పదే పదే చెప్పి విసిగించకన్నారు!
close
Published : 04/06/2021 01:41 IST

పదే పదే చెప్పి విసిగించకన్నారు!

సమయానికి వానలు పడక, బోర్ల నుంచి చుక్క నీరు రాక... రైతన్నల ఆవేదనల్ని చిన్నప్పటి నుంచీ కళ్లారా చూసిందామె. అందుకే వారికి చేయూతనివ్వాలనుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణ విషయంలో పదహారు గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆ కష్టమే తనకి యూఎన్‌డీపీ ఉమెన్‌ వాటర్‌ ఛాంపియన్‌ పురస్కారాన్ని అందించింది. ఆమే చిత్తూరు జిల్లాకు చెందిన పారేశమ్మ. తన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారిలా...

మాది తంబళ్లపల్లెకి దగ్గర ఉన్న గోపిదిన్నె గ్రామం. ఇక్కడే ఐదో తరగతి వరకూ చదువుకున్నా. ఆపై పదోతరగతి వరకూ బురకాయల కోట రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకున్నా. తర్వాత ఐటీఐ చదివి ఓ డెయిరీలో ఉద్యోగం చేశా. ఈలోగా పెళ్లయ్యింది. కులాంతర వివాహం కావడం, ఎవరి సహకారమూ లేక... ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కూలి పనులూ చేశా. అదే సమయంలో ఫౌండేషన్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సెక్యూరిటీ (ఎఫ్‌ఈఎస్‌) సంస్థలో కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌ పోస్టు ఉందని తెలిసి ప్రయత్నించా. వారు ఇది ఉద్యోగం కాదు... బాధ్యత అని చెప్పారు. గుజరాత్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు చెప్పాల్సి ఉంటుంది. ఇది నాకు తెలిసిన రంగం. ఆసక్తి ఉన్న అంశం. అందుకే ఇష్టంగా ఒప్పుకున్నా. ఎందుకంటే... మా నాన్న రైతు. నా చిన్నప్పుడు సాగునీటి కోసం ఆయనొక్కడే బావి తవ్వడం ఎప్పుడూ నా కళ్లలో మెదిలేది. తర్వాతి కాలంలో గ్రామస్థుల్లో చాలామంది బోర్లు తవ్వితే... చుక్క నీరు పడని వైనమూ చూశా. అందుకే రైతులకు మేలు చేసే ఈ బాధ్యతల్ని ఇష్టంగా ఎంచుకున్నా. 

ఊరూరా తిరిగి...
2015 నుంచి ఎఫ్‌ఈఎస్‌ సంస్థలో కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌గా తంబళ్లపల్లె మండలంలోని పదహారు పంచాయతీల్లో పని చేస్తున్నా. మొదట్లో నలుగురిని పోగేయడానికి చాలా కష్టపడేదాన్ని. నిజానికి ఆ రైతులంతా వ్యవసాయంలో అనుభవమున్న వాళ్లే... కానీ ఆధునిక పద్ధతుల్ని, జల సంరక్షణ విధానాలను అనుసరించడంలో వెనకబడి ఉన్నారు. మొదట్లో ఏం చెప్పాలని ప్రయత్నించినా వినేవారు కాదు. అసలు నీకేం తెలుసు అని ఎదురు ప్రశ్నించేవారు. పదే పదే చెప్పి విసిగించకని కసురుకునే వారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఓ మంచి లక్ష్యంతో పని చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని సమర్థించుకునేదాన్ని. ఇంకాస్త సూటిగా, స్పష్టంగా వారిపై ప్రభావం చూపేలా చెప్పాలనే ఆలోచనతో ఆయా అంశాలపై పట్టు తెచ్చుకోవడం కోసం మా సంస్థ అధికారుల సాయంతో సాధన చేసేదాన్ని. ఆ ప్రాంతంలో భూసారం ఎంత? నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి? ఏఏ పంటల్ని అక్కడ పండించొచ్చు, జాగ్రత్త పడకపోతే నష్టాలేంటి... ఇలా ఒక్కో అంశాన్నీ వారికి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. అందరినీ ఒక తాటిపైకి తీసుకు రావడానికి చాలా కష్టపడ్డా. నీటి నిర్వహణపై సరదా ఆటలు ఆడించేదాన్ని. వివిధ ప్రయోగాలు చేయించేదాన్ని. మెల్లిగా తంబళ్లపల్లె మండలం ఆ చుట్టు పక్కల పదహారు గ్రామాల్లో పట్టు తెచ్చుకోగలిగా. క్రమంగా వారంతా ఉపాధి హామీ పనుల్లో భాగంగా నీటికుంటలు, చెరువులు, ట్రెంచ్‌లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకున్నారు. వరి, టొమాటో వంటి వాటికి బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే చిరుధాన్యాలు, వేరుసెనగ వంటి పంటలవైపు దృష్టి మళ్లించారు. ఫలితంగా నీటి కొరత తగ్గింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా పంట, దాంతో పాటు తగిన ఆదాయమూ అందుకుంటున్నారు. తాజాగా నీటి నిర్వహణలో మహిళల నాయకత్వం అనే ఆంశంపై యూఎన్‌డీపీ ఓ వర్క్‌షాప్‌ని నిర్వహించింది. వారు నా సేవల్ని గుర్తించి ఉమెన్‌ వాటర్‌ ఛాంపియన్‌ అవార్డునిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం అందుకున్న ఏకైక మహిళను కావడం సంతోషాన్నిచ్చింది. మావారు గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తారు. మాకో పాప, బాబు. వారిని బాగా చదివించాలి, నా వల్ల మరెన్నో గ్రామాలకు లబ్ధి చేకూరాలి... ఇవీ నా లక్ష్యాలు!

కూతురిగా, భార్యగా, నెచ్చెలిగా, ఉద్యోగిగా.. పరిపూర్ణంగా మన్ననలు అందుకోవాలంటే ఎక్కువే కష్టపడాలి. ఇన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కష్టమే. కానీ లక్ష్య సాధన కోసం నిబ్బరంగా ఉండాలి. ధైర్యంగా దూసుకుపోతేనే ఆనందాలను సొంతం చేసుకోవచ్చు.

- సిమెరాన్‌ భాసిన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, లీషియస్‌

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి