Financial Abuse: ఆ విషయంలో మోసపోయారా? - how to recover from financial abuse in telugu
close
Published : 26/08/2021 19:36 IST

Financial Abuse: ఆ విషయంలో మోసపోయారా?

లలితకు ఆర్థిక అవగాహన తక్కువ. అందుకే తన డబ్బు నిర్వహణ బాధ్యతలన్నీ ఆమె భర్త చేతిలో పెట్టి చేతులు దులుపుకొంది. అదే అదనుగా భావించిన అతను ఆమె ఖాతాల్ని ఇష్టారీతిన వాడుకుంటుండడంతో నాలుక్కర్చుకుందామె.

భర్తపై నమ్మకంతో తన బ్యాంకు ఖాతాలన్నీ అతనికే అప్పచెప్పింది గీతిక. ఈ మధ్య తన ఖాతాల్లోంచి విచ్చలవిడిగా డబ్బు ఖర్చవుతుండడంతో భర్తను నిలదీసిందామె. ఇక ఇద్దరి మధ్య గొడవలు మొదలు!

అవగాహన లోపమో లేదంటే అంతా ఆయన చూసుకుంటారన్న అతి విశ్వాసమో.. కొంతమంది మహిళలు తమ డబ్బు నిర్వహణ బాధ్యతలు తమ భర్తల చేతుల్లో పెడుతుంటారు. అయితే మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మీకు తెలియకుండానే ఖాతాల్లోంచి వేలకు వేలు మాయమవడం, మిమ్మల్ని వారి గుప్పిట్లో పెట్టుకొని డబ్బు విషయంలో హింసించడం, మీ పేరిట ఉన్న ఆస్తిపాస్తుల్ని వారి అధీనంలోకి తెచ్చుకోవడం.. ఇలా ‘పేరుకు మాత్రమే డబ్బు మీది.. ఎక్కడ వాడాలి? ఎలా వాడాలన్న విషయం మాత్రం అవతలి వారిదే!’ అన్నట్లుగా తయారవుతుంది పరిస్థితి. దీన్నే ‘Financial Abuse’గా పేర్కొంటున్నారు నిపుణులు.

ఎవరైనా హింసించచ్చు!

ఒక్క భర్త మాత్రమే ఇలా చేస్తారని కాదు.. మీ ఖాతాలన్నీ కుటుంబంలో ఎవరి చేతిలో పెట్టినా ఇలాంటి ప్రమాదం తలెత్తే అవకాశాలూ లేకపోలేదు. అందుకే ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో డబ్బు నిర్వహణ గురించి కనీస అవగాహన పెంచుకోమంటున్నారు. మరి, ఇది వరకే ఈ ఉచ్చులో పడిపోయి పలు సవాళ్లను ఎదుర్కొంటోన్న వారూ ఎంతోమంది ఉండి ఉండచ్చు. అలాంటి వారు ఈ ఊబిలోంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..!

అసలెలా గుర్తించాలి?

బ్యాంకు ఖాతాలు, ఆస్తిపాస్తులు ఎదుటివారి చేతిలో పెట్టి మహిళలు తాము మోసపోయామని గుర్తించాలంటే.. ఎదుటివారి ప్రవర్తన ద్వారా ఇది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు.

* మీరు చేతి నిండా సంపాదిస్తున్నా అది చూసి ఓర్వలేక.. లేదంటే ఆర్థికంగా మీరు వారి కంటే ఓ మెట్టు పైనున్నా సహించలేక.. మిమ్మల్ని ఎలాగైనా ఉద్యోగం మాన్పించాలన్న ఆలోచనలో ఉంటారు వారు. ఇదే ఉద్దేశంతో మిమ్మల్ని పదే పదే హింసిస్తుంటారు.

* ఆఫీస్‌లోనైనా/ఇంటి నుంచైనా.. మిమ్మల్ని ప్రశాంతంగా పనిచేసుకోకుండా మాటలు/చేతలతో హింసించడం, మానసికంగా కుంగదీయడం.. వంటివి చేస్తుంటారు.

* అవసరానికి మీకు డబ్బులు ఇవ్వకపోవడం, మీ బ్యాంక్‌ ఖాతాలు, ఆస్తిపాస్తులు పూర్తిగా తమ అధీనంలోకి మార్చుకోవడం.. వంటివి చేస్తారు.

* ఒక్కోసారి మీకు అవసరమైన మొత్తం కంటే తక్కువ డబ్బిచ్చి ఇందులోనే ఖర్చులన్నీ పూర్తి చేసుకోవాలన్న నియమం పెట్టే వారూ లేకపోలేదు. ఇదీ ఓ రకంగా హింసే!

* వాళ్లు మాత్రం మీ డబ్బుతో జల్సాలు చేసి.. మీరు పెట్టే ఖర్చుల్ని భూతద్దంలో చూడడం, రసీదులు చూపించమనడం వంటివి చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు.

* డబ్బు మీదే.. కానీ మీ ప్రమేయం లేకుండా, మీ నిర్ణయం తీసుకోకుండా ఆ డబ్బుని ఇష్టారీతిన ఖర్చు పెడుతుంటారు.

* మీ గుర్తింపు కార్డులను దొంగిలించడం లేదంటే మోసపూరితమైన ట్యాక్స్‌ రిటర్న్స్‌ని మీ పేరుకు అనుసంధానించడం.. వంటివి చేస్తుంటారు.

* మీ ప్రమేయం లేకుండానే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు అమ్మేయడం లేదంటే తన పేరు మీదకు మార్చుకోవడం.. వంటివి చేసే వారూ లేకపోలేదు.

* మీ పేరుతో తప్పుడు బీమా క్లెయిమ్స్‌ దాఖలు చేయడం.

* మీరు ఏ ఖర్చులు పెట్టాలన్నా తన దగ్గర చేయి చాచేలాంటి పరిస్థితి తీసుకురావడం.

* ఇష్టారీతిన రుణాలు తీసుకోమని మిమ్మల్ని బలవంతం చేయడం..

ఇవన్నీ ఆర్థిక హింస కిందకే వస్తాయి.

 

దీన్నుంచి బయటపడలేమా?!

డబ్బు విషయంలో ఇంట్లో వాళ్లనే నమ్మొద్దని చెబుతుంటారు పెద్దలు. ఎందుకంటే ఎలాంటి అనుబంధాలనైనా విడదీసే మత్తు మందు ఇది. అందుకే డబ్బు నిర్వహణ బాధ్యతలన్నీ మహిళలు ఎవరికి వారే చూసుకోవడం మంచిది. ఒకవేళ ఈ హింసను ఎదుర్కొంటున్న వారు దీన్నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

* ఇప్పటిదాకా కోల్పోయిన డబ్బు గురించి బాధపడడం కంటే ఇక ముందు అలా జరగకుండా జాగ్రత్తపడడం మంచిది. ఈ క్రమంలో సదరు బ్యాంకును సంప్రదించి కార్డులు బ్లాక్‌ చేయించడం, పిన్‌ మార్పించడం, మీ పర్సనల్‌ కంప్యూటర్‌/మొబైల్స్‌లో లాగిన్‌ ఐడీలు/పాస్‌వర్డులు మార్చేయడం.. వంటివి వెంటనే చేసేయాలి.

* మీ పేరు మీదున్న క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణాలు.. సమయానికి చెల్లించకుండా ఉంటే వాటిని వచ్చే నెల జీతంతో తీర్చేసి ఆయా కార్డుల్ని బ్లాక్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్త కార్డులు తీసుకున్నా ఆ వివరాలేవీ సదరు వ్యక్తికి తెలియకుండా జాగ్రత్తపడాలి.

* PAN, ఆధార్‌, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, మీ స్టడీ సర్టిఫికెట్స్‌.. వంటివన్నీ ఎదుటి వ్యక్తికి తెలియకుండా రహస్యంగా దాచుకోవడం మంచిది.

* మీ ప్రమేయం లేకుండా సొంతం చేసుకున్న మీ ఆస్తిపాస్తులు తిరిగి ఇవ్వమని వారిని ఓ మాట అడిగి చూడండి.. ససేమిరా అంటే మాత్రం చట్టబద్ధంగా ముందుకెళ్లడానికీ వెనకాడకండి.

* ఆర్థిక హింస కూడా గృహ హింస కిందకే వస్తుందని చట్టం చెబుతోంది. అందుకే ఎదుటివారిపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌ని సంప్రదించచ్చు.

* ఇంత జరిగాక మానసికంగా ఎంతగానో కుంగిపోతాం.. కాబట్టి ఈ హింసను మీలోనే దాచుకోకుండా మీ కుటుంబ సభ్యులతో పంచుకొని వారి సలహాలు తీసుకోవచ్చు.. లేదంటే మానసిక నిపుణుల్నీ సంప్రదించి కౌన్సెలింగ్‌ తీసుకున్నా ఫలితం ఉంటుంది.

మరి, మీరెప్పుడైనా ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారా? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీరిచ్చే సలహాలు ఎంతోమందికి ఈ సమస్య నుంచి బయటపడే దారి చూపిస్తాయి.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని