తుప్పును వదిలించే బంగాళాదుంప! - here how you can use potatoes to clean different things in the house in telugu
close
Published : 23/08/2021 17:50 IST

తుప్పును వదిలించే బంగాళాదుంప!

బంగాళాదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా మనలో చాలామందికి ఫేవరెట్‌. పలు చర్మ సమస్యల్ని తగ్గించి మేని ఛాయను పెంచే సుగుణాలూ ఇందులో బోలెడు! అయితే ఇలా అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఈ దుంప.. పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలిస్తుందని మీకు తెలుసా? అంతేకాదు.. సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఏజెంట్‌గా పనిచేసే ఈ పదార్థం పలు ఇంటి అవసరాలకూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఆ పాత్రల్ని మెరిపిస్తుంది!

వాతావరణంలోని తేమ కారణంగా ఐరన్‌, స్టీలు పాత్రలు తుప్పు పట్టడం సహజమే! అయితే దీన్ని వదిలించడానికి స్టీల్‌ స్క్రబ్బర్‌ వంటివి వాడితే పాత్ర త్వరగా పాతబడిపోతుంది.. మెరుపూ తగ్గిపోతుంది. అందుకే దానికి బదులు బంగాళాదుంపను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఆలూను మందపాటి స్లైసుల్లా కట్‌ చేసుకోవాలి. ఒక స్లైస్‌ను గిన్నెలు తోమే సోప్‌ లిక్విడ్‌లో ముంచి లేదంటే బేకింగ్‌ సోడాలో అద్ది.. తుప్పు ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఫలితంగా తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత సోప్‌ లిక్విడ్‌తో శుభ్రం చేసి పొడిగా ఆరబెడితే సరిపోతుంది.

ఇక తుప్పు పట్టిన వంటింటి కత్తులపై బంగాళా దుంప ముక్కతో రుద్ది ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగి పొడిగా తుడిచేస్తే ఫలితం ఉంటుంది.

వెండి నల్లబడిందా?

గాలి తగిలి వెండి ఆభరణాలు నల్లగా మారడం మనకు తెలిసిందే! ఇలాంటప్పుడు వాటిని మరిగే నీటిలో వేసి కడుగుతుంటాం. అయితే దీని వల్ల అవి శుభ్రపడడమేమో గానీ వాటి సహజ మెరుపును కోల్పోతాయి. ఇలాంటప్పుడు బంగాళాదుంపలు మరిగించిన నీళ్లతో వెండి వస్తువుల్ని శుభ్రం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా నీళ్లు బాగా వేడిగా, మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి. ఈ నీటిలో ఆయా వస్తువుల్ని వేసి గంటపాటు వదిలేసి ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఈ నీళ్లలో ఉండే స్టార్చ్‌ నల్లగా మారిన వెండి ఆభరణాలు/వస్తువుల్ని తిరిగి మెరిపిస్తుంది.

మాడిపోతే ఇలా చేయండి!

మతిమరుపు/హడావిడి కారణంగా ఒక్కోసారి వంట చేసే క్రమంలో గిన్నెలు అడుగంటుతుంటాయి. అయితే దీన్ని వదిలించాలన్నా అందుకు బంగాళా దుంప చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం మందపాటి స్లైస్‌లా కట్‌ చేసిన ఆలూ ముక్కను నిమ్మరసంలో ముంచి మాడిన ప్రదేశంలో రుద్దాలి. ఆ తర్వాత దాన్ని ఓ అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు సబ్బు నీటితో నెమ్మదిగా రుద్ది కడిగేస్తే మాడిన గిన్నె తిరిగి మెరిసిపోతుంది.

అద్దాలు మసకబారవు!

మాస్క్‌ కారణంగా కళ్లద్దాలు మసకబారడం మనలో చాలామందికి అనుభవమే! ముక్కు ద్వారా మనం వదిలే వెచ్చటి గాలి ఈ సమస్యకు ప్రధాన కారణం! ఇలాంటప్పుడు అద్దాల్ని శుభ్రం చేసుకోవడానికి బంగాళాదుంప చక్కగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఆలూ ముక్కతో అద్దాల లెన్సుల్ని రుద్ది తుడిచేస్తే సరిపోతుంది. అంతేకాదు.. దుంపలోని స్టార్చ్‌ లెన్సులు పదే పదే మసకబారకుండా చేస్తుందట! ఇక డ్రస్సింగ్‌ మిర్రర్స్‌, గ్లాస్‌ కిటికీల్ని శుభ్రం చేయడానికీ దీన్ని ఉపయోగించచ్చు.

మరకలు మాయం!

దుస్తులు, కార్పెట్స్‌పై టొమాటో కెచప్‌ వంటి మరకలు పడితే ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు ఒక చిన్న బంగాళాదుంప ముక్క తీసుకొని మరక పడిన చోట రుద్దాలి. ఆపై బంగాళాదుంపలు ఉడికించిన నీటిని దానిపై పోయాలి. ఇప్పుడు ఆ క్లాత్‌ను ఓ అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత సాధారణంగా సబ్బు నీటితో ఉతికేస్తే మరక తొలగిపోవడం మనం గమనించచ్చు. ఇలా కాదనుకుంటే.. ఆలూ ఉడికించిన నీటిలో స్పాంజిని ముంచి కూడా మరక పడిన చోట రుద్దచ్చు. ఫలితంగా కూడా మరక తొలగిపోతుంది.

ఇలా కూడా!

* లెదర్‌ షూస్‌, బ్యాగులు త్వరగా దుమ్ము పట్టేస్తుంటాయి. తద్వారా అవి మురికిగా కనిపిస్తాయి. అలాంటప్పుడు బంగాళాదుంప ముక్కతో వాటిని రుద్ది ఓ ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు శుభ్రమైన కాటన్‌ వస్త్రంతో మరోసారి వాటిని తుడిచేస్తే సరిపోతుంది.

* చెక్క వస్తువులు/వుడెన్‌ ఫర్నిచర్‌ని శుభ్రం చేయడానికీ బంగాళాదుంపను ఉపయోగించచ్చు. ఇందుకోసం కొద్దిగా వెనిగర్‌, టీస్పూన్‌ ఉప్పు, తురిమిన ఆలూ కొద్దిగా తీసుకొని.. వీటన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమంలో స్పాంజిని ముంచి చెక్క ఫర్నిచర్‌ని తుడిచేస్తే అవి మెరిసిపోతాయి.

మరి, ఇవి కాకుండా.. ఇతర ఇంటి అవసరాల కోసం బంగాళాదుంపను ఇంకా ఎలా వాడచ్చో మీకు తెలిసిన చిట్కాలు మాతో పంచుకోండి!



మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని