తన డ్రస్‌తోనే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అలా చెప్పింది! - indian influencer raise awareness on breastfeeding at cannes film festival through her fashionable a
close
Published : 11/07/2021 12:24 IST

తన డ్రస్‌తోనే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అలా చెప్పింది!

ఆడవారు ఏం చేసినా అందులో తప్పులు వెతకడమే ఈ సమాజం పని. ఆఖరికి పుట్టిన బిడ్డకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడాన్ని కూడా ఓ వింతగా చూస్తుంది. దీంతో ఎవరేమనుకుంటారోనన్న మొహమాటంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు తమ బిడ్డలకు పాలివ్వడమే మానేస్తున్నారు కొందరు తల్లులు. అయితే ఎవరో ఏదో అంటారని మన కడుపున పుట్టిన బిడ్డను పస్తులుంచడం ఏమాత్రం సరికాదంటోంది భారతీయ ఇన్ఫ్లుయెన్సర్‌ దీపా బుల్లర్‌ ఖోస్లా. అమ్మతనం, బ్రెస్ట్‌ఫీడింగ్‌.. వంటి విషయాల్లో అవగాహన కల్పించేందుకు ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాన్ని వేదికగా చేసుకున్న ఆమె.. ఇదే థీమ్‌తో రూపొందించిన ఓ భిన్నమైన డ్రస్‌లో రెడ్‌కార్పెట్‌పై మెరిసింది. అమ్మతనానికి ఎలాంటి నియమనిబంధనలు లేవని చెప్పడానికే ఈ బ్రెస్ట్‌ఫీడింగ్‌ థీమ్‌తో రూపొందించిన డ్రస్‌ను ధరించానంటోన్న ఆమె ఆహార్యం ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

దీపా బుల్లర్‌ ఖోస్లా.. లైఫ్‌స్టైల్‌-ఫ్యాషన్‌ ఇన్ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. దిల్లీలో పుట్టి పెరిగింది. సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టిన ఆమెకు ఆరేళ్లున్నప్పుడే తన కుటుంబం ఊటీకి మకాం మార్చింది. అక్కడి బ్రిటిష్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకున్న ఆమెకు.. న్యాయవిద్యను అభ్యసించడంలో పూర్తి స్కాలర్‌షిప్‌ రావడంతో నెదర్లాండ్స్‌ వెళ్లింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి..!

ఫ్యాషన్‌, బ్యూటీ, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ట్రావెలింగ్‌.. ఇలా ఒకటా రెండా.. దాదాపు ప్రతి విషయంలోనూ అవగాహన ఉన్న ఆమె.. ఆయా అంశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటుంది. బోస్టన్‌కు చెందిన ఓలెగ్‌ బుల్లర్‌ ఖోస్లాను వివాహం చేసుకున్న ఆమె.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దువా అనే ముద్దులొలికే పాపకు జన్మనిచ్చింది. గర్భంతో ఉన్నప్పుడు తనకు ఎదురైన ప్రతి అనుభూతినీ ఇన్‌స్టా వేదికగా పంచుకున్న దీప.. అమ్మతనంలోని మాధుర్యాన్ని మించింది లేదంటోంది. తాజాగా ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడి రెడ్‌కార్పెట్‌పై ఓ ప్రత్యేకమైన డ్రస్‌లో మెరిసింది. బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రాధాన్యాన్ని చాటుతూ తాను ధరించిన డ్రస్‌ ప్రస్తుతం వైరలైంది.

అది ప్రసవ వేదన కన్నా గొప్పది!

బ్లాక్‌ అండ్‌ యెల్లో ఆఫ్‌-షోల్డర్‌ గౌన్‌ ధరించిన దీప.. తన డ్రస్సుకి రెండు బ్రెస్ట్‌ పంప్స్‌ని కూడా జత చేసింది. బహిరంగ ప్రదేశాల్లోనూ పిల్లలకు పాలివ్వడానికి ఏమాత్రం మొహమాట పడాల్సిన పనిలేదని, బ్రెస్ట్‌ పంప్స్‌ వంటి అధునాతన పరికరాలు ఉపయోగించడానికీ వెనకాడకూడదంటూ తన డ్రస్‌తో చెప్పకనే చెప్పిన ఈ బ్యూటీ.. ఇదే అటైర్‌లో అక్కడి రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. అనంతరం ఇవే ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో చెప్పుకొచ్చిందీ న్యూమామ్.

‘నా దృష్టిలో అమ్మతనం అంటే ప్రసవ వేదన కన్నా గొప్పది. పురిటినొప్పులకు ఓర్చుకొని బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చి మనం పొందే అమ్మతనంలోని కమ్మదనం, మాధుర్యం మరెందులోనూ దొరకదు. మన కడుపులో నలుసు పడినప్పట్నుంచే.. ఆ ప్రతిరూపం ఎలా ఉంటుందో తెలియకపోయినా అమితంగా ప్రేమిస్తాం.. ఇక బిడ్డ పుట్టాక ఎంతగానో మురిసిపోతాం.. ఆ చిన్నారి పూర్తి బాధ్యత తీసుకుంటాం.. కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటాం. ఈ క్రమంలో తల్లిగా బిడ్డకు ఏం కావాలో నిర్ణయించుకునే పూర్తి అధికారం మనకు ఉంటుంది.

అలా అనడానికి వాళ్లెవరు?!

కానీ కొంతమంది ‘నీ బిడ్డ విషయంలో నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్‌!’, ‘నువ్వు చేసేది తప్పు’ అంటూ మాట్లాడుతుంటారు. అది బయటివాళ్లు మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల దగ్గర్నుంచి కూడా కొత్తగా తల్లైన వారు ఇలాంటి మాటల్ని ఎదుర్కొంటున్నారు. ఈ మాటలన్నీ వారి మనసుల్లో నాటుకుపోయి అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నాయి. నిజానికి.. అమ్మతనం అంటే ఇలాగే ఉండాలి, బిడ్డను ఇలాగే పెంచాలి.. అన్న నియమనిబంధనలు ఎక్కడా లేవు. అలాంటప్పుడు ఎదుటివారి నిర్ణయాలను కొలమానాలుగా భావించాల్సిన పని లేదు. అమ్మతనంలో ప్రతి అనుభవం ఓ మధురానుభూతిని పంచుతుంది.. ఈ క్రమంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం.. ఓ తల్లిగా బిడ్డకు ఏం కావాలో మనకంటే బాగా ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఇతరులు అన్న విషయాలు పట్టించుకోకుండా, వారు అన్న మాటలకు బాధపడకుండా ఓ అమ్మగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి.

నాకూ అనుభవమే!

ఇలాంటి అనుభవాలు నేనూ ఎదుర్కొన్నా.. వాటివల్ల మనసుకు ఎంత బాధ కలుగుతుందో నాకూ తెలుసు.. అందుకే మీ గొంతుకగా ఆ బాధను అందరితో పంచుకోవడానికి ఇప్పుడిలా మీ అందరి ముందుకొచ్చా. నేను నా పాపకు పాలివ్వాలా, వద్దా అనేది నా స్వవిషయం. అందులో ఇతరులు కల్పించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. తల్లి పాలే పట్టాలని, బాటిల్‌ ఫీడ్‌ మంచిది కాదని.. ఇలా ప్రస్తుతం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మన సమాజంలో లెక్కలేనన్ని అభిప్రాయాలున్నాయి. అయితే అందరు తల్లుల విషయంలో అన్నీ వర్కవుట్‌ కాకపోవచ్చు.. కొంతమంది తల్లులు తమ బిడ్డలకు నేరుగా పాలివ్వలేకపోవచ్చు.. అలాంటప్పుడు వారిని నేరుగా ప్రశ్నించే హక్కు, అధికారం ఎక్కడా, ఎవరికీ లేదు. ఇదే విషయాన్ని నా కేన్స్‌ అటైర్‌ ద్వారా చెప్పాలనుకున్నా.. బ్రెస్ట్‌ఫీడింగ్‌, ఫార్ములా ఫీడింగ్‌.. ఎదిగే బిడ్డకు రెండూ ముఖ్యమే! ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి.. నేను ఎప్పుడైనా బ్రిజినెస్‌ ట్రిప్‌ మీద బయటికి వెళ్లాల్సి వస్తే.. అంతకంటే ముందే నా పాపకు సరిపడా పాలు బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో తీసి భద్రపరిచి వెళ్తాను.

అప్పుడే ఆ అనుభూతుల్ని పొందగలం!

కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే.. ఆన్‌లైన్‌లో అయినా, నేరుగానైనా ఇతరుల విషయంలో జోక్యం చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి.. వారికీ కొన్ని ఆలోచనలు, భావాలు ఉంటాయని అర్థం చేసుకోండి. దయచేసి మీ మాటలతో హాయిగా సాగిపోతోన్న ఆ తల్లీబిడ్డల ప్రయాణంలో అంతరాయం కలిగించకండి! కొత్తగా తల్లైన మహిళలు కూడా ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ చిన్నారి ఆలనా పాలనకే అధిక ప్రాధాన్యమివ్వండి. తద్వారా అటు అమ్మదనాన్ని ఆస్వాదించచ్చు.. ఇటు ఎన్నో మధురానుభూతుల్నీ సొంతం చేసుకోవచ్చు..’ అంటోంది దీప.

మహిళా సాధికారత కోసం కదిలింది!

తన బహుముఖ ప్రజ్ఞతో నాలుగు సార్లు ‘ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచిన దీప.. అంతకుముందు కేన్స్‌, వెనిస్‌.. వంటి ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లోనూ పాల్గొంది. పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. అంతర్జాతీయ పత్రికల కవర్ పేజీల పైనా దర్శనమిచ్చింది. అంతేకాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా సాధికారతపై తన గళాన్ని వినిపించే ఈ సూపర్‌ ఉమన్‌.. ఈ దిశగా కృషి చేసేందుకు ‘పోస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను సైతం స్థాపించింది. ఈ రోజుల్లో ఏ సోషల్‌ మీడియా అయితే మహిళల పాలిట శాపంగా మారుతోందో అదే సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని సమాజంలో మార్పు తీసుకురావడానికి తన స్వచ్ఛంద సంస్థ వేదికగా కృషి చేస్తున్నానంటోంది దీప. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాలో 14 లక్షల మంది ఫాలోవర్లున్నారు.


CP6Dn6YsK03

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని