లాహే లాహే... ఉర్రూతలూపేస్తున్నారు
close
Updated : 30/05/2021 01:26 IST

లాహే లాహే... ఉర్రూతలూపేస్తున్నారు

ఆదిదంపతుల అనురాగం అద్భుతమైన పాటగా   యూట్యూబ్‌ను ఊపేస్తోంది... చిరంజీవి తాజా చిత్రంలోని ఈ పాట నెల రోజుల్లోనే 4.6 కోట్ల మందికి పైగా సంగీత ప్రియులను అలరించింది... ఆ పాట పాడిన యువ కెరటాలు సాహితి చాగంటి, హారికా నారాయణ్‌లు వసుంధరతో ముచ్చటించారు...

బహుమతుల కోసం సంగీతం నేర్చుకున్నా
- సాహితీ చాగంటి

నాకు మూడేళ్ల వయస్సు నుంచే సంగీతం మీద ఆసక్తి ఉండేది. దాన్ని గమనించి మా అమ్మానాన్నలు గమనించి కాకినాడలోని పెద్దాడి సూర్యకుమారి దగ్గర కర్ణాటక సంగీతంలో చేర్పించారు. ఎవరైనా పోటీల్లో బహుమతులు గెలుచుకుంటే చాలా బాగా అనిపించేది. అందుకని బహుమతుల కోసం సరదాగా సంగీతం నేర్చుకోడం ప్రారంభించాను. నాకు ఐదేళ్లున్నప్పుడు హైదరాబాద్‌ వచ్చేశాం. ఎక్కడ పోటీలు జరిగినా ‘నీవు లేక వీణ’ పాట పాడేదాన్ని. మూడో తరగతిలో ఉండగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ‘పాడాలని ఉంది’ కార్యక్రమంలో తొలిసారిగా పాడాను. సెమీ ఫైనల్‌ వరకు వెళ్లాను. నాలుగో తరగతిలో సరిగమప లిటిల్‌ ఛాంపియన్‌లో రన్నరప్‌గా నిలిచాను. ఆ తర్వాత పదేళ్లు ఎంసీ మూర్తి దగ్గర కర్ణాటక సంగీతం, రామాచారి దగ్గర 20 ఏళ్లు లలిత సంగీతం నేర్చుకున్నాను.

ప్రతి దర్శకుడూ ఓ పాఠశాల
కీరవాణి సంగీత దర్శకత్వంలో మొదటి సారి బద్రీనాథ్‌ సినిమా కోసం విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకాన్ని పాడాను. తర్వాత సుశాంత్‌ నటించిన ‘ఆటాడుకుందాం రా’లో తొలిసారిగా పూర్తి స్థాయిలో పాట పాడాను. దానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకులు. కోరస్‌ పాడటానికి వెళ్లినప్పుడు నా గొంతు ఆయనకు బాగా నచ్చి టైటిల్‌ ట్రాక్‌ పాడించారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘కాటమరాయుడు’లో నేత చీర పాడే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రముఖ గాయకులు శ్రీకృష్ణ నన్ను మణిశర్మకి పరిచయం చేశారు. ఆయన సంగీత దర్శకత్వంలో 20, 25 సినిమాలకు పాడాను.  అనూప్‌, తమన్‌, మణిశర్మ, కీరవాణిల దర్శకత్వంలో పాడతానని అనుకోలేదు. ఇది నాకు దక్కిన గొప్ప అదృష్టం. వారు ఒక్కొక్కరు ఒక్కో ఇనిస్టిట్యూట్‌. వాళ్ల దగ్గర ప్రతి పాటకూ ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పటి దాకా 80, 90 పాటలు పాడాను.

ఆచార్య కోసమని తెలియదు
నేను, హారికా నారాయణ్‌ కలిసి ‘లాహె లాహె’ పాడిన రోజు నా పుట్టినరోజు. అనుకోకుండా రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లాను. మణిశర్మ పాట లిరిక్స్‌ ఇచ్చారు. చూడగానే ఎంత బాగున్నాయో అనిపించింది. రామజోగయ్య శాస్త్రిగారి పాటలు ఇంతకు ముందు పాడాను. కానీ లాహె లాహె ప్రత్యేకంగా అనిపించింది. పల్లవి పాడే వరకూ ఆచార్య కోసం అని మాకు తెలియదు. తర్వాత తెలిసి ఎగిరి గంతేశా. చిరంజీవి - మణిశర్మ కలయికలో వచ్చిన పాటలన్నీ విజయవంతమైనవే. శివపార్వతుల బంధాన్ని రొమాంటిక్‌ యాంగిల్‌లో చెప్పడం మొదటిసారి అనిపించింది. నూటికి నూరుశాతం నా బెస్ట్‌ ఇవ్వాలని ప్రయత్నించా. హారికా నేను ఒకే టేక్‌లో పాడేశాం. పాటలో పదాలు కొన్ని అర్థం కాలేదు. మణిసర్‌ వాటి అర్థాలు చెప్పాక పాడుతోంటే తన్మయత్వం కలిగింది. హారికది యునీక్‌ వాయిస్‌. చాలా శ్రద్ధతో ఇష్టంతో పాడింది. చిరంజీవి గారికీ వాళ్ల కుటుంబ సభ్యులకూ పాట బాగా నచ్చింది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది అన్నారట.

బుగ్గలకు క్రీమ్‌ రాసుకొచ్చారు
చిన్నప్పటి నుంచి ఎస్పీ బాలు గారితో అనుబంధం ఉంది. ఆయన ముందు పాడుతున్నామంటే లోపల విపరీతమైన భయం ఉండేది. ప్రదర్శనల్లో ఆయన పక్కన నిల్చొని పాడుతున్న ప్రతిక్షణం ఈ జన్మకు ఇది చాలదా అనిపించేది. నాకు ఏడేళ్ల వయస్సులో ఒక పోటీలో పాడితే ఆయన మెచ్చుకొని దగ్గరకు తీసుకున్నారు. ముద్దు పెడతావేమోనని బుగ్గలకు క్రీమ్‌ రాసుకొచ్చానని చెప్పారు. (నవ్వుతూ). ఎస్పీబీ గారికి ఏదైనా పాట పంపి వినండని కోరితే... ఎంత పనిలో ఉన్నా వెంటనే విని లోటుపాట్లు చెప్పేవాళ్లు. ఆయన లేకపోవడం చాలా లోటు.

అమ్మ, పెద్దమ్మలే గురువులు
- హారికా నారాయణ్

నేను ఎనిమిదేళ్ల వయసు నుంచి మా అమ్మ నాగలక్ష్మి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. హైదరాబాద్‌ వచ్చాక మా పెద్దమ్మ బీబీఎన్‌ఎల్‌ పద్మావతి దగ్గర మూడేళ్లు నేర్చుకున్నాను. ఆ తర్వాత డీబీ మోహన్‌కృష్ణగారి దగ్గర పదేళ్ల నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మా కుటుంబం నార్త్‌ ఇండియాలో ఉండేది. నాన్న లక్ష్మీనారాయణ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే వారు. ఉత్తరాదిలో ఉన్నప్పుడు తెలుగు నాకు అదనపు సబెక్ట్‌. ఒంట్లో రోజూ ఓ గంట అమ్మ తెలుగు రాయడం, చదవడం నేర్పించింది. హైదరాబాద్‌కు వచ్చేసరికి తెలుగు పూర్తి స్థాయిలో వచ్చేసింది.

పాడలేకపోయా
2015లో ఈటీవీ పాడుతా తీయగా ఆడిషన్స్‌కు వెళ్లాను. ఎంపికయ్యా కానీ పాడలేకపోయా. అప్పటికే వేరే బ్యాచ్‌లు పోటీలో ఉన్నాయి. అదే సమయంలో స్వరాభిషేకం ప్రారంభించారు. అందులోకి పిలిచారు. అప్పుడే నాకు సినిమా పాటలు పరిచయమయ్యాయి. బాలుగారితో కలిసి స్వరాభిషేకం, పాడుతా తీయగా బృందంతో 2015లో రెండున్నర నెలలు అమెరికాలో కార్యక్రమాలు చేశాము. తిరిగి వచ్చాక చిన్నచిన్న రికార్డింగ్స్‌ ప్రారంభమయ్యాయి. 2019లో సూర్యకాంతం చిత్రం నాకు తొలి అవకాశం ఇచ్చింది. తర్వాత తమన్‌ సంగీత దర్శకత్వంలో మిస్‌ ఇండియా సినిమాలో పాడాను. కీరవాణి గారు బాపురమణలపై చేసిన ప్రత్యేక ఆల్బమ్‌లో ఒక పాశురం పాడాను. ఆ తర్వాత మణిశర్మ గారి నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటి వరకు 10 పాటలు పాడాను. మార్క్‌ కె. రాబిన్‌, తమన్‌, కీరవాణి, మణిశర్మ సంగీత దర్శకత్వంలో ఆ పాటలు పాడాను.

లాహె లాహె మైలురాయి
లాహె లాహె నా జీవితంలో ఒక మైలురాయి లాంటిది. మణిశర్మ-చిరంజీవి కలయికలో వచ్చే సినిమాలో పాడాలన్నది నా కల. అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. దీనికి ముందే మణిశర్మగారు బ్లాక్‌రోజ్‌ సినిమాలో అవకాశం ఇచ్చారు. లాహె లాహె లిరిక్స్‌ చూడగానే భయమేసింది. దేవుడి పాటలు చాలా జాగ్రత్తగా రాయాలి. లేదంటే వివాదాలు తప్పవు. అలాంటిది రామజోగయ్య గారు చాలా అందంగా చెప్పారు. మణిగారి ప్రోత్సాహంతో ఇద్దరం పాట పూర్తి చేశాం. కానీ ఆ తర్వాత ఆ పాట గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. సినిమాలో మా పాట ఉంటుందో లేదో తెలియదు. విడుదలకు వారం ముందు తెలిసింది... మా పాటే ఉంచారని. మా పాటను మళ్లీ పాడి వినిపిస్తున్నారు. డ్యాన్స్‌ కవర్‌ చేస్తున్నారు. నన్ను ట్యాగ్‌ చేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. ఇవన్నీ నాలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

నా గాత్రమే నా జీవితం
నా గొంతు కొత్తగా ఉందంటుంటారు. కానీ తొలినాళ్లలో నా వాయిస్‌ వింటే ఏదో వెలితి అనిపించేది. నిరుత్సాహపడకుండా ఆ వాయిస్‌తోనే కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకున్నా. మెల్లిమెల్లిగా నాకంటూ ఓ శైలిని ఏర్పర్చుకున్నా. నా స్టైల్‌, నా జోనర్‌లను పరిశీలించుకుంటూనే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నా. ఒక్కో పాట ఒక్కో శైలిలో ఉంటుంది. అన్నింటికి నా శైలిలో అలరించడానికి ప్రయత్నిస్తుంటాను. ప్రతి సారీ ఇంకా కొత్తగా ప్రయత్నించాలని సాధన చేస్తూంటాను.

వాటికి దూరం
చిన్నప్పుడు సినిమా పాటలు తెలియదు. స్టేజ్‌ ప్రోగ్రామ్‌లు, రియాల్టీ షోలకు దూరంగా ఉండే దాన్ని. ఇంజినీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌లో సినీ అవకాశాలు వచ్చాయి. కర్ణాటక సంగీతంలో సర్టిఫికేషన్‌ చేశాను. పొట్టిశ్రీరాములు విశ్వ విద్యాలయం, త్యాగరాయ మ్యూజిక్‌ కళాశాల నుంచి డిప్లమో చేశాను. ఇప్పుడు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ చదువుతున్నాను.

ఆటోమొబైల్‌ రంగంలో స్థిరపడాలనుకున్నా
సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతానని ఊహించలేదు. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చేసి స్థిరపడాలని ఉండేది. మా కుటుంబంలో సినీ పరిశ్రమతో ఎవరికీ సంబంధం లేదు. నా పాట విన్న అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు.

ఏకైక జ్ఞాపకం ఆయనే
నా కెరీర్‌ బాలుగారితోనే మొదలైంది. భగవంతుడు కలిపిన బంధం అది. ఆయన మా కుటుంబ సభ్యులైపోయారు. ఆయన లేరంటే వారం రోజులు ఏడ్చాను. ఆయన ఎప్పటికి నాతోనే ఉంటారు. ఆయన చెన్నైలోనే ఉన్నారు.

శ్రమిస్తేనే నిలుస్తాం
నేనొక ఇండిపెండెంట్‌ ఆర్టిస్‌గా ఉండాలని ఆశిస్తున్నాను. నా ఫస్ట్‌ ఆల్బమ్‌ నైన్‌ ఇంప్రెషన్‌. అది నా జీవితాన్ని మార్చేసింది. అది  ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతుంటుంది. ఏ ఆల్బమ్‌ చేసినా అది నాలో స్ఫూర్తి నింపేలా ఉండాలి. అలాంటివే చేస్తున్నా. కరోనా వల్ల కొన్ని వాయిదా పడ్డాయి. చిత్ర పరిశ్రమలో అవకాశాలకు కొదవలేదు. అవకాశాలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం నిరంతర సాధన చేయాలి. అదృష్టం కొంతవరకే. శ్రమిస్తేనే మన పాట గెలుస్తుంది. మనం నిలుస్తాం.

ఇదంతా మాయమైపోవాలి
చాలా మంది సినీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. సినిమాలు ఆగిపోవడం అంటే మాటలు కాదు. కొన్ని వందల మంది శ్రమ అది. చాలా బాధగా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఇదంతా మాయమైపోవాలి. సాధారణ పరిస్థితులు నెలకొనాలి. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి.

 సతీష్‌ దండవేణి, ఈటీవీ, హైదరాబాద్‌

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి