Shreya Dhanwanthary: ఆ సినిమా 267సార్లు చూశా!
close
Updated : 16/05/2021 12:46 IST

Shreya Dhanwanthary: ఆ సినిమా 267సార్లు చూశా!

శ్రేయా ధన్వంతరి... అచ్చ తెలుగమ్మాయి. హిందీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసే వాళ్లకు బాగా తెలిసినమ్మాయి. మిస్‌ ఇండియా పోటీలతో మొదలుపెట్టి అగ్రశ్రేణి మోడల్‌ ఎదిగింది. తెలుగులో ‘స్నేహగీతం’, హిందీలో ‘వై చీట్‌ ఇండియా’ సినిమాలతో వెండితెరపై మెరిసింది. ది ఫ్యామిలీ మ్యాన్‌, స్కామ్‌ 1992 వంటి వెబ్‌ సిరీస్‌లలో నటనతో ఆకట్టుకుంటోంది. ‘మీటూ’ ఉద్యమం లోనూ గళాన్ని బలంగా వినిపించిన శ్రేయతో వసుంధర ముచ్చటించింది.
ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యం ఉంటుంది. నాకు నటనా రంగంలో స్థిరపడాలని కోరిక. నాకో గుర్తింపు రావడానికి చాలా ఏళ్లు పట్టేసింది. అయినా నేనెక్కడా నిరాశ పడలేదు. నా ప్రతిభను నిరూపించుకునే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నా. అదే నన్ను నిలబెట్టింది. నిజానికి నటినవ్వాలని నాలుగేళ్ల వయసులోనే అనుకున్నా.
నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. కానీ నాన్న విజయ్‌ విమాన రంగంలో పనిచేయడంతో నాకు పదిహేడేళ్లు వచ్చే వరకూ మధ్య ప్రాచ్యంలోనే నివసించాం. అమ్మ రేణుక గృహిణి. నాకో చెల్లి శ్రుతి, తనిప్పుడు ఎడ్యుకేషన్‌ రంగంలో ఉంది. నా ప్రాథమిక, ఉన్నత విద్య అంతా... బ్రిటిష్‌ విధానంలో సాగింది. అందులో కళలు ఓ భాగం. అలా చిన్నప్పటి నుంచే థియేటర్‌ ఆర్ట్స్‌, స్క్రిప్ట్‌రైటింగ్‌ అలవడ్డాయి. అప్పట్లో మన దేశంతో అనుబంధం పెంచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం సినిమాలే. ఏ కాస్త ఖాళీ దొరికినా... నాన్న హిందీ, అమ్మ తెలుగు సినిమాలు చూపించేవారు. దాంతో నాకు తెలియకుండానే యాక్టింగ్‌పై ఆసక్తి పెరిగింది. అలా గుండమ్మ కథ, ఆదిత్య 369, క్షణక్షణం వంటి చిత్రాలెన్నో చూశా. క్షణక్షణం ఇప్పటిదాకా 267 సార్లు చూశానంటే నమ్ముతారా! అంతేకాదు మన సంస్కృతి గురించీ చెప్పేవారు. దానిపై ఇష్టంతోనే కూచిపూడి, కథక్‌, భరతనాట్యం నేర్చుకున్నా. తెలుగు చదవడం, రాయడమూ వచ్చు!

దిల్లీకి మారాక...
నా కాలేజీ చదువు కోసం మా కుటుంబం దిల్లీకి వచ్చి స్థిరపడింది. వరంగల్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశా. మూడో ఏడాదిలో ఉండగా ఫెమినా మిస్‌ ఇండియా సౌత్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం దొరికింది. మొదటి రన్నరప్‌గా నిలిచా. ఆపై ‘మిస్‌ ఇండియా’లో ఫైనలిస్టుగా పోటీపడ్డా. అందరిలానే మా అమ్మానాన్నలు కూడా చదువు పూర్తయ్యాకనే ఏదైనా అనేవారు. అనుకోకుండా స్నేహగీతం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదో గొప్ప అనుభవం. తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దిల్లీ... ముంబయిల మధ్య తిరుగుతూ మోడలింగ్‌ చేసేదాన్ని. ఆ సమయంలో భూమీ పెడ్నేకర్‌, షానూ శర్మలు ముంబయి వస్తే నీ లక్ష్యం నెరవేరుతుంది అని సలహా ఇచ్చారు. దాంతో బాలీవుడ్‌ అడ్డాకు వచ్చేశా. కానీ ఇక్కడ జీవితం అంటే... బోలెడు ఖర్చు. ఇంటి అద్దెకైనా వస్తాయి కదా అని పార్ట్‌టైమ్‌ మోడలింగ్‌ చేయాలనుకున్నా. ఎయిర్‌టెల్‌, పాంటలూన్స్‌, సఫీ, ప్రోవోగ్‌, వోగ్‌ ఐవేర్‌, గీతాంజలి మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్‌ ఆభరణాలు, జాష్న్‌ చీరలు, లిబర్టీ ఫుట్‌వేర్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రచార చిత్రాల్లో అవకాశం దక్కింది. అవి చేస్తూనే నటనలో మెరుగుపరచుకోడానికి కొన్ని నెలలు థియేటర్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ పొందా. ముంబయి రావడం మంచిదైందని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా.

 

ఇబ్బందుల్ని అధిగమించి...
బాలీవుడ్‌లో ఎంట్రీకి తొమ్మిదేళ్లు పట్టింది. అయినా ఎప్పుడూ నిరాశపడలేదు. ఇమ్రాన్‌ హష్మితో నటించిన ‘వై చీట్‌ ఇండియా’ నా మొదటి హిందీ చిత్రం. మధ్యలో వెబ్‌చిత్రాలెన్నో చేశా. ది రీయూనియన్‌, దేవాంశి టైలర్‌, లేడీస్‌ రూమ్‌... వంటి వాటికి మంచి ఆదరణ లభించింది. 2019లో అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌లో జోయా పాత్ర బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2020లో సోనీ ఎల్‌ఐవీ నిర్మించిన ‘స్కామ్‌ 1992’ సిరీస్‌లో సుచేతా దలాల్‌గా నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘వైరల్‌ వెడ్డింగ్‌’ సిరీస్‌కి డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, రైటర్‌, నటిగానూ పనిచేశా.
బాలీవుడ్‌లో ప్రతిభకు అవకాశం దక్కుతుంది. ఆడిషన్‌లో నిరూపించుకోగలిగితే చాలు. రంగుని బట్టో, బరువుని బట్టో ఇంకో కారణంతోనో కాదనే పరిస్థితులు తక్కువే. తెలుగులో నటించాలని ఉంది. ఎందుకంటే అది నా మాతృభాష కదా!

ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. నా దినచర్యలో వ్యాయామం కచ్చితంగా ఉంటుంది. ఆటలన్నా ఆసక్తే. స్విమ్మింగ్‌ చేస్తా. చెస్‌, క్యారమ్స్‌ బాగా ఆడతా. ఫొటోగ్రఫీ, ట్రెక్కింగ్‌ అంటే సరదా.

నాకు చదవడం, రాయడమన్నా ఇష్టమే. ఫేడ్‌ టు వైట్‌ అనే పుస్తకాన్ని రాశా. ఇది 2016లో అచ్చయ్యింది.

ఎన్ని వందల ఆడిషన్లకు వెళ్లానో లెక్కేలేదు. ఎన్నో సార్లు ఈ రంగంలోకి వచ్చి తప్పు చేశానా అనిపించేది... కానీ మనసు మాత్రం ఎన్ని కష్టాలు పడైనా సరే! అనుకున్నది చెయ్‌... విజయం నీదే అని చెప్పేది. అందుకే నా మనసు మాటే విన్నా.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి