బాలీవుడ్‌ తారలు లొట్టలేస్తున్నారు...!
close
Published : 11/06/2021 02:08 IST

బాలీవుడ్‌ తారలు లొట్టలేస్తున్నారు...!

ఇంట్లోవాళ్ల కోసం సరదాగా ఆమె చేసిన కేకు అందరికీ తెగ నచ్చేసింది. మరిన్ని నేర్చుకుని రుచిగా చేయడంతో పాటు ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పంచుకోవడం మొదలుపెట్టింది. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు తన చేతి కేకు... బాలీవుడ్‌ తారలు కూడా లొట్టలేసుకునేలా చేస్తోంది. ఆమే... ముంబయికి చెందిన జుహ్వి పహ్వా.

కేకు తయారీని మొదట ఓ ప్రయోగంగానే చేశానని, అది ఇప్పుడు తనను ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చేసిందని నవ్వుతుంది 31 ఏళ్ల జుహ్వి. చదువయ్యాక సొంతంగా రెస్టారెంటు పెట్టుకోవాలని కలలు కనేది. డిగ్రీ చదివి, తండ్రి కంపెనీలో కొన్నాళ్లు పనిచేసింది. అయితే అక్కడ కెరియర్‌ను కొనసాగించలేకపోయింది. తర్వాత దుస్తుల డిజైనర్‌గా మారింది.

అలా ప్రారంభమైంది: జుహ్వి తాత వయసు తొంభై ఏళ్లు. మధుమేహం ఉందని స్వీట్లు తినద్దొన్నా ఆయనకు మాత్రం తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. ఆయన కోసమే చక్కెర, పిండి వాడకుండా కేకులు తయారుచేసింది. ‘సహజసిద్ధమైన చక్కెరలు, గోధుమ, జొన్నపిండిని ఉపయోగించి కేకులు చేయడానికి 2017లో ప్రయోగాలు మొదలుపెట్టా. మైదా వాడకుండా చేసిన స్పాంజి కేకుల రుచి తాతయ్యకే కాదు, ఇంట్లో అందరికీ నచ్చేసింది. నేను చేసే డార్క్‌ వేగన్‌ చాక్లెట్‌, జొన్నపిండితో డార్క్‌ చాక్లెట్‌, మ్యాంగో చాక్లెట్‌, కేక్‌ల్లో గుడ్డు ఉపయోగించను. మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. ఇవి బంధువులకూ నచ్చడంతో సరదాగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేదాన్ని. మంచి స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితోనే 2018లో మహిళాదినోత్సవం రోజున ‘ది బెటర్‌ బింజ్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో వెంచర్‌ ప్రారంభించాను.

బాలీవుడ్‌ ప్రముఖులెందరో... మొదట తెలిసిన వారివి, స్నేహితులవీ ఆర్డర్లు వచ్చేవి. ఆ తర్వాత కొన్ని ప్రైవేటుసంస్థలు వారి కార్యక్రమాలకు కేకులను తీసుకెళ్లేవారు. ఒకరోజు ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ యాస్మిన్‌ కరాచివాలా ఫోన్‌ చేశారు. తన కొడుకు పుట్టినరోజు కోసం కేకు ఆర్డరిచ్చారామె. అలా ఆమె కోసం ‘ది జవహర్‌ నట్టీ చాక్లెట్‌కేకు’ చేసి పంపా. ఆ రుచిని ప్రశంసిస్తూ ఆమె ట్విటర్‌లో నా గురించి ప్రస్తావించడం మరవలేని జ్ఞాపకం. ఈ మూడేళ్లలో ఆర్డర్లు పెరిగాయి. ప్రముఖ బాలీవుడ్‌ తారలు ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సీనియర్‌ నటి హేమామాలిని, ఆమె ముద్దుల తనయ ఈషా డియోల్‌, అందాల తారలు కైరా ఆడ్వాణీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కత్రినాకైఫ్‌ వంటి వారికి నా కేకులు నచ్చడం సంతోషమే కదా. నేను చేసే నట్టీ చాక్లెట్‌ మఫిన్స్‌, పీనట్‌ బటర్‌ కేక్స్‌ వంటి వాటికి చాలా మంది ప్రముఖులు అభిమానులైపోయారు. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్‌రావు నా కేకు తీసుకుని, మరుసటి రోజు ఫోన్‌ చేసి అభినందించడం ఆనందమేసింది. ప్రస్తుతం నా ఇన్‌స్టాగ్రాం పేజీకి 19వేలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. క్యారెట్‌, యాపిల్‌ సిన్నమన్‌, షు గర్‌ఫ్రీ బటర్‌ స్కాచ్‌ వంటి రకాలతో టీ కప్పు కేకు నుంచి సెలబ్రేషన్‌, మిలియనీర్స్‌ కేకు వరకు అన్ని సైజుల్లోనూ తయారుచేస్తున్నా. కొందరికి చాక్లొట్‌ లేకుండా కూడా ఆ రుచిని ఆస్వాదించేలా ఇస్తుంటా. వినియోగదారుడి అభిరుచిని, అవసరాన్ని, ఆరోగ్యాన్ని తెలుసుకుని వాటికి అనుగుణంగా చేస్తుండటం వల్లనే ఇందరి అభిమానాన్ని పొందగలుగుతున్నా’ అని చెబుతోందీమె.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి