నా భర్త హోమోసెక్సువల్... అందుకే అలా చేశా! - i divorced my husband so that he can spend life with his gay friend explains an woman
close
Published : 02/10/2021 11:28 IST

నా భర్త హోమోసెక్సువల్... అందుకే అలా చేశా!

'నేను తప్పు చేశానని నాకు తెలుసు.. కానీ ఆ విషయం చెప్పాలంటే నాకు ధైర్యం చాల్లేదు. అందుకే ఇన్నాళ్ల నుంచీ మౌనంగా ఉండిపోయా. నిన్ను ఇబ్బందిపెట్టా.. నన్ను క్షమించు.. కావాలంటే నువ్వు నాకు విడాకులు ఇవ్వొచ్చు..' అంటూ రాహుల్ నన్ను అభ్యర్థిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక అలాగే కూలబడిపోయాను. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. ఉదయాన్నే లేచి విడాకులు తీసుకోవాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నా.. ఇది తన మీద కోపంతో కాదు.. ప్రేమతో తీసుకున్న నిర్ణయం.. ఇప్పటికైనా తనకు నచ్చిన జీవితాన్ని తను గడిపే అవకాశాన్ని ఇచ్చేందుకు నా వంతుగా నేను చేసే చిన్న ప్రయత్నం ఇది..ఇదంతా చూస్తుంటే.. భర్త సంతోషం కోసం తనకు విడాకులు ఇవ్వడమేంటి? అనిపిస్తోంది కదూ.. అదెందుకో తెలియాలంటే మీకు నా కథ తెలియాల్సిందే..

నా పేరు కీర్తన.. మాది బెంగళూరులో స్థిరపడిన కుటుంబం. మా అమ్మ మరాఠీ.. నాన్న తెలుగువారు.. ఇద్దరూ బెంగళూరులో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమించుకొని పెళ్లాడారు. తమ ప్రేమకు పెద్దవాళ్ల అనుమతి తీసుకొని మరీ పెళ్లి చేసుకోవడంతో మాకు ఇరు కుటుంబాలతో ప్రేమతో పాటు.. రెండు సంప్రదాయాల గురించి కూడా తెలిసేది. నాతో పాటు ఓ తమ్ముడు కూడా. ఇద్దరం టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకున్నా.. ఒకరు లేకపోతే మరొకరు ఉండలేం.. అంత ప్రేమ ఒకరంటే ఒకరికి.. ఇలా సంతోషంగా జీవించే కుటుంబం మాది. నేను ఎంబీయే పూర్తిచేశాక ఓ చిన్న స్టార్టప్‌ని ప్రారంభించా. ఆ పనిలో బిజీగా ఉండగానే అమ్మానాన్నలు నా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. నేను ఎవరినీ ప్రేమించలేదు కాబట్టి నాకు వరుడిని చూసే బాధ్యత వాళ్ల మీదే పెట్టేశా. ఆరు నెలల పాటు వెతికి కొన్ని సంబంధాలు ఫైనల్ చేశారు అమ్మానాన్న. వాళ్లందరినీ కలిసిన తర్వాత నాకు నచ్చిన రాహుల్‌తో పెళ్లికి సరేనన్నా. అమ్మానాన్న కూడా ఎంతో సంతోషించారు. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.

రాహుల్‌ది మరాఠీ నేపథ్యం ఉన్న సంప్రదాయ కుటుంబం. వాళ్ల అమ్మానాన్న పుణెలో ఉంటే.. తను ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాడు. దాంతో నేను పెద్దగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం రాలేదు. పెళ్లి తర్వాత పదిహేను రోజులు పుణెలో ఉండి తిరిగొచ్చాం. ఈ పదిహేను రోజులు నన్ను మా అత్తగారు ఎంతో ప్రత్యేకంగా చూస్తుంటే ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. రాహుల్ కూడా బాగానే మాట్లాడేవాడు. తను చాలా రిజర్వ్‌డ్ టైప్ అని.. కొత్తవాళ్లతో కలిసిపోయేందుకు కాస్త సమయం పడుతుందని వాళ్ల అమ్మ, చెల్లి చెప్పడంతో నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బెంగళూరుకు తిరిగొచ్చినా తన ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు..

*****

బెంగళూరుకు వచ్చేశాక మేమిద్దరం కలిసి రాహుల్ ఆఫీస్‌కి దగ్గర్లో ఓ ఫ్లాట్ తీసుకున్నాం. ఆ ఇంటికోసం ఇంటీరియర్స్ అన్నీ ఎంతో ఇష్టపడి కొన్నా. నా పొదరిల్లును ప్రేమతో అలంకరించుకున్నా.. ఇక మొత్తం ఆనందమే అనుకున్నా.. కానీ అదే నా జీవితంలో కరువైంది. రాహుల్ మిగిలిన అన్ని విషయాల్లోనూ మామూలుగానే ఉండేవాడు. కానీ పెళ్లయిన ఆరు నెలలకు కూడా నన్ను దగ్గరికి రానివ్వలేదు. నన్నో స్నేహితురాలిగా చూసేవాడే తప్ప.. ప్రేమగా ముద్దులివ్వడం, సరసాలు, చిలిపి మాటలు ఇవేవీ మా మధ్య లేవు. పెళ్త్లెన కొత్తలో భార్యాభర్తల అనుబంధం గురించి నేను వూహించుకున్నవన్నీ వూహలుగానే మిగిలిపోతున్నాయని చాలా బాధగా అనిపించేది. దగ్గరయ్యేందుకు ఇబ్బంది పడుతున్నాడేమో.. కొన్నాళ్త్లెతే తనే సర్దుకుంటాడు అని చాలా కాలం వేచి చూశాను. ఆ తర్వాత ఓరోజు కోపం తట్టుకోలేక అడిగేశా.. దీంతో తనకు శృంగారమంటే పెద్దగా ఆసక్తి లేదని.. అందుకే ఇలా దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. నాకేం చేయాలో పాలుపోలేదు. నాతో పాటు పనిచేసే నా స్నేహితురాలి సలహా మేరకు తనని మంచి డాక్టర్‌కి చూపించాలనే నిర్ణయానికి వచ్చా. ఇక పెళ్త్లెన జంటల మధ్య ఉండే చిలిపి గిల్లికజ్జాలు మా మధ్యా మొదలవుతాయన్న ఆనందంతో ఆరోజు మధ్యాహ్నమే ఇంటికి వెళ్లిపోయా.

*****

కింద పార్కింగ్‌లో తన కారు చూసి ఎంతో ఆనందంగా ఈ విషయం తనకు చెప్పాలని గంతులేస్తూ పైకి వెళ్లాను. అయితే చాలాసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో నా దగ్గరున్న కీతో తలుపు తెరచుకొని నేనే లోపలికి వెళ్లాను. బెడ్‌రూం తలుపు కొద్దిగా వేసి ఉండడంతో తను పడుకున్నాడేమో అనుకుంటూ లోపలికి వెళ్లిన నేను అక్కడ కనిపించిన దృశ్యం చూసి హతాశురాలినైపోయా. బెడ్‌పై రాహుల్ మరో అబ్బాయితో కలిసి ఉన్నాడు. నన్ను చూసి వాళ్లిద్దరూ భయపడిపోయారు. వెంటనే నేను హాల్లోకి వచ్చేశా. ఆ అబ్బాయి డ్రస్ మార్చుకొని బయటకు వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి రాహుల్‌తో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. దీంతో రెండు రోజుల పాటు మా మధ్య మౌనం రాజ్యమేలింది. ఆ తర్వాత రోజు రాహుల్ నాకు ఫోన్ చేసి మాట్లాడాలని ఇంటికి పిలిచాడు. అప్పుడే తన మనసులోని మాటను బయటపెట్టాడు. అది విన్న తర్వాత ఇన్నాళ్లపాటు నేను కట్టుకున్న ప్రేమ పొదరిల్లు కళ్లముందే కూలిపోయినట్లుగా అనిపించింది.

'నేను గేని.. నాకు అమ్మాయిలంటే ఆసక్తి లేదు. అబ్బాయిలనే ప్రేమిస్తాను. అందుకే ఇన్నాళ్లూ నిన్నో మంచి స్నేహితురాలిగా భావించగలిగానే తప్ప ప్రేమించలేకపోయా. పెళ్లి చేసుకొని నిన్ను ఇబ్బందిపెట్టడం నాకూ పెద్దగా ఇష్టం లేదు. కానీ మా అమ్మ నేను వివాహం చేసుకోకపోతే తను నిద్రమాత్రలు మింగి చచ్చిపోతానని నన్ను బెదిరించింది. తన మీద ఉన్న ప్రేమతో తన మాట కాదనలేకపోయాను. నీకు నేను చాలా అన్యాయం చేశానని నాకు తెలుసు. అది నన్ను ఇన్ని నెలల నుంచి నిద్ర లేకుండా చేస్తోంది. కానీ ఇది నేను కావాలని చేసినది కాదు.. నేను గే అని తెలిస్తే సమాజం ఏమంటుందో అని మా అమ్మానాన్న భయపడ్డారు. పెళ్లి చేస్తే నేను మారతానేమో అనుకున్నారు. నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నా శాయశక్తులా ప్రయత్నించాను. ఇప్పటికీ నీ జీవితం పాడవకుండా ఉండేందుకు నువ్వేం చెప్పినా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. కావాలంటే నువ్వు నేను గే అని చెప్పి.. నాకు విడాకులిచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా..' అంటూ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు రాహుల్.

*****

ఆరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. ఒక్క రాత్రి అంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కళ్లముందే నేను అన్ని రోజులు కన్న కలలన్నీ నాశనమైపోతుంటే కళ్లవెంట నీళ్లు ధారలై కారాయి. ఏడవడం తప్ప నేనేం చేయలేకపోయా. ఉదయాన్నే ఓ నిర్ణయానికి వచ్చా. జరిగినదానిలో రాహుల్ తప్పు లేదని చెప్పలేను. అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆశతో తను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. సమస్యంతా సమాజంతోనే అనిపించింది. అందుకే సమాజానికి ఎదురు నిలిచేందుకు నిర్ణయించుకున్నా. రాహుల్‌కి విడాకులిచ్చి.. అతడికి తన స్నేహితుడితో పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చా. ఎప్పుడూ తన మనసుకు నచ్చే మంచి స్నేహితురాలిగా ఉండేందుకు సిద్ధమయ్యా. నా నిర్ణయం సమాజానికే కాదు.. రాహుల్ కుటుంబానికి కూడా నచ్చకపోవచ్చు. కానీ నేను ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది..

ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే.. హోమోసెక్సువలిజం తప్పు కాదని సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంది. కానీ మనం మాత్రం ఇంకా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. హోమోసెక్సువల్ అనగానే వాళ్లేదో వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తుల్లా చూడడం మానేసి.. వాళ్లనీ మనుషులుగానే గుర్తించండి. ముఖ్యంగా మీ పిల్లలు హోమోసెక్సువల్ అయితే పెళ్లితో వారిలో మార్పొస్తుందని చెప్పి వారికి బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించకండి. దీనివల్ల మీరు మీ పిల్లల జీవితంతో పాటు మరో కొత్త వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేసినవారవుతారు. అయితే రాహుల్ విషయంలో నేను మరికొంతకాలం వెయిట్ చేసి ఉండాల్సిందని, తొందరపడి వివాహ బంధం తెంచుకున్నానని ఇప్పటికీ కొంతమంది అంటుంటారు.. మరి తన విషయంలో నేను చేసిన పని కరక్టా, కాదా? మీరేమంటారు??

ఇట్లు,

కీర్తన


Advertisement


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని