ఈ అమ్మాయిలు... వెన్నంటి మనసున్నోళ్లు...
close
Published : 15/05/2021 00:46 IST

ఈ అమ్మాయిలు... వెన్నంటి మనసున్నోళ్లు...

యువ రక్తం కుదురుగా కూర్చోనివ్వదు..పైగా కరోనా వేళ పీజీ పరీక్షలు వాయిదా పడి సెలవులు వస్తే ఏం చేస్తారు..? ఇంకాస్త వెసులుబాటు దొరికిందని కాలాన్ని వెళ్లదీస్తారు. కానీ ఈ ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన యువ వైద్యురాళ్లు మాత్రం అలా చేయలేదు. కరోనా పల్లెలు, పట్టణాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో తమ తోడ్పాటును సేవారూపంలో అందించాలని భావించారు. ‘ఉచిత టెలి- కన్సల్టేషన్‌’ పేరిట రోజులో 16 గంటల పాటు కరోనా బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న హుజ్మాషరీన్‌ తన బ్యాచ్‌మేట్లతో కలిసి అందిస్తున్న స్వచ్ఛసేవానిరతి తీరిలా...
కరీంనగర్‌ సమీపంలోని ప్రతిమ వైద్యకళాశాలలో 2014-2020 వరకు వైద్య విద్యనభస్యసించిన విద్యార్థులంతా గడిచిన పక్షం రోజులుగా ఉచిత వైద్యసలహాలు, సేవలతో అందరి మన్ననల్ని పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ వివరాలు, ఫోన్‌నంబర్లతో కూడిన సమయసారిణిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రతి 2 గంటలకు ముగ్గురు చొప్పున వైద్యులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఫోన్‌లకు స్పందిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి అభద్రతతో ఉన్న వారికి భయాన్ని పోగొట్టేలా భరోసానిస్తున్నారు. అందుబాటులో ఉన్న మందులను ఎలా వాడాలి..? వారి ఆరోగ్యస్థితి వివరాలకు తగినట్లు అవసరమైన సలహాలు, సూచనల్ని కౌన్సెలింగ్‌ రూపంలో ఈ వైద్యబృందం అందిస్తోంది. మొత్తం 24 మంది వైద్యులున్న ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది డాక్టర్‌ హుజ్మాషరీన్‌. ఈమె తల్లి సర్దార్‌ హున్సీసా కూడా వైద్యురాలు. ఆమె గతేడాది కరీంనగర్‌లో కరోనా ఉద్ధృతిగా ఉన్న సమయంలో ఫోన్లో బంధువులకు, తెలిసినవాళ్లకి రేయింబవళ్లు సలహాలు అందించారు. అదే స్ఫూర్తితో తనకు ఈ ఆలోచన వచ్చిందని హుజ్మాషరీన్‌ చెబుతున్నారు. వాస్తవానికి గతనెలలో కరోనా వల్ల వీళ్లు రాయాల్సిన పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఖాళీగా ఉండటం ఎందుకని తన ఆలోచనల్ని తోటి అమ్మాయిలతో పంచుకున్నారు. ఇలా మొదట్లో ఐదారుగురితో ప్రారంభమైన ఈ సేవలో ప్రస్తుతం 24మంది యువ వైద్యులున్నారు. ఇందులో హుజ్మాషరీన్‌, నవ్యశ్రీ, ప్రసన్న, స్నేహ, రవీనా, హమాని, శరణ్య, శివాని, సన, సుప్రియ, రవళిలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రోజులో సగటున 250 నుంచి 300 మందికి ఫోన్‌లో వీరంతా సలహాల్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుండటంతో ఇతర వైద్యులు కూడా ఈ బృందంలో సభ్యులవుతున్నారు. ఇప్పటి వరకు 3వేల మందికి ఫోన్లో సేవనందించారు. 

- తుమ్మల శ్రీనివాస్‌, కరీంనగర్‌

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి