వర్షాకాలంలో మొక్కజొన్న ఎందుకు తినాలంటే?! - health benefits of monsoon food corn
close
Updated : 13/07/2021 20:05 IST

వర్షాకాలంలో మొక్కజొన్న ఎందుకు తినాలంటే?!

వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన ఆహారంలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం. పైగా ప్రస్తుతం వర్షాకాలం.. సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా మహమ్మారి ముప్పు కూడా పొంచి ఉంది. అందుకే అటు వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ.. ఇటు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే కొన్ని సీజనల్‌ ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ముఖ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొక్కజొన్న కూడా అలాంటిదే!

జీర్ణ వ్యవస్థ పనితీరుకు..!

చిటపట చినుకుల్లో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తుపై ఉప్పు-కారంలో ముంచిన నిమ్మచెక్కతో రుద్దుకొని తిన్నామంటే ఆ రుచే వేరు! అంతేకాదు.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలూ ఇందులో దాగున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు బలహీనమైపోవడం వల్ల తలెత్తే అజీర్తి, గ్యాస్ట్రిక్‌.. వంటి జీర్ణసంబంధిత సమస్యల్ని దూరం చేయడంలోనూ మొక్కజొన్న పాత్ర కీలకం అంటున్నారు. ఈ క్రమంలో దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్లు, సూప్స్‌లోనూ భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారమని వారు చెబుతున్నారు.

మొక్కజొన్నతో మేలెంతో!

* మొక్కజొన్నలో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ రేటును మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

* నీటిలో కరిగే ఫైబర్‌ ఇందులో అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను అదుపు చేయడంలో సహాయపడుతుంది.

* పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌.. వంటి ఖనిజాలతో నిండి ఉండే మొక్కజొన్నను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

* ఇందులోని విటమిన్‌-బి శరీరంలో శక్తి స్థాయుల్ని పెంచుతుంది.

* మొక్కజొన్నలో ఉండే విటమిన్-సి, లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌.. చర్మ, జుట్టు ఆరోగ్యానికెంతో అవసరం!

* ఇక దీనిలోని విటమిన్‌-ఎ వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

* శరీరంలోని వాపు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించే యాంటీఆక్సిడెంట్లు మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని తరచూ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

* అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కెరోటినాయిడ్లు, ల్యూటిన్‌, జియాక్సాంథిన్‌.. వంటివి మొక్కజొన్నలో సమృద్ధిగా లభ్యమవుతాయి.

* మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫలితంగా ఆహారపు కోరికలను అదుపులో పెట్టుకోవచ్చు. తద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

* గర్భంతో ఉన్న మహిళల్ని మలబద్ధకం లాంటి జీర్ణసంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అలాంటివారు మొక్కజొన్నను డైట్‌లో చేర్చుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులోని ఫోలిక్‌ ఆమ్లం తల్లితో పాటు గర్భంలోని బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

* మొక్కజొన్నలోని ఫ్లేవనాయిడ్లు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని