వీరిది.. చాట్‌ భరోసా
close
Updated : 31/05/2021 05:36 IST

వీరిది.. చాట్‌ భరోసా

కొవిడ్‌ బాధితులు ఎవరిని, ఎలా సంప్రదించాలో తెలియని స్థితి. దీనికి తోడు ఆన్‌లైన్‌లో సరైన సమాచారం లేకపోవడం. ఒకోసారి సరైన వివరాలు తెలుసుకునే లోపే పరిస్థితి చేజారిపోతోంది. ఇంకొందరు ఇలాంటి సంఘటనలను తామూ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలకు ఇద్దరమ్మాయిలు చాట్‌బోట్‌లతో పరిష్కారాలను కనుక్కున్నారు. అవేంటో చూడండి...

65 పట్టణాల్లో సేవ

అలీషా లోబో సింగపూర్‌కు చెందిన ఓ సంస్థలో రిక్రూటర్‌. గతేడాది మన దేశానికి తిరిగొచ్చింది. ఇంటి నుంచే పనిచేస్తోంది. తన కజిన్‌కు కొవిడ్‌ సోకి ఆసుపత్రిలో ఖాళీల గురించి తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది. స్వయంగానూ వెతికింది. అవాస్తవాలే ఎక్కువగా కనిపించాయి. ఎవరో సాయం చేస్తే తన కజిన్‌ ఆసుపత్రిలో చేరి, కోలుకోగలిగింది. కానీ పెద్దగా సౌకర్యాలు లేని వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించింది. దీనికి తనకు తోచిన పరిష్కారం చూపాలనుకుంది.
ఎక్కువమందిని చేరడానికి టెక్నాలజీని ఉపయోగించడమే మంచిదనుకుంది. తనకేమో పెద్దగా అవగాహన లేదు. ‘స్టార్టప్‌లను ప్రారంభించిన వారితో నాకు పరిచయం ఉంది. నా ఆలోచనను వారి ముందు ఉంచాను. ఇద్దరు ముందుకొచ్చారు. ముందు టెలిగ్రామ్‌ యాప్‌లో చాట్‌బోట్‌ను రూపొందించాం. 24 గంటల్లోనే అది 50 మందికి సాయమందించింది’ అంటుంది అలీషా. వాట్సాప్‌ ద్వారా గ్రామీణులకూ తోడ్పడొచ్చనుకుంది. ‘కొవిడ్‌ఆశా’ పేరిట బోట్‌ను రూపొందించింది. కొన్ని మెడికల్‌ స్టార్టప్‌లతో, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకుంది.
దానిలో చాట్‌ చేస్తే ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌, సిలిండర్ల లభ్యత, అంబులెన్సులు, పడకలు.. మొదలైన సమాచారం లభిస్తుంది. ‘చాట్‌బోట్‌ ఎప్పటికప్పుడు సప్లయిర్లకు మెసేజ్‌ చేసి సమాచారాన్ని ధ్రువపరుచునేలా రూపొందించాం. వారి దగ్గర స్టాక్‌ లేకపోతే వేరే వారి వివరాలు ఇస్తాం’ అంటోందీ గోవా అమ్మాయి. వీఎంవేర్‌, గూగుల్‌, హెచ్‌పీ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రామీణులను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది భాషల్లో చాట్‌ చేయగలిగేలా చేసింది. ఇప్పుడు దీనిలో 65 పట్టణాలు, నగరాలకు చెందిన 5000 మంది సప్లయర్లు, ఆసుపత్రి వర్గాల వివరాలున్నాయి.
‘దీన్ని ఉపయోగించుకుని కోలుకున్న వారు తరువాత సంతోషంగా మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. ఫొటోలూ పంపుతూ ఉంటారు. వాటిని చూసినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో చెప్పలేను. మేం పరిస్థితులను మార్చలేం. కానీ అవసరమైన సాయాన్ని అందించి కొన్ని ప్రాణాలనైనా కాపాడగలం. అదే చేస్తున్నాం’ అంటోంది అలీషా.


బోట్‌తో మాటా ముచ్చటా

ఒత్తిడిలో ఉన్న వాళ్ల కోసం ‘మెంటల్‌ వెల్‌నెస్‌’ చాట్‌బోట్‌ను తయారు చేసింది హర్షిణి రాజి.
హర్షిణి గత ఏడాది కొన్ని ఇబ్బందులు పడింది. అవి తన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపడం గమనించింది. అప్పట్నుంచి మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. అదే సమయంలో లాక్‌డౌన్‌ విధించారు. తనలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయాలనుకుంది. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ చాట్‌బోట్‌.
‘మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏదైనా సమస్యను ఇతరులతో పంచుకోవడం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు. కానీ చాలామంది అందుకు ముందుకు రారు. అటువంటి వారి కోసమే ఈ బోట్‌ను తయారు చేశా’ అని వివరించింది 27 ఏళ్ల హర్షిణి. ఫేస్‌బుక్‌ వేదికగా దీన్ని ప్రారంభించింది. ‘ఎఫ్‌బీ అయితే పరిచయమున్న వేదిక. కాబట్టి అందరూ సులువుగా ప్రయత్నిస్తారనిపించింది. అందుకే దీన్ని ఎంచుకున్నా’నంటోందీ చెన్నై అమ్మాయి.
ఆలోచన బాగానే ఉన్నా.. హర్షిణి వైద్య నిపుణురాలు కాదు. అలాంటప్పుడు సరైన రీతిలో సాయం చేయగలనా? అనుకుంది. అందుకే సైకాలజీ కోర్సులు చేసింది. ఆ తర్వాతే బోట్‌ను రూపొందించింది. మానసిక సమస్యలు ఉన్నవారు దీంతో సంభాషించొచ్చు. వారికి సానుకూలమైన సలహాలనిస్తుంది. మెడిటేషన్‌, ఇతర చిట్కాలనూ అందిస్తుంది. ఎవరైనా ధ్యానాన్ని ఎంచుకుంటే దానికి సంబంధించి అయిదు నిమిషాల ఆడియో క్లిప్‌నూ షేర్‌ చేస్తుందీ బోట్‌.
హర్షిణి ఈ బోట్‌కి ఎప్పటికప్పుడు కొత్త కేటగిరీలు జోడిస్తోంది. మొక్కల పెంపకం, ప్రాథమిక వ్యాయామాలు, రోగనిరోధకశక్తిని పెంచుకునే చిట్కాలు.. మొదలైన వాటిల్లోనూ ఈ బోట్‌ సలహాలిస్తోంది. దీన్నింకా అభివృద్ధి చేయడానికి అనుభవజ్ఞులైన సైకాలజిస్ట్‌ల సాయాన్నీ తీసుకోవాలనుకుంటోంది. ఆరోగ్య రంగానికి సాంకేతికతను జోడిస్తే ఎన్ని ప్రయోజనాలుంటాయన్న దానికి ఈ అమ్మాయిల ప్రయోగాలే ఉదాహరణ.


Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి