అయిదొందల మందికి...బతుకు భరోసా!
close
Published : 22/05/2021 01:11 IST

అయిదొందల మందికి...బతుకు భరోసా!

కరోనా కల్లోలం... ఎన్నో కుటుంబాల ఉపాధిని లాగేసుకుంది. అప్పులు... పస్తులతోనే చాలా పేద, మధ్యతరగతి కుటుంబాల సావాసం. ఇవన్నీ ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని ఆలోచింపజేశాయి. దానికి పరిష్కారమే... ప్రాజెక్టు ప్రిషా! వందల మంది జీవితాల్లో వెలుగులు పూయిస్తోన్న ఆమె యశస్విని జొన్నలగడ్డ. దీని వెనక కథను ఆమె వసుంధరతో పంచుకున్నారు...
ఆ పూట ఆకలి తీర్చడం కన్నా... మూడు పూటలా ముద్ద సంపాదించుకునే మార్గాన్ని చూపించడమే నా లక్ష్యం. అందుకు నేనెంచుకున్న మార్గం ఇది. మాది హైదరాబాద్‌. నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. ఇదీ మా చిన్ని కుటుంబం. ఇంజినీరింగ్‌ అయ్యాక ఐదేళ్లు ఇన్ఫోసిస్‌లో పనిచేశా. తర్వాత ఎంబీఏ చదివి, టెక్‌ మహీంద్రాలో ఉద్యోగం చేశా. ఆపై మావారి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ప్రాజెక్ట్‌ హెడ్‌గా చేరా. 2018లో ఇద్దరం కలసి ఓ స్టార్టప్‌ ప్రారంభించాం.
ప్రస్తుత ‘మహిళలకు ఉపాధి’ ఆలోచన వెనుక ఓ కథ ఉంది. గతేడాది లాక్‌డౌన్‌లో ఓ వార్త చదివా. ఒకతను పది కిలోమీటర్లు నడిచొచ్చి అన్నపూర్ణ క్యాంటీన్‌లో భోజనం చేశాడని. అది చదవగానే చాలా బాధేసింది. అది మొదలు... వంట మనిషి సాయంతో రోజూ 40, 50 ఆహార పొట్లాలు తయారు చేసి పంచేదాన్ని. కొన్ని ఎన్జీఓలకు విరాళాలూ అందించా. ఈ విపత్తులో ఇంకేదో చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దోసపాటి రాము నిర్వహిస్తోన్న రైస్‌ ఏటీఎం, ఇతర సేవల గురించి తెలిసింది. నాగోల్‌లో తనని కలిశా. అప్పటికి అక్కడ చాలా మంది మహిళలు నిత్యావసరాల కోసం వేచి చూస్తున్నారు. ఆ వరుసలో బాలింతలు, గర్భిణులూ ఉన్నారు. అందులో కొందరు చదువుకున్న వారినీ గమనించా. ఒక్కో కుటుంబానిదీ ఒక్కో విషాద గాథ. తర్వాత అక్కడ వారాంతాల్లో సరకులు పంపిణీ చేసేదాన్ని. ఎన్నాళ్లిలా?...

గుర్తించడానికి కష్టపడ్డా...
కొందరు మహిళలను ఎంపికచేసి వారి నైపుణ్యాలకు తగిన ఉపాధి చూపిద్దాం అనుకున్నా. కానీ అర్హులను ఎలా గుర్తించాలో మొదట తేల్చుకోలేకపోయేదాన్ని. వంట వచ్చని కొందరు, కుట్టుపని వచ్చని ఇంకొందరు చెప్పేవాళ్లు. చివరికి సర్వే చేసి 300 మందిని ఎంపిక చేశాం. ఈ ప్రాజెక్టు పేరే ‘ప్రిషా’. అది మా చిన్న పాప పేరు. దేవుడి కానుక అని దానర్థం. సుమారు 200 మందికి కుట్టు మిషన్లు ఇచ్చాం. కొందరికి టిఫిన్‌ సెంటర్లు, చాయ్‌ కొట్లు, కొబ్బరి బొండాల దుకాణాలు, గిర్నీలు, 50 మంది ఒంటరి మహిళలతో క్యాటరింగ్‌ సర్వీసులు ఏర్పాటు చేయించాం. అలా ఈ ఏప్రిల్‌ నాటికి 500 మందికి ఆసరాగా నిలబడగలిగాం. పెట్టుబడి, సరకులు ఇవ్వడంతో మా పని అయిపోదు. అలాగని వారి కష్ట, నష్టాలనూ పంచుకుంటున్నాం.

సంతృప్తినిచ్చాయి...
ఓ రోజు సికింద్రాబాద్‌ నుంచి సునీత అనే మహిళ మూడు నెలల పాపతో వచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. లాక్‌డౌన్‌లో భర్త ఉద్యోగం పోయింది. తనకు నెలకు సరిపడా సరకులు ఇచ్చాం. కానీ అవి కాదు, ఏదైనా ఉపాధి చూపించాలని ఆడిగింది. వంట బాగా వచ్చని చెప్పింది. మేమిచ్చిన సరకులతోనే భోజనాలు వండి అమ్మింది. దాన్నే చిన్న వ్యాపారంగా మలచుకుంది. నిస్సహాయ స్థితిలో కూడా బతుకుపోరు ఎలా సాగించాలో తను చూపించింది. అది నచ్చి ఆమెతో ‘అమ్మచేతి వంట’ పేరుతో క్యాటరింగ్‌ పెట్టించాం. ఇప్పుడు మా ఉచిత ఆహారం ప్యాక్‌లు తనే సప్లై చేస్తోంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
పెంపకం ప్రభావం
పెరిగిన వాతావరణం నా మీద చాలా ప్రభావం చూపింది. మా నాన్న, తాతగారు సాయం కోరిన వారికి లేదనే వారు కాదు. చెన్నైలో ఎంబీఏ చేసినప్పుడు మహాబలిపురం సమీపంలో 20 గ్రామాలను ఎంపిక చేసి అక్కడి ప్రజలకు సాయపడమని సూచించారు. ప్రతీ వారం ఆ ఊళ్లకు వెళ్లే వాళ్లం. నాకేమో భాష సమస్య. మహిళలు, పిల్లలతో మాట్లాడుతూ 15 రోజుల్లోనే తమిళం నేర్చుకున్నా. అక్కడ వితంతువులను ఇళ్లల్లోకి రానిచ్చే వాళ్లు కాదు. పని చేయకుంటే పస్తులుంచే వాళ్లు. మా కాలేజీ నిధులతో కొందరికి ఆవులు, గేదెలను కొనిచ్చాం. ఇంకొందరికి పట్టు పరిశ్రమలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాం. మహిళలకు ఉపాధి ఉంటే ఆ కుటుంబాలు, అక్కడి సమాజం ఎంత బాగుంటుందో అప్పుడే నాకు అర్థమైంది. అలా మొదలైన నా సేవ ఇక్కడి దాకా వచ్చింది. ఈ ప్రయాణంలో నా భర్త ఎంతగానో సహకరిస్తుంటారు. నువ్వు చేస్తున్నది సమాజం కోసం, ఎంత బాగా చెయ్యగలవో అంతగానూ చెయ్యి అంటారు. వీటిలో పడి మా కంపెనీ వ్యవహారాలు చూడటమే మానేశాను. వీటన్నింటికీ సొంత డబ్బులే వాడుతున్నా. అయినా ఫర్వాలేదు. నా పనులతో వందల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి! అది చాలదూ!

- సతీష్‌ దండవేణి, ఈటీవీ, హైదరాబాద్‌


మనం ఎదుర్కొన్న కష్టాలే...జీవితానికి గట్టి పునాది అవుతాయి.
- జేకే రౌలింగ్‌, రచయిత్రి

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి