ఇలా దువ్వుకుంటే జుట్టు పెరుగుతుందట! - hair brushing benefits in telugu
close
Published : 05/09/2021 14:55 IST

ఇలా దువ్వుకుంటే జుట్టు పెరుగుతుందట!

జుట్టును అదే పనిగా దువ్వుకుంటే ఎక్కువగా రాలిపోతుందనుకుంటాం.. అందుకే ఏదో అలా పైపైన దువ్వుకొని జడ వేసేసుకుంటాం. అయితే ఎలా పడితే అలా కాకుండా కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా దువ్వుకోవాలంటున్నారు. ఫలితంగా కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు.

ప్రయోజనాలివే!

* సాధారణంగా మనం రోజూ జుట్టు దువ్వుకునే క్రమంలో సుమారు 50 నుంచి 100 వెంట్రుకల దాకా రాలిపోతాయంటున్నారు నిపుణులు. అయితే హడావిడిగా ఇష్టారీతిన దువ్వడం వల్లే ఇలా జరుగుతుందని, అదే కాస్త సమయం వెచ్చించి నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయంటున్నారు.

* కుదుళ్లలో సహజసిద్ధమైన నూనెల్ని విడుదల చేసే సెబాషియస్‌ గ్రంథులుంటాయి. దువ్వే క్రమంలో అవి ప్రేరేపితమై అవసరమైన మొత్తంలో నూనెల్ని విడుదల చేస్తాయి. ఫలితంగా కుదుళ్లు, జుట్టు తేమను కోల్పోకుండా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.. అలాగే కేశాల్ని పట్టుకుచ్చులా మెరిపిస్తుంది.

* దువ్వుకునే క్రమంలో కుదుళ్లకు చక్కటి మసాజ్‌ అందుతుంది. తద్వారా అక్కడ రక్తప్రసరణ మెరుగై.. అంతిమంగా ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

* జుట్టులోనూ దుమ్ము-ధూళి చేరి.. సరిగ్గా దువ్వకపోతే చిక్కులు కట్టినట్లుగా తయారవుతుంది. జుట్టు రాలడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి ఇలాంటప్పుడు చిక్కులు తొలగిస్తూ జుట్టును దువ్వుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉండడంతో పాటు వెంట్రుకలు-కుదుళ్లలో చిక్కుకున్న దుమ్ము-ధూళి కూడా తొలగిపోతాయి.

ఎన్నిసార్లు దువ్వుకోవాలి?

జుట్టు దువ్వుకోవడం మంచిదన్నాం కదా అని ఎలా పడితే అలా.. ఎంత సేపు పడితే అంత సేపు దువ్వుకుంటే ప్రయోజనాలకు బదులు సమస్యలు ఎదురవ్వచ్చంటున్నారు నిపుణులు. అందుకే రోజుకు రెండుసార్లు 100 స్ట్రోక్స్‌ ఇచ్చేలా జుట్టు దువ్వుకోవడం మంచిదంటున్నారు. అంటే ఉదయం 50 స్ట్రోక్స్‌, రాత్రి పడుకునే ముందు 50 స్ట్రోక్స్‌ చొప్పున దువ్వుకుంటే సరి. అది కూడా దువ్వెన కుదుళ్లకు తాకేలా, వెంట్రుకల్లో చిక్కులు తొలగించుకుంటూ పై నుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకోవాలి. ఇక ఈ క్రమంలో చెక్కతో చేసిన ప్యాడిల్ బ్రష్‌/దువ్వెన ఉపయోగిస్తే వెంట్రుకలు, కుదుళ్లు డ్యామేజ్‌ కాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు.

తడి జుట్టు ఇలా!

తడిగా ఉన్న జుట్టును ఆరాక దువ్వుకుందాంలే అని వదిలేస్తుంటారు చాలామంది. తద్వారా వెంట్రుకలు చిక్కులు కట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఇలా దువ్వమంటున్నారు.

* తలస్నానం చేశాక కండిషనర్‌ రాసుకోవాలి. ఒకవేళ ఈ అలవాటు లేని వారు దీన్ని వదిలేయచ్చు.

* ఇప్పుడు బ్రిజిల్స్‌ మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉన్న, చివర్ల వద్ద మృదువైన బొడిపెల్లా ఉన్న దువ్వెన తీసుకొని కుదుళ్ల వద్ద నుంచి చివర్ల దాకా దువ్వుతూ రావాలి. ఈ క్రమంలో ఎక్కడైనా చిక్కులు కట్టినట్లు అనిపిస్తే వేళ్లతో వాటిని తొలగించాలి.

* చిక్కులన్నీ తొలగిపోయాక.. మరోసారి జుట్టును పై నుంచి కింది వరకు దువ్వుకుంటే సరిపోతుంది. తడి జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి చిక్కులు తొలగించుకునేలా దువ్వుకుంటే చాలు.

పొడి జుట్టు కోసం..!

* జడ వేసుకున్నా, ముడేసుకున్నా, వదిలేసినా.. జుట్టు ఎక్కువగా చిక్కులు కట్టేది కింది భాగంలో లేదంటే చివర్ల వద్దే.. కాబట్టి ముందుగా ఆ భాగంలో చిక్కులు తొలగించుకోవాలి. ఇందుకోసం జుట్టు మధ్య భాగం నుంచి కింది వరకు చిక్కులు తొలగించుకుంటూ నెమ్మదిగా దువ్వాలి.

* ఇప్పుడు ఇంకాస్త పై నుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకుంటూ రావాలి. ఆ తర్వాత ఇంకాస్త పై నుంచి.. ఆఖరుగా కుదుళ్ల నుంచి కింది దాకా మరోసారి జుట్టు మొత్తాన్ని దువ్వాలి. ఇలా చేయడం వల్ల చిక్కులు తొలగిపోతాయి.. జుట్టు కూడా ఎక్కువగా రాలకుండా ఉంటుంది.

జుట్టు దువ్వుకోవడం అనేది మనం రోజూ చేసే పనే అయినా.. దీనికీ ఓ పద్ధతుందని, తద్వారా జుట్టు రాలడం తగ్గుతుందని తెలిసిన వారు బహుశా తక్కువ మందే ఉండచ్చు.. అలాంటి వారికి ఈ చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక నుంచైనా హడావిడిగా కాకుండా ఇలా నెమ్మదిగా దువ్వుకుందాం.. కేశ సంపదను పెంచుకుందాం..!


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని