలపైనా చర్చిస్తాం. వీటన్నింటికీ మించి సేవామార్గంలోనూ మా బృందం ముందుంటోంది. మూడేళ్ల క్రితం సెకండ్‌హ్యాండ్‌ వస్తువులని ఉచితంగా అందించే లక్ష్యంతో ‘కైండ్‌నెస్‌ స్ట్రీట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాం. అది విజయవంతం అయ్యింది. ఎంతోమంది మంచి మనసుతో ఇస్తున్న వస్తువులు పేదలకు చేరుతుంటే సంతోషంగా అనిపిస్తోంది. దీన్ని ఇతర రాష్ట్రాల్ల్లోనూ విస్తరించాలనుకుంటున్నాం.
కరోనా సమయంలో అండగా..
ఎంతో మంది కరోనా బారిన పడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు మా నారీసేన సభ్యులతో హైదరాబాద్‌, బెంగళూరు, కరీంనగర్‌, సిద్దిపేట, మంచిర్యాల, వైజాగ్‌, కాకినాడ, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో ఉచిత భోజనం, మందులు అందిస్తున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు లక్ష కుటుంబాలకు భోజనం, వలస కూలీలను స్వగ్రామాలకు తరలించడం వంటి కార్యక్రమాలు చేశాం. ప్రస్తుతం నేను స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నాను. అందులో వచ్చిన డబ్బుతో పాటు, ఎన్నారై స్నేహితులు, నారీసేన సభ్యుల ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఎనిమిదో తరగతి.. పాప బీటెక్‌ చదువుతున్నారు.

 

తుపాకుల సాయిచరణ్‌, సిద్దిపేట

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి