పాఠాలు మానేసి పోలీసయ్యింది!
close
Published : 20/06/2021 01:40 IST

పాఠాలు మానేసి పోలీసయ్యింది!

ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉద్యోగాన్ని చేస్తున్న మహిళలెందరో. అమృతా దుహాన్‌ కూడా అంతే. వైద్య విద్యార్థులకు ప్రొఫెసర్‌గా సేవలందిస్తూనే తన ఐదేళ్ల కొడుకునీ చూసుకునేది. అంతటితో ఆగలేదామె. లక్ష్యాన్ని పెంచుకుని సివిల్స్‌ సాధించింది. అదీ మొదటి ప్రయత్నంలోనే! ప్రస్తుతం ఐపీఎస్‌ ఆఫీసర్‌గా సేవలూ అందిస్తోంది.

అమృతా దుహాన్‌ ఎంబీబీఎస్‌ చదివింది. పాథాలజీలో ఎండీ పూర్తిచేసి, మహిళా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరింది. ఈ సమయంలోనే తనకు పెళ్లైంది. ఒక బాబు కూడా. నిలకడైన ఉద్యోగం, ఆనంద భరితమైన కుటుంబ జీవితం పెద్ద కలలను ఏర్పరచుకోవడంలో అడ్డంకి కాలేదంటుందామె. ఈమెది హరియాణలోని రోహ్‌తక్‌. తన తమ్ముడు ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. అది ఆమెలో ఆసక్తిని కలిగించింది. తనూ రాద్దామనుకుని, సన్నద్ధత ప్రారంభించింది.

వారాంతాలను పూర్తిగా బాబుకి కేటాయించేది. మిగిలిన రోజుల్లో ఎక్కువ సమయం ఉద్యోగానికీ, సన్నద్ధతకీ ప్రాధాన్యమిచ్చింది. 2016లో కోచింగ్‌ తీసుకోకుండానే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అసోసియేట్‌ మెడికల్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతినీ సాధించింది. దాన్ని పక్కనపెట్టి ఐపీఎస్‌ శిక్షణకు వెళ్లింది. నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ సమయానికి అమృతకు 33 ఏళ్లు. అప్పటిదాకా ఎలాంటి శారీరక శ్రమా లేదు. పైగా ఆమె కేడర్‌లో తనొక్కతే అమ్మాయి. అందరితో సమానంగా నిలవడానికి అదనంగా శిక్షణకు సమయం కేటాయించేది. గాయాలపాలైనా నొప్పిని పంటి బిగువన భరించి సాధన సాగించింది. ఫలితం... శిక్షణ పూర్తయ్యేనాటికి మూడు పతకాలను సాధించడమే కాకుండా ఆల్‌ రౌండ్‌ లేడీ ఐపీఎస్‌ ప్రొబేషనర్‌గానూ నిలిచింది.

శిక్షణ తర్వాత 2017లో దిల్లీలో మొదట ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలను నిర్వహించింది. మెడికల్‌ పరిజ్ఞానంతో ఫోరెన్సిక్‌ సంబంధిత క్లిష్టమైన, క్రిమినల్‌ కేసులను పరిష్కరించి, ప్రజల నమ్మకాన్ని చూరగొంది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జయపురలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ)గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇదంతా సాఫీగా ఏమీ సాగలేదంటుందామె. అవరోధాలూ ఎదురయ్యాయి. కానీ తన కలలను సాకారం చేసుకోవాలన్న తపన ముందు అవేమీ నిలవలేదంటుంది అమృత. అందుకే అమ్మగా, వైద్యురాలిగా, పోలీసు ఆఫీసర్‌గా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగగలుగుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను సమన్వయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నవారికి ఆదర్శంగా నిలవడంతోపాటు సివిల్స్‌ లక్ష్యమున్న అమ్మాయిల్లో స్ఫూర్తినీ నింపుతోంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి