బిర్లా బాగా గుర్తుపడతారు!
close
Updated : 12/06/2021 05:49 IST

బిర్లా బాగా గుర్తుపడతారు!

ఇంజినీర్‌ కావాలన్నది ఆమె కల. అనుకోని పరిస్థితుల్లో ఫార్మాని ఎంచుకున్నారు. నాన్న మాటలతో పట్టుదల వచ్చి చదువుల్లో బంగారుపతకం సాధించారు. చిన్న వయసులోనే బిర్లా ఇన్‌స్టిట్యూట్స్‌ పరిశోధనల విభాగం అధిపతిగా ఎదిగారు. రొమ్ము క్యాన్సర్‌కు ఔషధాన్ని తయారు చేసినా... తాజాగా లాలాజలం ఆధారంగా క్యాన్సర్లను గుర్తించే ప్రక్రియను ఆవిష్కరించినా... ఏదో సాధించాలన్న తపనే కారణమంటారు. ఆమే యోగీశ్వరి పెరుమాళ్‌. స్ఫూర్తిదాయకమైన ఆమె పరిశోధన ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారు...

మాది తమిళనాడులోని మధురై. నాన్న పెరుమాళ్‌ ఫార్మా కంపెనీ నిర్వహించేవారు. అమ్మ వేలమ్మాళ్‌ గృహిణి. నన్ను డాక్టర్ని చేయాలన్నది నాన్న ఆశయం. నాకేమో ఇంజినీర్‌ అవ్వాలని. అప్పట్లో ప్లస్‌ టూ మార్కుల వెయిటేజీతో ఇంజినీరింగ్‌ ప్రవేశాలు కల్పించే వారు. అక్కడ మంచి మార్కులే తెచ్చుకున్నా కానీ ప్రవేశ పరీక్షను తేలిగ్గా తీసుకున్నా. అనూహ్యంగా ఆ ఏడాది 12వ తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశ పరీక్షల ఆధారంగానే ఇంజినీరింగ్‌ ప్రవేశాలని ప్రకటించింది. నాకేమో ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులొచ్చాయి. దాంతో డిప్రెషన్‌కు గురయ్యా. ఇంజినీరింగ్‌ మాత్రమే చదువుతానని ఇంట్లోనే ఉండిపోయా.
నాన్న మాటతో...
తర్వాత కనీసం ఫార్మసీ అయినా చదవమని నాన్న బతిమాలారు. చివరికి తన స్నేహితుడి కళాశాలలో చేర్పించారు. అయిష్టంగానే కాలేజీకి వెళ్లేదాన్ని. ఇది గమనించిన నాన్న ‘ఫెయిల్‌ అయితే తలెత్తుకోలేను. కనీసం పాసు మార్కులైనా తెచ్చుకో’ అన్నారు. ఆ మాటతో పట్టుదలగా చదివి 85శాతం తెచ్చుకున్నా. ఎంజీఆర్‌ యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచా. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి బంగారు పతకం అందుకున్నా. బనారస్‌ హిందూ వర్సిటీలో ఎం.ఫార్మసీ, తర్వాత రెండున్నరేళ్లలోనే పీహెచ్‌డీ చేశా. 2001లో బిట్స్‌ పిలానీలో సహాయ ఆచార్యురాలిగా చేరాను. 2008లో హైదరాబాద్‌ వచ్చాను. నా పరిశోధనల  కోసం యోగీస్‌ బయో ఇన్నొవేషన్‌ అంకుర సంస్థను ప్రారంభించాను. ఇప్పటిదాకా మూడు భారత, ఆరు అంతర్జాతీయ పేటెంట్లకు దరఖాస్తు చేశాను. ఇప్పుడు నాణ్యమైన శానిటైజర్లు, కరోనాకి మందు కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాను.
ఐదు రకాల క్యాన్సర్లను గుర్తిస్తాం...
రొమ్ము క్యాన్సర్‌కు ఔషధాన్ని సిద్ధం చేస్తున్న క్రమంలో కొత్త సాంకేతికతలను వృద్ధి చేయాలనుకున్నాం. ఇందుకు వైద్యుల సహకారం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనికి బసవతారకం ఆసుపత్రిలోని డాక్టర్‌ కృష్ణమోహన్‌ సాయం తీసుకున్నాం. క్యాన్సర్‌ రోగుల్లో ఒక రకమైన ప్రోటీన్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించాం. ఆ ప్రొటీన్‌ను నిర్వీర్యం చేసే ఔషధాన్ని కనిపెట్టాం. దీని ఆధారంగా క్యాన్సర్‌నీ గుర్తించాలనుకున్నాం. ఓసారి క్యాన్సర్‌ నిర్ధరణ కోసం రోగుల రక్తం, బయాప్సీకి కణజాలం ఇవ్వడం చూశా. వారి బాధను చూసి చాలా భయమేసింది. కేవలం లాలాజలం నమూనాలతో క్యాన్సర్‌ గుర్తింపుపై పరిశోధన మొదలుపెట్టాం. ఇది విజయవంతం కావడంలో ఆర్మీడెంటల్‌ కళాశాలలో ఒక వైద్యుడు, బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఎంతో తోడ్పడ్డారు.
మేం అభివృద్ధి చేసిన విధానంలో ల్యాబ్‌లో టెస్టింగ్‌ యంత్రం సాయంతో క్యాన్సర్‌ నిర్ధరణ పరీక్ష చేస్తున్నాం. త్వరలోనే థర్మామీటర్‌ సైజు పరికరాన్ని  తీసుకురానున్నాం. దీని సాయంతో తక్కువ ఖర్చులోనే 5 రకాల క్యాన్సర్లు గుర్తించొచ్చు.  దీనికీ పేటెంట్‌ దరఖాస్తు చేశాం. మా పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ రూ.48 లక్షల గ్రాంటునిచ్చింది. మలేషియా ప్రభుత్వంతో పాటు సౌదీ నుంచీ పెట్టుబడిదారులు వస్తున్నారు.  

ప్రొఫెసర్‌ షిప్‌ దక్కించుకున్నా
మా సంస్థలో ‘బీకే బిర్లా, సరళ బిర్లా ఛైర్‌ ప్రొఫెసర్‌షిప్‌’ హోదా కోసం వేలమంది పోటీ పడతారు. ఐదేళ్లకోసారి బిట్స్‌ క్యాంపస్‌లలోని ముగ్గురు ప్రొఫెసర్లకు దీన్ని ఇస్తారు. అంతటి ప్రతిష్ఠాత్మక హోదా 2019లో నాకు దక్కింది. ఆ ఏడాది నలుగురు బయట వ్యక్తులు, ముగ్గురు బిట్స్‌ ఆచార్యులకు హోదా ఇచ్చారు. దీని ద్వారా ప్రత్యేక వేతనం, ఐదేళ్లు పరిశోధనల కోసం రూ.3లక్షలు అదనంగా ఇస్తారు.
21 పీహెచ్‌డీలు...
నా పరిశోధనలు తెలుసుకుని కుమారమంగళం బిర్లా ఎంతో ప్రోత్సహించారు. 2019 డిసెంబరులో దేశంలోని అన్ని బిట్స్‌ క్యాంపస్‌లలో ఆవిష్కరణల విభాగానికి అధిపతిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు బిట్స్‌ ఇన్‌స్టిట్యూట్లలో 35 ఏళ్ల వయసులోనే ప్రొఫెసర్‌ హోదా దక్కించుకున్న తొలి మహిళను కావడమూ సంతోషాన్నిస్తుంది. బిట్స్‌లో చేరి 21 ఏళ్లు. సరిగ్గా ఇదే సమయానికి 21 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీలు తీసుకోవడం తృప్తినిచ్చే విషయాల్లో ఒకటి.

-అమరేంద్ర యార్లగడ్డ, హైదరాబాద్‌
 

మంచిమాట

ఒక స్త్రీ ధైర్యం చేస్తేనే విప్లవం పుట్టుకొస్తుంది. అలాంటిది అనేకమంది తోడయితే ఎన్ని విజయాలు సాధించవచ్చో ఊహించండి.

- రైనా అల్‌ అబ్దుల్లా, జోర్డాన్‌ రాణి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి