చదువులో రాణిస్తోంది.. ఆటల్లో మెరుస్తోంది
close
Updated : 13/06/2021 06:32 IST

చదువులో రాణిస్తోంది.. ఆటల్లో మెరుస్తోంది

ఆమెది పేద కుటుంబం.. పానీపూరి బండే జీవనాధారం. ఈ పరిస్థితిని మార్చడానికి చదువే మార్గమనుకుంది. మంచి విద్యార్థిగా ఎదుగుతూనే క్రీడా కుశలతకూ మెరుగులు దిద్దుకుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, దాతల ప్రోద్బలంతో భిన్న ఆటల్లో రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పతకాలూ సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయంగానూ ఆడనుంది. కుంటుతూ ప్రత్యర్థిని ఔట్‌ చేసే బాక్స్‌ లంగ్‌డి క్రీడాకారిణి రీతూకుమారి గురించే ఇదంతా.
అది 2017. ఖమ్మంలోని జలగం నగర్‌ జెడ్పీ పాఠశాల. విద్యార్థినులను క్రీడా పోటీలకు ఎంపిక చేస్తున్నారు. రీతూ కుమారి అప్పుడు ఏడో తరగతి. ఆటలంటే ప్రాణం. తనూ ఆడతానంది. సన్నగా, చిన్నగా ఉండటంతో ఆమెను వద్దన్నారు. చిన్నబోయింది. తనూ ఆడగలదని నిరూపించాలనుకుంది. రోజూ మిగతా వారితో పోటీపడి ఆడేది. ఆమె పట్టుదల గమనించి ఉపాధ్యాయులు పోటీలకు తీసుకెళ్లడం ప్రారంభించారు. మరుసటి ఏడాది పలు క్రీడల్లో పతకాలు సాధించింది. అప్పటినుంచి పతకాల వేట ఆగలేదు. రీతూది మధ్యప్రదేశ్‌. వాళ్ల కుటుంబం 16 ఏళ్ల క్రితం ఖమ్మంలో స్థిరపడింది. తనిప్పుడు ఏపీలోని తాడేపల్లిగూడెం నిట్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.
అమ్మానాన్నా షుగర్‌సింగ్‌, షీల ఖమ్మంలో పానీపూరి బండితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. రీతూకి ఇద్దరు సోదరులున్నారు. ముగ్గురినీ పానీపూరి బండి ద్వారా వచ్చే ఆదాయంతో చదివించడం తండ్రికి చాలా కష్టం అయ్యేది. ఇలాంటి పరిస్థితుల్లోనే 2019లో జాతీయస్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో రీతూకుమారి గెలిచి శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాల్గొనలేకపోయింది. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఆటలతోపాటు చదువులోనూ మేటి ఫలితాలు సాధిస్తుండటంతో పాఠశాల ప్రధానోపాధ్యాయిని అజిత ఖమ్మం జిల్లాలోని ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌కి ఈమె పేరును సిఫార్సు చేశారు. వారు చదువుకు ఆర్థికసాయం అందించారు. ఇంటర్‌ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేసింది. జేఈఈలో మంచి ర్యాంకుతో ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ సీటు సాధించింది.

ఆటా.. చదువూ..
చదువుని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదీమె. మొదటి సెమిస్టర్‌లో 89% సాధించింది. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటలు సాధన చేస్తుంది. రాత్రి ఆ రోజు చదవాల్సిన వాటిని పూర్తిచేస్తుంది. ‘టోర్నమెంట్‌లు ఉన్నప్పుడు కళాశాలలో అనుమతి తీసుకుంటాను. ఆ సమయంలో కొంచెం ఎక్కువ సేపు సాధన చేస్తాను. తిరిగొచ్చాక పాఠాలను స్నేహితులు, ఉపాధ్యాయులతో చెప్పించుకుంటా. పరీక్షల రోజుల్లో సాధనను పక్కన పెడతాను. నిజానికి ఒక్కసారి చదివితే చాలు నాకు గుర్తుండిపోతుంది. అందరిలా ప్రత్యేక డైట్‌ కూడా తీసుకోను. బలమని నెయ్యి, పాలు మాత్రం ఇస్తుంది అమ్మ. సాధనలో గుడ్లు, అరటిపండు ఇస్తారు’ అని వివరించింది రీతూ.
నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, బాక్స్‌లాంగడి ఆటలన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో వీటన్నింటినీ కొనసాగించడం సాధ్యమైందంటోంది రీతూ. ఎనిమిదో తరగతిలో మొదలైన ఈమె క్రీడా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతోంది. ఇప్పటివరకు నెట్‌బాల్‌లో 13, బాస్కెట్‌బాల్‌లో 4, సాఫ్ట్‌బాల్‌లో 2, హ్యాండ్‌బాల్‌లో ఒకటి, బాక్స్‌లంగ్‌డిలో ఒకటి చొప్పున పతకాలు కైవసం చేసుకుంది. దాదాపుగా అన్నీ జాతీయస్థాయివే! తనకు శిక్షకులు రఘు, పీవీ రమణ వెన్నుతట్టి మెలకువలు నేర్పారు. చదువు, ఆటలే తన ప్రపంచం. మోటివేషనల్‌ పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వీడియోలు చూడటం ఈ అమ్మాయి వ్యాపకాలు. ఆర్మీ వర్కవుట్స్‌ వీడియోలు చూసి, ప్రయత్నించడం ఇష్టం. కళాశాలలో డిబేట్‌, ఎస్సే రైటింగ్‌లకే ప్రాధాన్యమిచ్చే రీతూ.. ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావడం లక్ష్యమంటోంది. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అన్నయ్యే తనకు స్ఫూర్తి అంటోంది.


బాక్స్‌లంగ్‌డి.. చతురస్రాకారంలో ఉండే డబ్బాలో కుంటుతూ సాగే ఆట. మహారాష్ట్ర, నేపాల్‌ల్లో బాగా ప్రసిద్ధి. 36 నిమిషాలు సాగే ఆటలో రెండు జట్లు పోటీ పడతాయి. ఒక జట్టు నుంచి డిఫెండర్లు (కుంటేవారు), మరో జట్టు నుంచి చీజర్స్‌ (పరుగెత్తేవారు) పోటీ పడతారు. రెండు జట్లలో ఎక్కువ సమయం ఎవరు ఔట్‌ కాకుండా ఉంటే వాళ్లే విజేతలు. ఇటీవల ఖమ్మంలో జరిగిన జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో నేపాల్‌లో జరగనున్న పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ]్యం వహించనుంది.

ఉప్పాల రాజాపృథ్వీ, ఏలూరు


భవిష్యత్తులో మహిళా నాయకులు అంటూ ఉండరు. కేవలం నాయకులు ఉంటారంతే.
- షెరిల్‌ శాండ్‌బర్గ్‌, అమెరికన్‌ వ్యాపారవేత్త


 

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి