ఆ ఎర్ర గుర్తు మహిళలకు రక్ష
close
Updated : 22/06/2021 05:01 IST

ఆ ఎర్ర గుర్తు మహిళలకు రక్ష

రోడ్డు మీద వెళుతోంటే.. వెకిలి వ్యాఖ్యలు. రద్దీ ప్రదేశాల్లో ఎక్కడ్నుంచో చాటుగా తాకే చెడు స్పర్శ. బయటకు వెళ్లే ప్రతి అమ్మాయి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేవే ఇవన్నీ. అయితే ఫిర్యాదు చేసేవారెందరు? ఎక్కువ శాతం మంది చిన్న విషయంగా భావించి వదిలేస్తారు. ఈ వాతావరణాన్ని మార్చాలనుకుంది ఎల్సా మేరీ డిసిల్వా. అందుకోసం అత్యున్నత ఉద్యోగాన్నే వదులుకుంది. ఇప్పుడు ఎన్నో దేశాలు అమ్మాయిల భద్రత విషయంలో ఆమె సాయం కోరుతున్నాయి.

రైల్వే స్టేషన్‌లో నడుస్తుంటారు. ఫలానా రెండో గేట్‌ నుంచి వెళ్లేటప్పుడు ఆకతాయిలు ఉన్నారని ఫోన్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు పోకిరీలు ఉండే చోటును ఎర్రటి సంకేతం చూపిస్తుంది. ఫలితంగా వేరే దారిలో వెళ్లొచ్చు. ఈ విధంగా సాయపడేలా వెబ్‌సైట్‌, యాప్‌లను రూపొందించింది ఎల్సామేరీ. ఎల్సాకి ఏర్‌లైన్స్‌లో 20 ఏళ్ల అనుభవం ఉంది. వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగింది. చీకూ చింతా లేని జీవితం. 2012, దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఎల్సానూ కలచి వేసింది. రోడ్డు మీదకు వెళుతున్న ఆడవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఒక్కసారైనా వేధింపులకు గురవుతున్నారని తెలుసుకుంది. తన అనుభవాలూ గుర్తొచ్చాయి. దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకుని ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసింది.

అదే ఏడాది ‘రెడ్‌ డాట్‌ ఫౌండేషన్‌’ సంస్థను స్థాపించింది. దానికి తనే సీఈఓ. దానిలో భాగంగా రూపొందించిందే సేఫ్‌సిటీ. మొదట వెబ్‌సైట్‌గా రూపొందించిన దీన్ని గత ఏడాది నుంచి యాప్‌ రూపంలో తీసుకొచ్చింది. దీనిలో ఎవరైనా తమ అనుభవాలను పేరు చెప్పకుండానే ప్రదేశంతో సహా పంచుకోవచ్చు. దీన్ని ‘పిన్నింగ్‌ ద క్రీప్‌’గా వ్యవహరిస్తున్నారు. ఫలానా స్థలానికి సంబంధించి ఫిర్యాదులు చేసే వారు పెరిగే కొద్దీ దాన్ని రెడ్‌మార్క్‌తో చూపిస్తుంటారు. దీంతో అటుగా వెళ్లే వాళ్లు జాగ్రత్త పడొచ్చు. కానీ దీని వల్ల సమస్య తొలగదు కదా? ఇదే సందేహం చాలా మందికి వచ్చింది. ‘80 శాతం మంది మహిళలు వీటి గురించి ఫిర్యాదుకు ముందుకు రారు. ఏ కొద్దిమందో వచ్చినా అలాంటిదేమీ లేదని తోసిపుచ్చేవారే ఎక్కువ. కానీ ఇక్కడ డేటా ఉంటుంది. పూర్తి వివరణా ఉంటుంది. దీన్ని ఉదాహరణగా చూపించి ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించక తప్పదు కదా?’ అంటుంది ఎల్సా. ఈ సేవల్ని ముంబయిలో ప్రారంభించింది. మొదట అక్కడి ఎన్‌జీవోలతో కలిసి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రారంభంలో డేటా ఆధారంగా ఎల్సానే పోలీసు అధికారులను కలిసేది. ప్రమాదకరంగా భావిస్తున్న ప్రదేశాల్లో పెట్రోలింగ్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, కానిస్టేబుళ్లను ఉంచేలా చూడటం లాంటివి చేసేది. తర్వాత పోలీసు అధికారులే ఆమెతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఫలితంగా చాలాచోట్ల సమస్య తగ్గింది. ఆపై దిల్లీ, ఇతర నగరాలకూ విస్తరించారు.

ఎన్నో దేశాలు.. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో 25000లకు పైగా వ్యక్తిగత స్టోరీలున్నాయి. పదిలక్షల మందికిపైగా దీని సేవలు పొందుతున్నారు. హిందీ, ఇంగ్లిష్‌, స్పానిష్‌ భాషల్లో సేవలు అందిస్తున్నారు. నేపాల్‌, కెన్యా, కామెరూన్‌, నైజీరియా, టొబాగో మొదలైన దేశాల నుంచి ఆమెకు ప్రతిపాదనలొచ్చాయి. యూఎస్‌, యూకే సహా మరెన్నో దేశాల్లో సేఫ్‌సిటీ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైల్‌ యాప్‌గా అందుబాటులోకి వచ్చింది. యూఎస్‌లోనూ రెడ్‌ డాట్‌ ఫౌండేషన్‌ బ్రాంచిని ఏర్పాటు చేసింది ఎల్సా. ఆమె సేవలకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ వరించాయి. హిలరీ క్లింటన్‌తో కలిసి గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డును పొందింది. నీతి ఆయోగ్‌తో పాటు ఆస్పెన్‌ న్యూ వాయిసెస్‌, ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ల పురస్కారాలనూ అందుకుంది. ‘దఖల్‌ దో’ పేరిట క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది. స్త్రీలు వేధింపులకు గురవుతుంటే వారికి సాయమందించేలా చైతన్యం తేవడం దీని ఉద్దేశం. పిల్లల నుంచే మార్పు రావాలని స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు తను దాచుకున్న సొమ్ముని ఖర్చు చేసేసింది. పురస్కారాలతో వచ్చిన మొత్తాల్నీ వినియోగించింది. తర్వాత టాటా ట్రస్ట్‌ వంటి సంస్థలు విరాళాలు అందించాయి. తోటి మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు ఎంత శ్రమ అయినా పడతానంటున్న ఎల్సా అభినందనీయురాలు కదూ.

మంచిమాట!

పెళ్లితో స్త్రీ బలహీనురాలైపోతుంది. ఆమె స్థైర్యంగా ఉండటం ఆఖరికి భర్తకి కూడా నచ్చదు. ఈ వ్యవస్థే వ్యక్తులను అలా తయారుచేస్తోంది.

- కల్కి కొచ్చిన్‌, ఫ్రెంచి రచయిత్రి, బాలీవుడ్‌ నటి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి