కళలు ఆశల్ని వెలిగిస్తున్నాయి!
close
Published : 03/06/2021 01:17 IST

కళలు ఆశల్ని వెలిగిస్తున్నాయి!

కళ మనసు నింపుతుంది కానీ.. పొట్టనింపదనేది పాతతరం అభిప్రాయం. దాన్ని తోసిరాజని నచ్చిన కళలను కెరీర్‌గా మలుచుకోవడమే కాదు... వాటి సాయంతో వ్యాధులను నయం చేసేందుకు కృషి చేస్తూ... సాంకేతికత ఆసరాగా సరికొత్త దారుల్లో నడుస్తున్నారు కొందరు...

ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ థెరపీ సాయంతో రోగులకే కాదు... నిత్యం రోగుల మధ్య ఉంటూ ఒత్తిడితో సతమతమయ్యే వైద్యులకూ ఉపశమనం అందించాలనుకుంటున్నా.

అది అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ మెడికల్‌ కాలేజీ ఆవరణ. అక్కడ క్యాన్సర్‌ కోసం చికిత్స తీసుకుంటున్న ఓ రోగికి డాక్టర్‌ తార వాయిస్తున్న వాద్య పరికరం ఏంటో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. మరణ భయాన్ని తరిమేసి... శరీరాన్ని హాయిగా సేదతీరేలా చేస్తున్న ఆ వాద్య పరికరం పేరు సరస్వతీ వీణ అని, తను విన్నది కర్ణాటక సంగీతం అని తెలిసి ఆ రోగి డాక్టర్‌ తార రాజేంద్రకు ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు చెప్పింది. అన్నామలై యూనివర్సిటీ నుంచి పాలియేటివ్‌ ఆంకాలజీ ప్రధానంగా పీహెచ్‌డీ చేస్తున్న తార క్యాన్సర్‌ సమస్యల నుంచి ఉపశమనం అందించేందుకు సంగీతం మెరుగైన ఫలితాలు ఇస్తుందని నిరూపించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఐదేళ్ల వయసు నుంచే వీణ సాధన చేస్తున్న ఆమె అందులో మాస్టర్స్‌ చేశారు. మరోపక్క వైద్యవిద్య పూర్తి చేసుకుని... ఐసీఎమ్‌ఆర్‌ ఉపకారవేతనంతో పీహెచ్‌డీలో భాగంగా స్టాన్‌ఫోర్డ్‌లో పరిశోధనలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘నా సంగీతాభిమానాన్ని... పరిశోధనల్లో నా పట్టుదలని గమనించిన సీనియర్‌ డాక్టర్‌ ఒకరు... అమెరికాలో పాలియేటివ్‌ కేర్‌లో భాగంగా కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలని ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆశ్చర్యంగా అనిపించింది. నిజమే... మా అమ్మమ్మ క్యాన్సర్‌తో మరణించడానికి ముందు మా అమ్మా, నాన్న ఆమె చివరి రోజుల్లో కర్ణాటక సంగీతాన్ని ఆలపించేవారు. సంగీతం అందించిన ప్రశాంతతతో ఆమె మరణవేదనని కొంతైనా తగ్గించుకొందని అమ్మ తరచూ అంటూ ఉండేది. అందుకే... అమెరికా నుంచి ‘ఆంకాలజీ అండ్‌ స్ట్రింగ్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌ వేదికగా ఒక ప్రాజెక్టుని ప్రారంభించాను. ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ థెరపీ సాయంతో రోగులకే కాదు... నిత్యం రోగుల మధ్య ఉంటూ ఒత్తిడితో సతమతమయ్యే వైద్యులకూ ఉపశమనం అందించాలనుకుంటున్నా. పాలియేటివ్‌ కేర్‌ సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు ఈ రాగాలని ఉచితంగా పంపిస్తూ రోగులకు ఉపశమనం అందిస్తున్నా’ అంటోంది డాక్టర్‌ తార.


డాన్స్‌తో మానసిక సమస్యలకు చెక్‌

మానసిక సమస్యలు చాపకింద నీరులాంటివి.. వాటి నుంచి బయటపడేందుకు డ్యాన్స్‌ థెరపీ మంచి మందు అంటోంది 26 ఏళ్ల దివ్యబరాయి. ‘డ్యాన్స్‌థెరపీ విత్‌ దివ్య’పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నేర్పుతోంది...
సంతోషమైనా, బాధైనా డ్యాన్స్‌తో వ్యక్తీకరించడం దివ్యకు అలవాటు. ఇష్టమైన వ్యాపకం కూడా. ఆ కళతోనే ఇప్పుడు ఎంతోమంది బాధలకి, సమస్యలకి పరిష్కారం చూపిస్తోంది. ‘చిన్నప్పటి నుంచీ నాకు నాట్యం అంటే ఇష్టం. కానీ ఆ రంగంలో సరైన అవకాశాలు రాలేదు సరికదా... చుట్టూ ఉన్నవాళ్ల అభిప్రాయాలు నేనెలా ఉండాలో, ఉండకూడదో నన్ను నిర్ణయిస్తున్నట్టుగా ఉండేవి. దాంతో సైకాలజీ చదివి... ఓ పాఠశాలలో కౌన్సెలర్‌గా చేరా. పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేసేదాన్ని. కొన్ని రోజులకే మానసిక సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమైంది. వాటి నుంచి బయటపడాలంటే మన భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించాలి. ఎవరో ఏదో అనుకుంటారని మనసులో దాచుకుంటే అవి మరింత బలపడతాయి. అందుకే డ్యాన్స్‌ సాయంతో మానసిక స్థితిని మెరుగుపరుచుకునే డ్యాన్స్‌థెరపీపై దృష్టిపెట్టాను. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో... డ్యాన్స్‌థెరపీవిత్‌దివ్య పేరుతో పేజీని ప్రారంభించాను. అందులో నేనే డ్యాన్స్‌ చేసి ప్రతి ఆదివారమూ పోస్టు చేసేదాన్ని. ఇక్కడ మరొకరు చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో అన్న భావనకు చోటు లేదు. అదే ఈ వేదిక లక్ష్యం కూడా. నేను డ్యాన్స్‌ నేర్పుతాను. డ్యాన్స్‌ థెరపీ కూడా చేస్తాను. మనసులోని వ్యధని బయటకు నెట్టేసే నైపుణ్యాలు ఇందులో ఉంటాయి. మొదట్లో ఆరుగురు వచ్చారు. ఇప్పుడా సంఖ్య 150కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది డ్యాన్స్‌ నేర్పమంటున్నారు. మరెంతో మంది నా వీడియోలు చూసి సాధన చేస్తున్నామని చెబుతుంటారు. ఈ వేదికపైకి రాకముందు వరకూ ఈ సమస్య నా ఒక్కదానిదే  అనుకునే చాలామందిలో మార్పు వచ్చింది. కొవిడ్‌ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఎంతో మంది మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు ఈ వేదికని ఆశ్రయిస్తున్నారని’ అంటోంది దివ్యబరాయి.


మరొకరిని ఓడించాలనే లక్ష్యంతో నేనెప్పుడూ బరిలోకి దిగలేదు.... నాతో నేను పోటీపడేదాన్ని. నా రికార్డులని నేనే బ్రేక్‌ చేయాలనుకునేదాన్ని.

- పీటీ ఉష, పరుగుల రాణి

Tags :

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి