తానే గీసుకుంది గెలుపు చిత్రం
close
Published : 14/05/2021 00:24 IST

తానే గీసుకుంది గెలుపు చిత్రం

డిగ్రీ అయిందో లేదో అమెరికా సంబంధం వచ్చింది. పందిరేసినంత సేపు నిలవలేదా పెళ్లి. నిష్కారణ కోపం. హింస, కొట్టడం నుంచి అంతు చూసే స్థాయికెళ్లింది. ఆమె సాధించాల్సింది మిగిలే ఉంది కనుకనే మూడుసార్లు చావునుంచి తప్పించుకుంది.  ఉన్నతోద్యోగాలు చేసింది. చిత్రకారిణిగానూ రాణిస్తూ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన హైదరాబాద్‌ అమ్మాయి హిమబిందు కథ ఇది...
పెళ్లి కోసం రెండు వారాల సెలవుమీద వచ్చాడో ప్రవాసాంధ్రుడు. సంబంధాలు కుదరలేదు. పెళ్లి చేసుకోకుండా వెళ్తే గేలిచేస్తారని తపిస్తుండగా పదేళ్లు చిన్నదైన అమ్మాయిని చూపించారు. డిగ్రీ చదివింది. వీణ మీటింది. పాట పాడింది. డబ్బున్న కుటుంబం కాకున్నా చురుగ్గాఉందని చేసుకున్నాడు. తీరా అమెరికా వెళ్లాక డాక్టరు, ఇంజనీరు అమ్మాయిల సంబంధాలొచ్చాయి. తొందరపడి చేసుకున్నాననే చిరాకు కోపంగా మారి హింసగా మారింది.

ఆ అమ్మాయే హిమబిందు. రోజూ భర్త తిట్లు, దెబ్బలు దాటి హత్యాయత్నాలు జరిగాయి. ఒకరోజు సహనం నశించి, తిరగబడింది. పరువూ, ఉద్యోగమూ పోతాయని పుట్టింటికి పంపేశాడు. బిందు తండ్రి బాలకృష్ణ బంధుమిత్రుల్లో చులకన కావొద్దని సర్దిచెప్పబోతే తల్లి లీలాకుమారి మాత్రం కూతురి ఒంటిమీద గాయాలకు చలించింది. ‘మంచి కుటుంబం, ఆర్థికంగా నిలదొక్కుకున్నారని నచ్చచెబితే కాస్త పెద్దవాడైతేనేం అనుకున్నాం కానీ ఇంత ఘోరమా’ అని బాధపడింది. లెక్చరర్‌గా చేస్తోన్న ఆవిడ పరువుకంటే కూతురి ప్రాణమే ముఖ్యమనుకుంది. అయినవాళ్లు వెలేసినా ఖాతరుచేయలేదు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును తీర్చిదిద్దుకోమంది. కుమార్తెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బిందుకది రెండో జన్మ. అప్పుడు కంప్యూటర్‌ కోర్సు, ఎంబిఎ పూర్తిచేసింది. జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థలో ఉద్యోగం వచ్చింది. తెలివి తేటలు, అంకితభావం, కఠోర శ్రమతో కొద్దికాలంలోనే గ్లోబల్‌హెడ్‌గా ఎదిగింది. రెండు దశాబ్దాల కెరీర్‌లో సర్వీస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులెన్నో ఖాతాలో వేసుకుంది. విషాదమేమంటే ఉన్నత స్థాయి పొందినా, కీర్తి గడించినా ప్రశంసలకు బదులు ‘భర్త, పిల్లలు లేరు కనుక ఓవర్‌టైములు చేస్తోంది’ లాంటి అవహేళనలు ఎదురయ్యేవి. అధికారులతో సంబంధాలు అంటగట్టిన వ్యాఖ్యలకు కన్నీళ్లొచ్చినా, వాళ్ల స్థాయి అంతేలెమ్మని సర్దిచెప్పుకుంది. ఉద్యోగం చేస్తూనే హెచ్‌ఐవి బాధితులు, అంధులైన చిన్నారులతో క్యాండిల్స్‌, కాగితపు సంచులు తయారు చేయించేది. ఒకసారి సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తుండగా బాల్యం గుర్తొచ్చింది. బొమ్మలంటే ఇష్టమున్నా ఎన్నడూ శ్రద్ధపెట్టలేదు. ఇప్పుడదే ఒత్తిడిని తగ్గించుకునే మార్గమని గ్రహించింది. తనకో ప్రత్యేకత ఉండాలని కాఫీ వ్యర్థాలతో బొమ్మలేయడం ఆరంభించింది. అక్కణ్ణించీ ఆమె దారంతా విజయకేతనాలే.

ఉద్యోగంలో భాగంగా దేశదేశాల పర్యటనలు, సేవా కార్యక్రమాలు, కాఫీ కళాఖండాల సృజన.. ఈ అత్యుత్సాహాన్ని శరీరం తట్టుకోలేక మొరాయించింది. ఫలితం గుండెపోటు. న్యూరోసర్జన్‌ హెచ్చరికలతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. చిత్రలేఖనం మీద దృష్టిపెట్టింది. భారతీయ సంస్కృతిని ప్రతిఫలించే ఆమె పెయింటింగులు విదేశాల్లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం, ఇంగ్లీషు, స్పానిష్‌ తదితర భాషలు నేర్పిస్తూ బెంగళూరులో స్థిరపడింది.‘జీవితం చాలించాలనుకున్నప్పుడు నువ్వు చనిపోవడం కాదు, నిరాశని చంపు’ అంటూ అమ్మ  స్థైర్యాన్నిచ్చింది. అలా అమ్మ నాకు రెండుసార్లు జన్మనిచ్చింది. వారితోపాటు మా ఫ్యామిలీ డాక్టర్‌ కెవిఆర్‌ ప్రసాద్‌ నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. జీవితం ఒక వరం. దాన్ని అర్థవంతంగా మలుచుకోవాలిగా’’ అంటున్న బిందు ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులని దక్కించుకుంది. తాజాగా కర్నాటక ప్రభుత్వం నుంచి ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డుని అందుకుంది.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి