ఇంట్లో నుంచి వెళ్లిపోతే... ఆస్తిలో హక్కు వస్తుందా?
close
Published : 14/05/2021 00:23 IST

ఇంట్లో నుంచి వెళ్లిపోతే... ఆస్తిలో హక్కు వస్తుందా?

మా నాన్న మద్యానికి బానిసై అమ్మను, నన్ను హింస పెడుతున్నాడు. ఇల్లు వదిలి వెళ్లిపోమని వేధిస్తున్నాడు. అమ్మకు చదువులేదు. ఏ పనీ చేయలేదు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి ఆమెను పోషించగలననే నమ్మకం నాకుంది. తనని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతే నాన్న ఆస్తిలో భాగం వస్తుందా? ఆ ఇంట్లో ఉండే హక్కు లభిస్తుందా?

- ఓ సోదరి, ఆళ్లగడ్డ

మీ పరిస్థితి బాధాకరం. అయినా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు ఆస్తిలో వాటా కావాలంటే ముందు అది ఆయన స్వార్జితమా లేక పిత్రార్జితమా అన్నది తెలియాలి. పిత్రార్జితమైతే అందులో వాటా కోసం భాగస్వామ్య దావా వేయొచ్చు. స్వార్జితమైతే తనకు నచ్చిన వారికి రాసిచ్చే హక్కు ఆయనకి ఉంది. ముందు తన భర్త ఇంట్లోనుంచి వెళ్లిపోమంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని అమ్మతో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయించండి. ప్రొటెక్షన్‌ అధికారి దాన్ని కోర్టుకి పంపిస్తారు. ఈ కేసు ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఇంటిలో నివసించే హక్కుని కోరవచ్చు. మీరు మైనర్‌ అయితే మీ ఇద్దరి మెయింటెనెన్స్‌, మీ చదువు ఖర్చు, అమ్మ వైద్య అవసరాల నిమిత్తం భత్యం అడగొచ్చు. ఏక మొత్తంగానూ పరిహారాన్ని అడిగి తీసుకోవచ్చు. గృహహింస చట్టంలో విడాకుల ప్రసక్తి లేదు కాబట్టి ఒకవేళ మీ నాన్న ప్రభుత్వోద్యోగం చేస్తుంటే... పదవీవిరమణ సమయంలో ఆయనకి వచ్చే మొత్తంలో కొంత భాగాన్ని మీ ఇద్దరూ పరిహారంగా కూడా కోరవచ్చు. మీరు చూపించే సాక్ష్యాధారాలను బట్టి కోర్టులో నిర్ణయం ఉంటుంది. అంటే జీతానికి సంబంధించిన రుజువులు, ఆస్తికి సంబంధించిన కాగితాలు కోర్టుకి చూపించాలి. వీటితో పాటు ఇంట్లో ఉన్నప్పుడు రక్షణ కోసం ప్రొటెక్షన్‌ ఆర్డర్‌ కూడా కోరవచ్చు. ఆలోచించి అడుగేయండి.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి