ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా? - how can change his behavior in telugu
close
Updated : 21/10/2021 20:31 IST

ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?

అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.

నా పేరు కీర్తన. నాకు పెళ్లయి మూడేళ్లవుతోంది. నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. నాది ఒక విచిత్రమైన సమస్య. మాది ప్రేమ వివాహం. నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో కళాశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. అందుకే కల్చరల్ ఈవెంట్స్ టీంలో సభ్యురాలిగా చేర్చుకున్నారు. మా బృందానికి బాలు లీడర్. చెరగని చిరునవ్వుతో హుందాతనానికి మరో రూపులా ఉండేవాడు. చాలా తక్కువగా మాట్లాడేవాడు. చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పేవాడు. మేం చేయాల్సిన పనులను సమయానికి పూర్తయ్యేలా ప్లాన్ చేసేవాడు. కేవలం ప్లానింగ్ వరకే తను ఆగిపోలేదు. మా వెంటపడి మరీ మాకప్పగించిన పనులను పూర్తి చేయించేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలోనే మా ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది.

బాలు తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. వాటిని మీరి ఎప్పుడూ ఏ పనీ చేసేవాడు కాదు. ఒకసారి కాలేజీలో వక్తృత్వ పోటీ ఏర్పాటు చేశారు. అందులో ఎవరు, ఏ అంశం మీదైనా మాట్లాడొచ్చు. కానీ దాని వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలి. అందులో మా భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలి. పైకి చాలా సింపుల్‌గా కనిపిస్తున్నా ఇది కాస్త కష్టమైనదే. మా కాలేజీలో ఎప్పుడు వక్తృత్వ పోటీలు పెట్టినా.. ఎక్కువ మందే పాల్గొనేవారు. ఆరోజు మాత్రం పట్టుమని పదిమంది కూడా మాట్లాడలేదు. కానీ బాలు ఇచ్చిన ఉపన్యాసం మాత్రం అందర్నీ కట్టిపడేసింది. తనకున్న ఆదర్శభావాలు.. సమాజం పట్ల తన ఆలోచనలు.. భవిష్యత్తులో తాను చేయాలనుకుంటున్న మంచి పనుల గురించి వివరించాడు. అంతే అప్పటి నుంచీ తను మా కాలేజీలో ఒక స్త్టెల్ ఐకాన్‌గా మారిపోయాడు. కొందరైతే అతను చెప్పిన మాటలను ఆచరించడం కూడా మొదలు పెట్టేశారు.అలా అందరిలోనూ తను ప్రత్యేకం అనిపించడంతో పాటు రోజురోజుకీ తన మీద ఇష్టం పెరగడం మొదలైంది.

ఇలా రోజులు గడుస్తుండగానే కాలేజీ ఫేర్‌వెల్‌డే దగ్గరికి వచ్చేసింది. ఇక ఆలస్యం చేస్తే బాలుకి నా ప్రేమ గురించి చెప్పే అవకాశం ఉండదని భావించాను. అందుకే ఈ విషయం గురించి తనతో ఎలాగైనా మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. కానీ చిత్రంగా అదే రోజు బాలు నాతో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పాడు. ఎగిరిగంతేసినంత పని చేశాను. నన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని.. ఉద్యోగం వచ్చిన వెంటనే మా ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఆరునెలల తర్వాత మా ఇంటికి వచ్చాడు. మా పెద్దల్ని పెళ్లికి ఒప్పించాడు. పైసా కట్నం కూడా తీసుకోలేదు. మంచి అల్లుడు దొరికాడని మా అమ్మానాన్న సంబరపడ్డారు. అలా మరో ఆరు నెలల తర్వాత మా పెళ్లి చాలా ఘనంగా జరిగింది.

మా అత్తారింట్లో కూడా నన్ను బాగా చూసుకున్నారు. నా సంతోషానికి పగ్గాలు వేయడం ఎవరి తరం కాలేదు. మంచి భర్త, మంచి కుటుంబం అని సంబరపడిపోయాను. కానీ రెండు నెలలు కూడా తిరక్కుండానే.. నా ఆశలు అడియాసలయ్యాయి. బాలు ఉద్యోగం చేసే కంపెనీలోనే నేను కూడా ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇద్దరం రోజూ ఆఫీసుకి కలిసే వెళ్లేవాళ్లం. అయితే విధి నిర్వహణలో భాగంగా తోటి ఉద్యోగులతో మాట్లాడాల్సి వచ్చేది. కానీ బాలు దానికి ఒప్పుకొనేవాడు కాదు. తనతో తప్ప ఏ మగాడితోనూ మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేవాడు. కొత్తలో ఈ మాటలు విని నా మీద ఉన్న ప్రేమకు సంబరపడిపోయేదాన్ని. కానీ రాన్రాను.. ఆ ప్రేమే నన్ను ఓ బందీలా మార్చేసింది. చివరకు ఫోన్లో కూడా ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. నా సెల్‌ఫోన్ తన దగ్గరే పెట్టుకొని ముందు తను మాట్లాడి ఆ తర్వాతే నాకు ఇస్తాడు. సరదాగా షాపింగ్‌కి వెళ్లినా ఇదే తంతు. ఇలా క్రమక్రమంగా బాలు మనసులో నాకు తెలియకుండానే నా పై ఉన్న ప్రేమ స్థానంలో అనుమానం వచ్చి చేరింది. అనుక్షణం నా మీద నిఘా పెట్టడం మొదలు పెట్టాడు. ఇదంతా ఇబ్బందిగా అనిపించి ఉద్యోగం మానేస్తానంటే అదీ కుదరదట. ఇరవైనాలుగ్గంటలూ తన కళ్ల ముందే ఉండాలట. ఇదంతా చూస్తుంటే తనని ప్రేమించి నేనేమైనా తప్పు చేశానా? అనే భావన కలుగుతోంది.

చదువుకునే రోజుల్లో అతనిలోని ఆదర్శభావాలు, ఉన్నతమైన ఆలోచనలు చూసి అతన్ని ప్రేమించాను. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయాయో తెలీడం లేదు. కేవలం నా విషయంలో మాత్రమే అతను అలా ప్రవర్తిస్తున్నాడు. ఈ అనుమాన జాడ్యం తప్ప బాలుకి మరే చెడ్డ అలవాట్లు లేవు. నా మీద ఉన్న అతి ప్రేమే తను ఇలా ప్రవర్తించడానికి కారణం. కానీ దానివల్ల నా ఆత్మాభిమానం దెబ్బతింటుందన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నాడు. ఈ విషయం గురించి తనతో ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం కనిపించలేదు. ఒకట్రెండు రోజులు బాగానే ఉన్నా తర్వాత పరిస్థితి మామూలైపోతుంది. ఎప్పటికైనా తనలో మార్పు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నా..

జీవితంలో ప్రతిదానికీ హద్దులుంటాయి. అలాగే ప్రేమకి కూడా. అలా హద్దులు మీరిన ప్రేమే ఇప్పుడు నా భర్త మనసులో అనుమానంగా మారింది. దానివల్ల నష్టాలే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అవతలి వ్యక్తి ఆత్మాభిమానం సైతం దెబ్బ తీయడం వల్ల బంధాలు బీటలు వారే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం మా పరిస్థితి ఇలాగే ఉంది.. ఈ క్రమంలో ఏం చేయాలో అర్ధం కావడం లేదు.. ఒక్క అనుమాన జాడ్యం తప్ప నా భర్తతో మరే సమస్యా లేదు.. అందుకే ఓ పక్క ఈ బంధాన్ని వీడలేకపోతున్నాను.. అలాగని అతని ప్రవర్తనని సహించలేకపోతున్నాను.. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో మీరైనా చెప్తారా?? 

ఇట్లు,

కీర్తన.


Advertisement


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని