ఆ పిలుపు కోసమే.. ఉద్యోగం వదిలేశా!  
close
Updated : 16/06/2021 05:48 IST

ఆ పిలుపు కోసమే.. ఉద్యోగం వదిలేశా!  

అధికారం కోసం అన్నీ వదులుకునే వాళ్లని చూస్తుంటాం!
కానీ అనాథలతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసం అధికారాన్నే వదులుకున్న వాళ్ల గురించి విన్నారా?
గ్రూప్‌-1 ఉద్యోగాన్ని కాదనుకుని... జట్టు సేవాశ్రమాన్ని నిర్వహిస్తూ, అనాథలకు కొండంత అండగా నిలుస్తోన్న మానవతామూర్తి వెలిగండ్ల పద్మజ సేవాప్రస్థానం ఇది...

సౌజన్య అనాథ. బంధువులున్నా.. ఆమెని భారంగానే భావించారు. ఊహ తెలిసిననాటి నుంచీ ‘జట్టు ఆశ్రమమే’ ఆమె సొంతిల్లు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయికి అమ్మయినా, నాన్నయినా పద్మజే. కరుణకి అయినవాళ్లు ఎవరూ లేరు. ఆశ్రమమే ఆమెకు పుట్టినిల్లు. ఆమె రెండు కాన్పులూ అక్కడే. వీళ్లకి మాత్రమే కాదు... ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. ఆశ్రయం కోరి వచ్చిన అనాథ పిల్లలు తమ కాళ్లపై తాము నిలబడేలా విద్యాబుద్ధులతోపాటు జీవన నైపుణ్యాలను అందించి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా... కర్రసాము, కత్తిసాము వయోలిన్‌, వీణ, గాత్రం, నృత్యం, వ్యవసాయం మొదలుకుని మరెన్నో విద్యల్లో ఆరితేరేట్టు చేస్తున్నారు. చదువయ్యాక ఉద్యోగాలు దొరక్కపోయినా, ఏదో ఒక జీవనోపాధిని వెతుక్కునేలా వాళ్లకు  నైపుణ్యాలు అందించడమే ఈ ఆశ్రమం ప్రత్యేకత. పద్మజ లాలనలో పెరుగుతున్న వారిలో ఆరో తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకూ ఉన్నారు. పదేళ్ల క్రితమే ఈ ఆశ్రమాన్ని ఓ కుటుంబంగా భావించిన పద్మజ వీరి కోసం వ్యవసాయంలో అడుగుపెట్టారు. ఇందుకోసం తాను చేస్తున్న ఎంపీడీవో ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతూ పంటలు పండిస్తున్నారు. ఆశ్రమం విద్యార్థులే స్వయంగా పొలం పనులు చూసుకుంటారు. ఆశ్రమ నిర్వహణకు పోనూ మిగిలిన పంటను తక్కువ ధరకే అమ్ముతున్నారు. అంతేకాదు ఆశ్రమం తరఫున సేంద్రియ పచ్చళ్ల యూనిట్‌ను స్థాపించారు. కేవలం సేంద్రియ ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలతో తయారైన పచ్చళ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇవన్నీ సాధించడం అంత తేలిగ్గా అయిపోలేదంటారు పద్మజ. ‘హాయిగా ప్రభుత్వోద్యోగం చేసుకోక ఈ కష్టాలన్నీ నీకెందుకు అన్నవాళ్లే ఎక్కువ. సంపాదన, అధికారం ఇవ్వలేని ఆనందం ఈ పనిలో నాకు దొరికింది. ఆశ్రమంలో పిల్లలు ‘అమ్మా’ అని పిలుస్తుంటే కలిగే సంతోషం ముందు నాకేవీ ఎక్కువ అనిపించ లేదు. మా నాన్న పేరు భీమేశ్వరరావు. అమ్మ లలిత. నాన్న కర్ణాటకలో ఉద్యోగం చేసేవారు. బాల్యమంతా ప్రకాశం జిల్లా ఒమ్మెవరంలో గడిచింది. నర్సరావుపేటలో బీఎస్సీ చదివాను. కర్ణాటకలోని భార్వాడ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చేసి 1998లో గ్రూప్‌-1 పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాను. ప్రకాశంజిల్లా ఉలవపాడు ఎంపీడీవోగా ఉద్యోగంలో చేరాను. కొంతకాలం బాగానే నడిచిపోయింది. తర్వాత్తర్వాత అధికారంలో ఆనందం లేదనిపించింది. ఒత్తిళ్లు, రాజకీయాలతో సమాజ సేవ చేయలేననిపించింది. దీంతో దీర్ఘకాలిక సెలవు పెట్టాను. కొన్నాళ్లు అయ్యాక ఉన్నతాధికారుల సలహాతో 2004లో సింగరాయకొండ ఎంపీడీవోగా చేరాను. కొన్నాళ్లు గడిచాక... ఇక పూర్తిగా సేవలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ సమయంలోనే విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ఉన్న జట్టు ఆశ్రమం గురించి తెలిసింది. అప్పటికే పారినాయుడు లాంటి పెద్దలు ఆశ్రమాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇదే నాకు తగిన స్థలమనిపించింది. ఆ క్షణం నుంచీ ఇక్కడ నిస్సహాయులైన చిన్నారులే నా కుటుంబ సభ్యులయ్యారు. ఇంతవరకూ ఇక్కడ నూటయాభైమందికి పైగా అనాథలు ఆశ్రయం పొందారు. మనుషులు ఇష్టంతో చేసే పని కష్టమైనా స్వీకరిస్తారని తత్వశాస్త్రం చెబుతోంది. నా భావాలకు దగ్గరగా ఉండే... జీవితాన్ని గడిపే హక్కు నాకు ఉందనే అనిపిస్తుంది. సంపాదన, అధికారం ఇవ్వలేని ఆనందాన్ని నాకీ ఆశ్రమం, వ్యక్తిత్వం ఇచ్చాయి. ఆశ్రమంలో పిల్లలు అమ్మా అని పిలుస్తుంటే కలిగే సంతోషం ముందు ఏ అవార్డులూ సాటిరావు’ అంటారు పద్మజ.

- ఓబులేశు, ఈటీవీ, జి.రామకృష్ణ, పార్వతీపురం


మంచిమాట

మహిళలకు తాము తక్కువనే న్యూనతాభావం ఎంతమాత్రం ఉండకూడదు. ఎవరికీ తీసిపోమనే ధైర్యం, ధీమా ఉండాలి.

- క్యాథరిన్‌ జాన్‌సన్‌, గణిత శాస్త్రవేత్త, నాసా మాజీ ఉద్యోగి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి