‘సంవేదన’ వేదికగా...
close
Published : 04/06/2021 01:56 IST

‘సంవేదన’ వేదికగా...

అమ్మతో కలిసి పారిశ్రామికవాడలకు వెళ్లేదా చిన్నారి. అక్కడి పేదలకు చేతనైన సాయం అందించే తల్లిని చూసి స్ఫూర్తి పొందేది. అప్పటికే జాతీయ, అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారిణి కావడంతో ఆ క్రీడను మురికివాడ పిల్లలకు నేర్పేది. అలా ఆ శిక్షణను ఆన్‌లైన్‌పైకి తీసుకొచ్చింది. వందల మందికి ఉచిత శిక్షణనిస్తోంది. ప్రముఖ చెెస్‌ క్రీడాకారుల  భాగస్వామ్యంతో... నిరుపేద పిల్లలకు ఈ క్రీడను చేరేలా చేస్తూ ... స్ఫూర్తిగా నిలుస్తున్న 17 ఏళ్ల భూషిత స్ఫూర్తి కథనమిది.

దిల్లీకి చెందిన భూషితకు తమ్ముడు భవిక్‌ అహూజా, తల్లి ఉన్నారు. చిన్నప్పుడే వీరిద్దరినీ చెస్‌ శిక్షణలో చేర్పించింది అమ్మ్ల. పదేళ్ల వయసు నుంచే రాష్ట్రస్థాయి టోర్నమెంట్స్‌లో విజేతలు ఇద్దరూ. సెలవు రోజుల్లో తల్లితోపాటు మురికివాడలకు వెళ్లి, అక్కడ పిల్లలతో చెెస్‌ ఆడేవారు. రాని వారికి వాళ్లే ఆట నేర్పే వారు.   

తిరిగివ్వాలనుకుని...
చెస్‌ తనకు జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఆలోచనా విధానం, వేగంగా నిర్ణయం తీసుకోవడం వంటి ఎన్నో విషయాలను నేర్పింది అంటుంది భూషిత. ‘ఇంత పరిజ్ఞానాన్ని అందించిన చెస్‌ క్రీడకు ఏదైనా తిరిగివ్వాలనిపించింది. మరింత ఎక్కువ మంది పిల్లలకు సేవలు అందించాలనుకున్నా. అలా 2019లో ప్రారంభించిందే ‘సంవేదన ఫౌండేషన్‌’. దీన్ని అందరిలోకీ తీసుకెళ్లడానికి ఒక టోర్నమెంటు నిర్వహించాం. దానిగురించి చిన్న యాడ్‌ ఇచ్చాం. ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు గౌతం గంభీర్‌, క్రీడాశాఖ మంత్రి కిరణ్‌లను అతిథులుగా ఆహ్వానించాం. ఈ పోటీలో 250 మంది పిల్లలు పాల్గొనడంతో చాలా ఉత్సాహం వచ్చింది. దీనిద్వారా రూ.లక్ష నగదు సహాయనిధిగానూ అందింది. ఈ నగదుతో చిన్నారులకు ఉచిత శిక్షణను ప్రారంభించా. దిల్లీలో సేవాభారతి సేవాసంస్థ చేయూతతో శిక్షణా కేంద్రాలను ప్రారంభించా’ అని వివరించింది భూషిత.

కొవిడ్‌ నేపథ్యంలో...
గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఈ కేంద్రాలను మూసేయాల్సివచ్చింది. ఈ సమయంలో ఆన్‌లైన్‌లో శిక్షణనివ్వాలనుకుంది. అక్కా తమ్ముళ్లు మొదలు పెట్టిన ఈ ఉచిత శిక్షణలో ఇప్పుడు ఓ పెద్ద బృందమే పని చేస్తోంది. ప్రస్తుతం 20 మంది శిక్షకులు, ఏడు రాష్ట్రాలకు చెందిన 350 మంది పిల్లలకు ఈ క్రీడను నేర్పుతున్నారు. ఆన్‌లైన్‌లోనే టోర్నమెంట్స్‌, వర్క్‌షాపులనూ నిర్వహిస్తోంది. ఓవైపు చదువు, మరోవైపు చెెస్‌ క్రీడను ఎలా సమన్వయం చేస్తున్నావని భూషితను అడిగితే ‘‘ఏ సమయంలో దేనికి ప్రాముఖ్యతనివ్వాలో గుర్తిస్తే చాలు, అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవచ్చు’’ అంటోంది. తన అభిమాన  క్రీడాకారుడు గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌ను రెండుమూడు సార్లు కలిసే అవకాశం వచ్చినా, ఆయనతో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటుంది భూషిత. 

రచయిత కూడా!
లాక్‌డౌన్‌ సమయంలో గతేడాది ఆరునెలలపాటు ఆన్‌లైన్‌లో పేదపిల్లలకు ఉచితంగా ఇచ్చిన చెెస్‌ శిక్షణ వరల్డ్‌ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు, టెడెక్స్‌ వేదికపై, పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో స్ఫూర్తి ప్రసంగాలను ఇచ్చింది భూషిత. కేరళలోని స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజిమెంట్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ఈమె సేవను గుర్తించి, గౌరవించింది. ఛెస్‌ క్రీడాకారిణిగానే కాదు, 16వ ఏటనే దుస్తులపై ‘ఓపెన్‌ యువర్‌ వార్డ్‌రోబ్‌ ఫర్‌ ఆన్సర్స్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాసింది. దానికి పలువురు ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంది. క్రీడాకారిణిగా, రచయితగా, ఛేంజ్‌ మేకర్‌గా చిన్నవయసులోనే పలుపాత్రలను పోషిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈమెను గతేడాది ‘ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’,‘ ‘ది రియల్‌ సూపర్‌ వుమెన్‌’ అవార్డులు వరించాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి