అడవి సంరక్షణలో 65 గ్రామాల అతివలు!
close
Published : 22/05/2021 01:41 IST

అడవి సంరక్షణలో 65 గ్రామాల అతివలు!

రోజూ ఉదయం ఒడిశాలోని ‘కొడరపల్లి’ గిరిజన గ్రామ మహిళలు వంతుల వారీగా కర్రలు పట్టుకుని అడవిలోకి వెళతారు. ఆ తర్వాతే మిగిలిన పనులు. ఇది వేటకో, ఆత్మరక్షణకో కాదు... అడవి, దాని వనరులను కాపాడటానికి ఇలా అయిదు దశాబ్దాల నుంచి జరుగుతోందంటే ఆశ్చర్యమే కదూ..
ఈ రాష్ట్రంలోని వివిధ గ్రామాల మహిళలు అడవిని కాపాడేందుకు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తారు. ఈ  కార్యక్రమం పేరు ‘తెంగెపల్లి’. తెంగె అంటే కర్ర, పల్లి అంటే మలుపు. రోజులో మూడు షిఫ్టుల్లో నలుగురైదుగురు చొప్పున వారి పరిధిలోని అడవిలో పహారా కాస్తారు. యాభై ఏళ్లుగా కొనసాగుతోన్న ఈ కార్యక్రమం ఆచారంగా మారిపోయింది. ఇలా 500 వందల ఎకరాల అటవీ భూమిని దాని చుట్టుపక్కల ఉండే 135 గ్రామాల వారు సంరక్షిస్తున్నారు. వీటిలో 65 గ్రామాల్లోనైతే కేవలం మహిళలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సంరక్షకులుగా...స్మగ్లర్లు, కలప దొంగలు, అనుమతి లేకుండా ప్రకృతి వనరులను దోచుకునే వ్యక్తుల నుంచి అడవిని కాపాడతాం. ఈ అడవి తల్లి మాకు కలప, దుంపలు, వేళ్లు, పొగాకు, కొన్ని రకాల పూలు, ఔషధాలు... ఇలా మా మనుగడకు కావాల్సినవన్నీ అందిస్తోంది. వాటిని కాపాడుకోకపోతే రేపటికి ఏమీ మిగలదు’ అని చెబుతారు గ్రామీణ కమిటీ రక్షణాధికారి ప్రొమిలా ప్రధాన్‌. 1970 నుంచి అడవిని సంరక్షించుకోవాలనే తపన గ్రామీణుల్లో అంకురించింది. నయాగఢ్‌ జిల్లాలో మొదలైన ఈ మార్పు క్రమంగా రాష్ట్రంలోని మిగతా ఊళ్లకూ చేరింది. మొదట్లో ఈ అటవీ సంరక్షణ బాధ్యతలను పురుషులే చూస్తుండేవారట. ఓసారి కలపను ఎత్తుకెళుతున్న దొంగలను ఆ ఊరి మహిళలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అప్పటి నుంచి మహిళా భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. అంతేకాదు కలప దొంగతనాలూ తగ్గుముఖం పట్టాయి’ అని గుర్తు చేసుకుంటారు ప్రొమిల.

బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌ అని ముద్ర వేయడంతో గ్రామస్థులు సహజ వనరుల యాజమాన్యాన్ని కోల్పోయారు. ఈ విధానంతో గ్రామీణులు తమ జీవనోపాధికి ఏకైక మార్గమైన చెట్లు, చేపలపైనా అధికారం కోల్పోయారు. అది వారి తిరుగుబాటుకు కారణమైంది. తర్వాత దెహనకల్‌ మహారాజు శంకర్‌ ప్రతాప్‌ సింగ్‌ దేవ్‌ మహేంద్ర అడవిపై స్థానికులకు హక్కులు కల్పించారు. దీని వల్ల మరో సమస్య వచ్చి పడింది. అడవులను కొల్లగొట్టే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా గ్రామీణులు అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం పది కిలోమీటర్ల లోపలి వరకూ వెళ్లాల్సి వచ్చేది. కొన్ని ఊళ్లలో అంత్యక్రియల కోసం కూడా కట్టెలు దొరికేవి కాదు. వీటన్నింటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అప్పుడే గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. పరిష్కారంగా కొంత మంది రాత్రిపూట అడవిలో పహారా కాసేవారు. కలప మాఫియా, స్మగ్లర్ల కదలికను కనిపెట్టి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. కేవలం పహారానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అటవీ రక్షణలో మహిళల పాత్ర పెరిగాక మరిన్ని మార్పులు వచ్చాయి. సామాజిక బంధాలు బలంగా ఉండటానికి ఒక గ్రామంలోని వారు మరొక గ్రామం వారిని పెళ్లి చేసుకునే వారు. అలాగే ఇచ్చిపుచ్చుకోవడం అలవాటైంది. వీటివల్ల గ్రామస్థుల్లో విభేదాలు తగ్గాయి. క్రమంగా గిరిజనులు చుట్టుపక్కల గ్రామాలతో ఆర్థిక, సామాజిక బంధాలను ఏర్పరుచుకోవడం మొదలుపెట్టారు.
ఊరివాళ్లంతా కలిసి అటవీ సంరక్షణ కోసం కొన్ని నియమాలను రూపొందించుకున్నారు. ఏ కాలంలో ఏ చెట్ల అవసరం ఎక్కువగా ఉంటుందో చర్చించుకునే వారు. ముఖ్యంగా ఎండాకాలంలో కొన్ని నియమాలను అందరూ కచ్చితంగా పాటిస్తారు. అడవిలోకి అగ్గిపెట్టె, బీడీలు, సిగరెట్లను తీసుకువెళ్లడం నిషేధం. అలాగే ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా ఓ నీళ్ల బకెట్‌ ఉంటుంది. నియమాలను ఉల్లంఘించిన వారికి 50 నుంచి 100 రూపాయల దాకా జరిమానా. అటవీ ఉత్పత్తుల సేకరణకు కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మందికి ప్రవేశం ఉండదు. ఇది వనరులను జాగ్రత్తగా, పరిమితంగా వాడుకునేందుకు దోహదపడుతుంది. పుట్టగొడుగుల జాతులు, పండ్లు, ఆకుకూరలు.. లాంటి దాదాపు 117 రకాల ఉత్పత్తులు అడవి నుంచి సేకరిస్తున్నారు. వీటన్నింటిలోనూ మహిళలదే ప్రధాన పాత్ర.

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి