ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే! - high-touch surfaces that you must clean at home
close
Published : 14/07/2021 19:03 IST

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

సునీత గృహిణి. ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి పిల్లలిద్దరూ ఇంటి పట్టునే ఉండడం, భర్త ఆఫీసుకు వెళ్లొస్తుండడంతో తనకు ఇంటి పని మరింత పెరిగింది. దీంతో తీరిక లేక కొన్ని వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్న విషయం కూడా మర్చిపోయింది.

వినీత గత నాలుగు నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తోంది. ఉదయాన్నే చకచకా ఇంటి పని ముగించుకొని ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుందంటే రాత్రి వరకూ తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ల్యాపీ ఉపయోగించుకోవడం, పనైపోయాక దాన్ని పక్కన పెట్టేయడం తప్ప క్లీన్‌ చేద్దామన్న ఆలోచనే తనకు రాదు.

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!


తలుపులు-కిటికీలు

మనం ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా తలుపు తీయాల్సిందే! ఈ క్రమంలో తలుపులను రోజూ లెక్కలేనన్ని సార్లు తాకుతూనే ఉంటాం. అలాగే ఇంటి లోపల ఉండే తలుపులు, కిటికీలను కూడా తరచూ తెరవడం, మూయడం చేస్తుంటాం. ఇలా మనమే కాదు.. మన ఇంట్లో ఉండే వాళ్లు కూడా వాటిని పదే పదే వాటిని తాకుతూనే ఉంటారు. ఇక కొంతమంది బయటికి వెళ్లొచ్చాక చేతుల్ని శుభ్రపరచుకోకముందే తలుపు తీయడం చేస్తుంటారు. ఇలాంటి అపరిశుభ్రత వల్ల కూడా వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.. అందుకే రోజూ మనం పదే పదే తాకే తలుపులు, కిటికీలు, వాటికి ఉండే హ్యాండిల్స్‌, డోర్‌ నాబ్స్‌, డోర్‌ స్టాపర్స్‌.. వంటివన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సలహా ఇస్తున్నారు.

ఎలా శుభ్రం చేయాలి?

ఇందుకోసం బయట దొరికే లిక్విడ్‌ శానిటైజర్లను ఉపయోగించచ్చు.. లేదంటే లిక్విడ్‌ సోప్‌, నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి నేరుగా ఆయా వస్తువులపై స్ప్రే చేసి.. వాడిపడేసే వైప్స్‌ (డిస్పోజబుల్‌ వైప్స్‌)తో తుడిచేస్తే సరి.. రోజూ ఇలా చేయడం వల్ల వాటిపై చేరిన వైరస్‌ నశించిపోవడంతో పాటు దుమ్ము చేరకుండా కూడా జాగ్రత్తపడచ్చు.


‘హ్యాండిల్స్‌’తో జాగ్రత్త!

మనం ఎంత చెప్పినా పిల్లలు వినరు.. ఇతర వస్తువులతో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండానే ఫ్రిజ్‌ డోర్‌ ఓపెన్ చేస్తుంటారు. అలాగే కొందరు తినే చేతులతోనే ఫ్రిజ్‌ హ్యాండిల్‌ పట్టుకొని లాగుతుంటారు. వీళ్లే కాదు.. ఎక్కువ సమయం వంటింట్లో గడిపే మనం కూడా తడి చేతులతోనే కిచెన్‌ క్యాబినెట్‌ హ్యాండిల్స్‌ పట్టుకోవడం, మైక్రోవేవ్‌ డోర్‌ ఓపెన్‌ చేయడం, కాయగూరలు కట్‌ చేసిన చేతులతోనే కుళాయి తిప్పేయడం.. ఇలా మనకు తెలియకుండానే చేసేస్తుంటాం. తద్వారా మన చేతుల మురికి, జిడ్డుదనం వాటిపైకి చేరుతుంది. అందరూ వాటినే తాకడం వల్ల అవి వైరస్‌, ఇతర క్రిములకు ఆలవాలంగా మారతాయి. కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని వాటిని రోజూ శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.

ఎలా శుభ్రం చేయాలి?

ఇందుకోసం బయటదొరికే శానిటైజర్‌ స్ప్రేలను ఆయా వస్తువులపై స్ప్రే చేసి డిస్పోజబుల్‌ వైప్స్‌తో తుడిచేయచ్చు.. లేదంటే క్రిమిసంహారక వైప్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటితో నేరుగా ఆయా వస్తువుల్ని శానిటైజ్‌ చేస్తే సరిపోతుంది. అయితే తుడిచిన వెంటనే మళ్లీ వాటిని తాకడం కాకుండా.. అవి పూర్తిగా ఆరిపోయేంత వరకు తాకకుండా ఉంటేనే మంచిది. ఇక, కిచెన్‌ సింక్‌, వాష్‌బేసిన్‌ దగ్గర ఉండే ట్యాప్స్‌ను లిక్విడ్‌ సోప్‌, వేడి నీళ్లతో క్లీన్‌ చేయడం ఉత్తమం.


ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్

ఒక పూట ఆకలేసినా భరిస్తామేమో కానీ.. ఒక క్షణం మన అరచేతిలో ఫోన్‌ లేకపోతే కిందా మీదా పడిపోతాం. మొబైల్‌ మన జీవితంలో అంతలా అంతర్భాగమైపోయింది. ఇదొక్కటే కాదు.. ల్యాప్‌టాప్‌, టీవీ-టీవీ రిమోట్‌, ఏసీ రిమోట్‌, కీబోర్డ్‌.. ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్‌ పరికరాల్ని మనం రోజూ తాకుతూనే ఉంటాం. ఇంట్లో ఉన్న వాళ్లు, బయటి నుంచి వచ్చిన వాళ్లు వీటినే పదే పదే తాకడం అస్సలు శ్రేయస్కరం కాదు.. అందుకే వీటిని తరచూ క్లీన్ చేస్తుండాలి.

ఎలా శుభ్రం చేయాలి?

అలాగని అన్ని వస్తువులపై స్ప్రే చేసినట్లే వీటిపైనా క్రిమిసంహారక ద్రావణాన్ని స్ప్రే చేస్తానంటే కుదరదు. ఒక కాటన్‌ క్లాత్‌పై శానిటైజర్‌ స్ప్రే చేసి.. దాంతో ఆయా ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని తుడవడం ఒక పద్ధతి.. లేదంటే బయట నేరుగా దొరికే క్రిమిసంహారక వైప్స్‌తో వీటిని శుభ్రం చేయడం మరో పద్ధతి. ఇలా మీకు ఎలా వీలైతే అలా వీటిని శుభ్రపరచాలి.


స్విచ్‌ బోర్డ్స్

మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల్లో స్విచ్‌ బోర్డ్స్‌ కూడా ఒకటి. కొంతమంది బయటికి వెళ్లొచ్చాక చేతులు కడగకుండానే వాటిని తాకుతుంటారు. అవే స్విచ్‌లను ఇంట్లో ఉండే వాళ్లు కూడా తాకుతూ.. ఇతర వస్తువుల్ని ముట్టుకోవడం వల్ల అంతా గందరగోళంగా మారుతుంది. మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే వైరస్‌ వ్యాప్తికి కారణమవుతాయి. కాబట్టి కాస్త సమయం వెచ్చించి స్విచ్‌ బోర్డ్‌లను రోజూ క్లీన్‌ చేస్తుండాలి.

ఎలా శుభ్రం చేయాలి?

శానిటైజర్‌ని ఒక కాటన్‌ క్లాత్‌ లేదా వైప్స్‌పై వేసి దాంతో స్విచ్‌ బోర్డులను తుడిచేయచ్చు. అయితే ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువ ద్రావణాన్ని స్ప్రే చేస్తే అది సాకెట్‌ లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.


టేబుల్స్

లివింగ్‌ రూమ్‌లో టీపాయ్‌, డైనింగ్‌ హాల్‌లో డైనింగ్‌ టేబుల్‌, ఆఫీస్‌ సెటప్‌ చేసుకున్న టేబుల్‌, పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్‌, బెడ్‌రూమ్‌లో డ్రస్సింగ్‌ టేబుల్‌.. ఇలా ఇంట్లో ఎన్నో టేబుల్స్‌ ఉంటాయి. ఆయా పనుల రీత్యా వీటిని కూడా మనం పదే పదే తాకుతుంటాం. కాబట్టి రోజూ వాడుకునే ముందు, తర్వాతా వీటిని శుభ్రం చేయాల్సిందే!

ఎలా శుభ్రం చేయాలి?

ఇందుకోసం శానిటైజర్‌ స్ప్రేలు లేదంటే ఇంట్లో తయారుచేసుకున్న బ్లీచ్‌ ద్రావణాన్ని ఉపయోగించచ్చు. రెండున్నర టేబుల్‌స్పూన్ల బ్లీచ్‌ని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఆపై దాన్ని బాగా షేక్‌ చేస్తే బ్లీచింగ్‌ ద్రావణం తయారవుతుంది. దీన్ని క్రిమిసంహారక ద్రావణంగా వాడుకోవచ్చు. ఈ ద్రావణాన్ని నేరుగా టేబుల్‌ ఉపరితలంపై స్ప్రే చేసి కాటన్‌ వస్త్రంతో తుడిచేసుకోవాలి.


లాండ్రీ బాస్కెట్

రోజూ మనం వృత్తిరీత్యా, ఇతర పనుల కారణంగా బయటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చాక ఎవరి దుస్తులు వారు ఉతుక్కుంటున్నాం. మరి, ఇంట్లో వేసుకున్న దుస్తులు లాండ్రీ బాస్కెట్‌లో వేసి రెండు మూడు రోజులకోసారి ఉతకడం కామనే! బట్టలు సరే.. మరి బాస్కెట్‌ సంగతో! దాన్ని కూడా రెండు మూడు రోజులకోసారి శుభ్రం చేయాల్సిందే! ఎందుకంటే మన దుస్తులపై ఉండే మురికి దానికి అంటుకొని కొన్ని రోజులకు అది జిడ్డుగా మారే అవకాశం ఉంటుంది. ఫలితంగా దానిపై క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌.. వంటివి చేరతాయి. అందుకే వారానికి రెండుసార్లు లాండ్రీ బాస్కెట్‌ని క్లీన్‌ చేయడం చాలా మంచిది.

ఎలా శుభ్రం చేయాలి?

ముందు సబ్బు నీటితో ఈ బాస్కెట్‌ను శుభ్రం చేసి.. ఆపై శుభ్రమైన నీటితో మరోసారి క్లీన్‌ చేయాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆరేంత వరకు ఎండలో ఆరబెట్టాలి.

ఇవి గుర్తుంచుకోండి!

అసలే సమయం లేదు.. క్లీన్‌ చేసేయాలన్న హడావిడితో కాకుండా.. ఆయా వస్తువుల్ని శుభ్రం చేసే ముందు కొన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

* వస్తువులను శుభ్రం చేసే ముందు ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు వేసుకోవడం మర్చిపోవద్దు.

* క్లీనింగ్‌ ప్రక్రియ కోసం బయట దొరికే డిస్పోజబుల్‌ వైప్స్‌ లేదా టిష్యూ పేపర్లను ఉపయోగించడం మంచిది. అది కుదరని పక్షంలో శానిటైజ్‌ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు మూడు కాటన్‌ క్లాత్స్‌ని పక్కన పెట్టుకోండి. రోజుకొకటి చొప్పున వాడుతూ.. దాన్ని వేడినీళ్లు-డిటర్జెంట్‌లో నానబెట్టి ఉతికేయడం మంచిది. అలాగే కాటన్‌ క్లాత్‌తో తుడిచేటప్పుడు కూడా క్లాత్‌ని మడుస్తూ, మరోవైపు తిప్పుతూ తుడవడం ఉత్తమం.

* ప్రతిసారీ వస్తువుల్ని తుడిచే ముందు, తర్వాత చేతుల్ని హ్యాండ్‌ శానిటైజర్‌తో 20 సెకన్ల పాటు రుద్ది మరీ కడగడం మర్చిపోకండి.

* ఇక ఈ క్రమంలో మనం వాడిన డిస్పోజబుల్‌ వైప్స్‌ని మూత ఉన్న చెత్తడబ్బాలో పడేయడం మంచిది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని