క్రీడా కారుణ్యం
close
Published : 06/06/2021 00:40 IST

క్రీడా కారుణ్యం

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఎంతోమందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడ చూసినా.. తినడానికి తిండిలేక, ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు దొరక్క ఇబ్బంది పడేవారే! అదిచూసి మన క్రీడాకారిణుల మనసూ కదిలింది. ఆటలో ప్రత్యర్థిపైనే కాదు.. కరోనాపై పోరాటానికీ సై అంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారే.. సానియా మిర్జా, మిథాలీరాజ్‌, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక. వారి సేవా ప్రయాణాన్ని మనమూ చూద్దామా!

ఊపిరిలూదాలని..!
సానియా మీర్జా

ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడి కోలుకుందీ టెన్నిస్‌ స్టార్‌. కరోనా కారణంగా చనిపోతున్న వారిని చూసి కదిలిపోయింది. కెట్టో.ఆర్గ్‌తో కలిసి ‘ఓటూ ఫర్‌ యూ’ పేరిట నిధులను సేకరిస్తోంది. వీటి ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తారు. ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దేశంపై బాగా ప్రభావం చూపింది. ఎంతోమంది ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి చనిపోతున్నారు. ఆసుపత్రుల బయట చికిత్స కోసం ఎదురు చూసే వారిని చూస్తే చాలా బాధేస్తోంది. బాధితుల బంధువులు ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఖరీదైన మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ నావంతుగా సాయం చేయడానికి కెట్టో.ఆర్గ్‌తో పనిచేస్తున్నా’నంది సానియా.
ఇప్పుడే కాదు.. గత ఏడాదీ లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకోవడానికీ నిధులు సేకరించింది. యూత్‌ ఫీడ్‌ ఇండియా, సఫా ఇండియాతో కలిసి వారంలోనే రెండున్నర కోట్ల రూపాయలను సేకరించింది. వీటి ద్వారా జీవనాధారం కోల్పోయిన లక్షమందికి ఆహారాన్ని అందించింది.

నిత్యావసర వస్తువులను అందిస్తోంది
మిథాలీ రాజ్‌

విమెన్స్‌ టెస్ట్‌, వన్‌ డే క్రికెట్‌ మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌.. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి అవసరమైన వారికి వంట సరకులను అందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉపాధి కోల్పోయినవారు, ఆటోడ్రైవర్లకు వాటితో పాటు కొంత నగదునూ అందిస్తోంది. ప్రస్తుతం మిథాలీ ఇంగ్లండ్‌ టూర్‌లో ఉంది. కానీ తన తరఫున ఆమె నాన్నతో సరకులు సరఫరా చేయిస్తోంది. వాళ్ల అమ్మ కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకుంటోంది. గత ఏడాదీ మిథాలీ పది లక్షల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు విరాళమిచ్చింది. క్యాబ్‌ డ్రైవర్లు, చిన్నచిన్న అమ్మకం దార్లకు నిత్యావసర వస్తువులను అందించింది. ‘నిజానికి నేను ఓ ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నాను. లాక్‌డౌన్‌ కారణంగా ముందుకు సాగలేకపోయాం. చుట్టూ ఎంతోమంది పడుతున్న ఇబ్బందుల్ని చూసి, మా వంతుగా ఇలా సాయమందిస్తున్నా’మంటోందీ హైదరాబాదీ క్రికెటర్‌. అర్హులైన పిల్లలకు స్పోర్ట్స్‌ కిట్‌లను అందించడం, క్రికెట్‌ మాత్రమే కాకుండా వారు కోరుకున్న ఇతర ఆటల్లోనూ శిక్షణనిప్పించాలన్నది ఆమె ధ్యేయమట.

ఆటతో సాయం
కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక

వీరిద్దరూ కొవిడ్‌ బాధితుల సహాయార్థం ఆన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లనూ ఆడుతున్నారు. విశ్వనాథన్‌ ఆనంద్‌తో కలిసి వీటిలో పాల్గొంటున్నారు. ‘చెక్‌మేట్‌ కొవిడ్‌’ పేరిట నిర్వహిస్తున్న వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని వైద్య, ఆర్థిక సాయం అవసరమైన బాధితులకు అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వీరితో ఆడొచ్చు. కాకపోతే ఆడటానికీ, ఆపై కొనసాగించడానికీ కొంత మొత్తాన్ని చెల్లించాలి. 15000 డాలర్ల లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టగా 50,000 డాలర్లు అంటే 37 లక్షల రూపాయలకు పైగా సేకరించగలిగారు. హంపి గత ఏడాదీ ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో ఆనంద్‌తో కలిసి పాల్గొంది. అప్పుడు నాలుగున్నర లక్షల రూపాయలను సేకరించారు.
హారిక ఆసుపత్రుల్లో పడకల కోసం ప్రయత్నించే వారికోసమూ పనిచేస్తోంది. కొవిడ్‌ బారినపడిన వారికోసం ‘ఫైండ్‌ ఎ బెడ్‌’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ‘కాజ్‌ అంబాసిడర్‌’గా వ్యవహరిస్తోంది. దీనిని కొంతమంది యువత ప్రారంభించారు. ఎవరికైనా బెడ్‌ అవసరమైతే ఆమె తన నెట్‌వర్క్‌తో సంప్రదించి దొరికేలా చేస్తుందట.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి