మామగారి బాగోగులు చూసుకోవడానికి రమ్మంటున్నారు!
close
Updated : 12/06/2021 07:29 IST

మామగారి బాగోగులు చూసుకోవడానికి రమ్మంటున్నారు!

నాకు పదిహేడేళ్లప్పుడు పెళ్లయ్యింది. ఆర్థికంగా మా కుటుంబానికి చేయూతనిస్తానన్న హామీతో అత్తమామలు వాళ్ల కొడుకుతో పెళ్లిచేశారు. అతను వ్యసనపరుడనే విషయం కొద్దిరోజులకే తెలిసింది. పాప పుట్టాక కూడా నా భర్తలో మార్పు రాలేదు. ఆ బాధలు పడలేక బయటికి వచ్చేశా. పాపను మా అమ్మ పెంచుతోంది. నేనో చిన్న ఉద్యోగం చేస్తున్నా. నా కూతురి చదువు కోసం రెండేళ్ల క్రితం మామగారిని సాయం కోరినా పట్టించుకోలేదు. ఈ మధ్య మా అత్త చనిపోయింది. అప్పటి నుంచి మావారు.. మామగారి బాగోగులు చూసుకోవడానికి నన్ను రప్పించమని బంధువుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. అందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. నేనేం చేయాలి?

- ఓ సోదరి

మైనార్టీ తీరకుండా చేసిన ఏ పెళ్లీ చెల్లదు. కానీ ఇప్పటిదాకా మీరు ఆ విషయంపై కోర్టుకి వెళ్లలేదు కాబట్టి దాన్ని చట్టబద్ధ వ్యవహారం కిందే లెక్కిస్తారు. మీ భర్త గృహహింసకు గురిచేసినా అతని మీద మీరు ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఆ కారణంతోనే వారి అవసరాలకు అనుగుణంగా మీపై సర్దుబాటు చేసుకోమంటూ, కాపురం చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక మీ పెళ్లికి ముందు మీ అత్తింటి వారు... పుట్టింటివారికి ఆర్థికంగా సాయపడతామని ఇచ్చిన హామీలేవీ చెల్లవు. అయితే ఆ ఒప్పందాలకు ఆధారాలు ఉన్నాయా...అన్నది గమనించుకోండి. అప్పట్లో ఎక్కడైనా రాసుకుని ఉంటే... దాన్ని చూపించి మోసపూరిత పెళ్లి చేసుకున్నారనే అభియోగంతో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గృహహింస నిరోధక చట్టం కింద మెయింటెనెన్స్‌, పరిహారం, పాప చదువు ఖర్చు లాంటివి అడగొచ్చు. సీఆర్‌పీసీ సెక్షన్‌- 123 ప్రకారం మెయింటెనెన్స్‌ కోసం క్రిమినల్‌ లేదా ఫ్యామిలీ కోర్టులో దావా వేయవచ్చు. ఇవి రెండూ వేర్వేరు చట్టాల ఆధారంగా పని చేస్తాయి. మీ అనుకూలతను బట్టి చేయండి. దేనికైనా మీ వారి సంపాదన, మామగారి ఆస్తి వంటి వాటికి రుజువులు అవసరం. విడాకుల కోసం ప్రయత్నిస్తే మిమ్మల్ని వచ్చి కాపురం చేయమని బలవంతం పెట్టే అవకాశం ఉండదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసి, సెక్షన్‌ 25 ప్రకారం శాశ్వత భరణం కోసమూ ప్రయత్నించవచ్చు. ముందో మంచి లాయర్‌ని సంప్రదించండి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి