నిద్ర లేవగానే ఇలా చేస్తే రోజంతా పాజిటివిటీతో ఉండచ్చు! - here how you should begin your mornings positively and productively
close
Published : 02/08/2021 13:40 IST

నిద్ర లేవగానే ఇలా చేస్తే రోజంతా పాజిటివిటీతో ఉండచ్చు!

నిద్ర లేవగానే హడావిడిగా, టెన్షన్‌గా రోజును ప్రారంభిస్తే ఇక ఆ రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్లుగా ఉంటుంది.. అదే హ్యాపీగా, పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో మొదలుపెట్టామంటే సమయమే తెలియకుండా ఆ రోజులోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేయచ్చు. అందుకు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

మొబైల్‌ మొహం చూడద్దు!

నిద్ర లేవగానే దేవుడి పటాన్ని చూడడమో లేదంటే మన ముఖమే అద్దంలో చూసుకోవడమో అదీ కాదంటే కుటుంబ సభ్యుల మొహం చూడడమో.. ఇలా చేయడం చాలామందికి అలవాటు! అయితే రోజులు మారే కొద్దీ ఈ అలవాటు కూడా మారిపోతోంది. ఈ రోజుల్లో అయితే చాలామంది కళ్లు తెరవగానే పక్కనున్న మొబైల్‌ ఫోన్‌నే చూస్తున్నారు. రాత్రి నుంచి ఎవరి నుంచి ఏయే సందేశాలొచ్చాయి? వాట్సప్‌ మెసేజెస్‌ ఏంటి? ఈ రోజు వార్తలేంటి? వంటివన్నీ చెక్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అయితే ఎక్కడ చూసినా కరోనా కల్లోలిత వార్తలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఏదో ఒక చేదు వార్త కంట పడడం, దాంతో తీవ్ర ఒత్తిడికి లోను కావడం.. ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి ఆందోళనే నెలకొందంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేవగానే మొబైల్‌ పక్కన పెట్టేసి.. లేలేత సూర్యకిరణాలు పడే చోట కాసేపు పచ్చగడ్డిపై అలా నడవడం.. నచ్చిన వర్కవుట్‌ చేయడం.. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. ఇలా ఇవన్నీ మనలో పాజిటివిటీ నింపే అంశాలే అంటున్నారు! ఫలితంగా మనసుకు ఏదో తెలియని ఉత్సాహం కలిగి.. ఆ రోజంతా సంతోషంగా గడిపేయచ్చంటున్నారు.

నిమ్మరసంతో షురూ!

శరీరం యాక్టివ్‌గా ఉన్నప్పుడే మనసులో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అయితే ఆ యాక్టివ్‌నెస్‌ అనేది రోజులో మనం తీసుకునే తొలి ఆహారం/పానీయంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టీ/కాఫీలకు బదులు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్నారు. టీ/కాఫీ తాగే అలవాటున్న వారు నిమ్మరసం తాగిన తర్వాత ఓ అరగంట/గంట వ్యవధిలో ఓ కప్పు స్ట్రాంగ్‌గా పెట్టుకొని తాగచ్చు. ఇలా నిద్ర లేచి బ్రష్‌ చేసుకున్న వెంటనే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురవకుండా రోజంతా పాజిటివ్‌గా, సంతోషంగా గడిపేయచ్చు.

ఒళ్లు విరవాల్సిందే!

రాత్రిళ్లు పడుకోవడం ఆలస్యం.. నిద్ర లేవడమూ లేటే! దాంతో హడావిడిగా రోజువారీ పనుల్లోకి దూరిపోవడం.. ఆపై వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా కంప్యూటర్‌ ముందు వాలిపోవడం.. ఇది చాలామందికి అలవాటే! దాంతో ఉదయం పనులన్నీ పూర్తయ్యే సరికి నీరసం వచ్చేస్తుంది. ఏదో నెగెటివిటీ మన మనసును చుట్టేస్తుంది.. ఇంకేముంది.. ఆ అలసటతోనే రోజంతా గడిచిపోతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. లేచీ లేవగానే ఒళ్లు విరవమంటున్నారు నిపుణులు. తద్వారా మనలో ఉన్న బద్ధకం వదిలిపోయి యాక్టివ్‌నెస్‌ మన దరి చేరుతుందట! ఇలా శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మనసూ పాజిటివ్‌గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

నోట్‌ చేసుకుంటే ఈజీ అవుతుంది!

రోజులో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు బోలెడుంటాయి.. దీనికి తోడు ఇంటి పనులు! నిద్ర లేవగానే ఇవన్నీ తలచుకున్నామంటే ‘ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయో.. ఏమో!’ అన్న టెన్షన్‌ వచ్చేస్తుంది. దాంతో ఏ పని ఎప్పుడు పూర్తిచేయాలో అర్థం కాక ఆ రోజంతా అదే నెగెటివిటీతో గడిచిపోతుంది. అలాకాకుండా ఆ రోజులో చేయాల్సిన పనులేంటో, వాటిలో ముందుగా పూర్తిచేయాల్సినవేంటో నోట్‌ చేసుకుంటే పని సులభమవుతుంది. ఇలా పనుల్ని ఫిల్టర్‌ చేసుకోవడం వల్ల మనసుపై భారం కూడా తగ్గుతుంది. ఫలితంగా పాజిటివిటీతో ముందుకు సాగచ్చు.

ముస్తాబవడమూ ముఖ్యమే!

వేళకు నిద్ర లేచామా.. సమయానికి లాగిన్‌ అయ్యామా అన్నట్లుగా ఉంటోంది ప్రస్తుతం చాలామంది రొటీన్‌! ఈ క్రమంలో కొంతమంది స్నానంతో పని లేకుండా పైపైన మొహం కడిగేసుకొని పని మొదలుపెట్టేస్తున్నారు. నిజానికి ఇదే మనలో నిస్సత్తువకు, ఆ రోజంతా నెగెటివిటీ మూడ్‌లో గడిపేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అంతిమంగా దీని ప్రభావం మన ఉత్పాదకతపై కూడా పడుతుంది. కాబట్టి ఈ సమస్య రాకూడదంటే పనిలోకి వెళ్లేముందే చక్కగా స్నానం చేసి, నీట్‌గా డ్రస్‌ వేసుకుంటే.. మన మనసులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. చేసే పనిపై శ్రద్ధ పెట్టగలుగుతాం.. పనులన్నీ చకచకా పూర్తవుతాయి కూడా!

సో.. ఇవండీ! రోజంతా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలంటే నిద్ర లేవగానే చేయాల్సిన, చేయకూడని కొన్ని పనులు! మరి, రోజంతా పాజిటివిటీతో నింపుకోవడానికి మీరేం చేస్తున్నారు? ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి.. మీరిచ్చే సలహాలు తోటివారికి ఉపయోగపడచ్చు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని