కామెడీ షోల కథకురాలు!
close
Published : 09/06/2021 00:39 IST

కామెడీ షోల కథకురాలు!

అనగనగా ఓ అమ్మాయి. ఆమెకు కథలు చెప్పడం.. కాదు.. కాదు.. రాయడమంటే ఇష్టం. వాటి ద్వారా నవ్వించడం ఆమెకు సరదా. దాన్నే కెరియర్‌గా ఎంచుకుంది. ఇప్పుడు.. హాలీవుడ్‌లో కామెడీ రైటర్‌గా కొనసాగుతోంది. ఎవరా అమ్మాయి? ఆమె కథేంటి?
విద్యా అయ్యర్‌.. పన్నెండేళ్లవరకూ నైజీరియాలోనే పెరిగింది. ఆ తర్వాత దేశానికి తిరిగొచ్చింది. కథలు చదవడం, టీవీ చూడటం, చుట్టూ ఉన్న వారితో మాట్లాడటం ఇక్కడికొచ్చాక ఇవే తన ప్రధాన వ్యాపకాలు. యానిమేటెడ్‌ షోల్లో తాను గమనించిన వాటన్నింటినీ ఎపిసోడిక్‌ కథలుగా రాసేది. వాటికి హాస్యాన్ని జోడించేది. వాటిని స్నేహితులతో పంచుకునేది. ‘తర్వాత ఏమైంది? అని వాళ్లు అడుగుతున్నప్పుడు నాకు సరదాగా ఉండేది. అప్పటినుంచి వాళ్లకోసం రాయడం మొదలుపెట్టా’ అంటుందీ చెన్నై అమ్మాయి. కామెడీ షోలకు రైటర్‌గా చేయాలనేది తన కల. రాసిన వాటిని పేపర్లు, పత్రికలకు పంపడం ప్రారంభించింది. అవి ప్రచురితమైనప్పుడు నమ్మకం పెరిగింది. ‘దీన్నే కెరియర్‌గా ఎంచుకుంటే?’ అనే ఆలోచనా వచ్చింది.
ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి రావడం అంత సులువు కాదని ఆమెకు తెలుసు. పైగా అందరూ నవ్వుతారేమో అన్న చిన్న భయమూ. అందుకే గ్రాడ్యుయేషన్‌కు సిద్ధమైంది. స్నేహితులతోపాటే కంప్యూటర్స్‌ ఇంజినీరింగ్‌లో చేరింది. దీంతోపాటు ఇటాలియన్‌ రెస్టారెంట్‌నూ ప్రారంభించింది. కానీ మనసంతా టెలివిజన్‌ షోలపైనే ఉండేది. ఓసారి ప్రయత్నించి, కుదరకపోతే వదిలేద్దామనుకుంది. పరిశ్రమలో వ్యక్తులతో మాట్లాడింది. దానిలో ఏదైనా కోర్సు చేశాక అప్పుడు షోలకు ప్రయత్నించమన్నారు. అందుకు యూఎస్‌ను ఎంచుకుంది. ఒక స్క్రిప్ట్‌ను రాసి అయిదు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు పంపింది. అలా లాస్‌ ఏంజెల్స్‌లోని అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఎంపికైంది. అక్కడ చదివిన అనుభవం హాలీవుడ్‌లోని పెద్ద స్టూడియోలు, ప్రొడక్షన్‌ సంస్థలకు పనిచేసే అవకాశాన్ని కల్పించింది.
ఇప్పుడు తను సోలార్‌ ఆపోజిట్స్‌, లిటిల్‌ వాయిస్‌, మీరా రాయల్‌ డిటెక్టివ్‌ వంటి యానిమేటెడ్‌ కామెడీ టీవీ షోలకు పనిచేస్తోంది. పైగా ఇవన్నీ భారతీయ నేపథ్యంలోనే సాగుతాయి. ఇక్కడి సంప్రదాయం, పండగలు, వస్త్రధారణ వంటి అంశాలపై అవగాహన కల్పించేలా ఉంటాయి. టీవీ షోలతోపాటు షార్ట్‌ ఫిల్మ్‌లకూ పనిచేస్తోంది. స్విమ్మర్‌ అవ్వాలనుకున్న అమ్మాయి కలపై తన మొదటి పీరియడ్‌ ఎలా ప్రభావం చూపిందో తెలియజేసే కథ ‘కన్య’. దీన్ని గత ఏడాది యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. మంచి జాతకం కాదని చెప్పే అమ్మాయి జీవితంపై తీసిన ‘రక్ష’ను ప్రపంచవ్యాప్తంగా 15 ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. దీనికి ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్ర అవార్డు దక్కింది. జీన్‌, గ్రామ్స్‌ వంటి మరికొన్నింటికీ రచయితగా చేయడమే కాకుండా కొన్ని టీవీ షోలను నిర్మించింది కూడా. తపన, కష్టపడేతత్వం ఉంటే దేన్నైనా సాధించడం సులువనే విద్య.. హాలీవుడ్‌లో తమకంటూ స్థానం సంపాదించాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తి కదూ!

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి